Chandrababu Naidu: చంద్రబాబుకు జాతీయ స్థాయిలో లభించని మద్దతు.. కారణమేంటి..?

అధికారం లేకపోతే లీడర్ల పరిస్థితి ఎలా ఉంటుంది అనడానికి చంద్రబాబు ఉదంతమే ఒక ఉదాహరణ. సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతోపాటు ఒకరిద్దరు నేతలు మాత్రమే చంద్రబాబు అరెస్ట్ను ఖండించారు.

  • Written By:
  • Publish Date - September 19, 2023 / 05:07 PM IST

Chandrababu Naidu: జాతీయ రాజకీయాల్ని ఒకప్పుడు చంద్రబాబు నాయుడు శాసించాడు. ఎన్డీఏ కన్వీనర్‌గా కీలక భూమిక పోషించాడు. యునైటెడ్ ఫ్రంట్ సమయంలోను చంద్రబాబుది అత్యంత కీలక పాత్ర. ఒకప్పుడు ప్రధాని అభ్యర్థిగా కూడా ఉన్న చంద్రబాబు అరెస్ట్ అయితే నలుగురు నేతలు మినహా జాతీయ స్థాయిలో ఎవరూ స్పందించలేదు. టీడీపీలోనూ, ఇంటా.. బయట.. ఇప్పుడు ఇదే చర్చ జరుగుతోంది. అధికారాంతమున చూడవలె అయ్యవారి వైభవం అన్నట్లు.. అధికారం లేకపోతే లీడర్ల పరిస్థితి ఎలా ఉంటుంది అనడానికి చంద్రబాబు ఉదంతమే ఒక ఉదాహరణ. సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతోపాటు ఒకరిద్దరు నేతలు మాత్రమే చంద్రబాబు అరెస్ట్ను ఖండించారు. అంతకుమించి వాళ్లు కూడా ఎక్కువ మాట్లాడలేదు.
వాళ్ళిద్దరూ తప్ప ఎవ్వరు చంద్రబాబు అరెస్టుపై పెదవి విప్పలేదు. శరద్ పవార్, లాలూ ప్రసాద్ యాదవ్, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, తమిళనాడు సీఎం స్టాలిన్, సోనియా గాంధీ, రాహుల్ సహా కీలక నేతలెవరూ నోరెత్తలేదు. చంద్రబాబు విషయంలో వీళ్లంతా ఎందుకు మౌనంగా ఉన్నారో రాజకీయ వర్గాల్లో అర్థం కాని ప్రశ్న. ఇక బీజేపీలోనూ రాష్ట్ర నాయకులు ఒకరిద్దరు మాత్రమే స్పందించారు తప్ప బీజేపీ కేంద్ర నాయకత్వం మొహమాటానికి కూడా ఆ విషయాన్ని ప్రస్తావించలేదు. పైగా ఈ వ్యవహారంపై మాట్లాడొద్దని పురందేశ్వరితో పాటు మిగిలిన నాయకులకు వార్నింగ్ కూడా వచ్చింది. దాంతో రాష్ట్ర బిజెపి నాయకులు కూడా కిమ్మనకుండా ఉన్నారు. అన్నిటికన్నా విచిత్రం కమ్యూనిస్టులు స్పందించకపోవడం. ఒకప్పుడు చంద్రబాబుతో కలిసి ప్రయాణించిన పార్టీలు కూడా అసలు చంద్రబాబు అరెస్టు తమకేమీ పట్టనట్లుగా ఉన్నాయి. అదేదో వైసీపీ, టీడీపీ మధ్య పోరాటానికి సంబంధించిన వ్యవహారంగా కమ్యూనిస్టులు భావించినట్లు ఉన్నారు. లెఫ్ట్ జాతీయ నాయకత్వం కూడా చిన్న ప్రకటన అయినా ఇవ్వలేదు. అంటే
చంద్రబాబు విషయంలో ఎంత స్పష్టంగా ఉన్నారో అర్థం అవుతుంది.
లోకేష్‌ను పట్టించుకోని జాతీయ పార్టీలు
లోకేష్ తన బృందాన్ని వేసుకొని ఢిల్లీ వెళ్లి జాతీయ నాయకులను కలవాలని ప్రయత్నించినా ఎవరూ ఆసక్తి చూపించలేదు. అమిత్ షా, ప్రధాని ప్రధాని మోడీని లోకేష్ కలవాలని ప్రయత్నించినా సాధ్యం కాలేదు. ఎంపీ రామ్మోహన్ నాయుడు ప్రయత్నంతో రాజ్‌నాథ్ సింగ్ అపాయింట్మెంట్ మాత్రం దొరికింది. ఢిల్లీలో లోకేష్ ప్రెస్‌మీట్‌కి పెద్ద స్పందన లేదు. చంద్రబాబుని జాతీయ పార్టీలు ఎందుకు ఒంటరిగా వదిలేశాయి? దీనికి ప్రధాన కారణం బాబు అవకాశవాదం. చంద్రబాబు ఎవరినైనా వాడి పడేస్తారనేది దేశ రాజకీయాల్లో ఎక్కువగా వినిపించేది. అవసరానికి ఎవరితోనైనా ఆయన కలుస్తారు, అవసరం లేనప్పుడు ఎవరినైనా వదిలేస్తారు. అందువలన చంద్రబాబుకు కష్టమొస్తే అందరూ కలిసి రావాల్సిన పరిస్థితులు కనిపించడం లేదు. ఒకరిద్దరేదో పేపర్ స్టేట్మెంట్లు ఇచ్చారు తప్ప అంతకుమించి అడుగు ముందుకు వేయలేదు. బిజెపి, లెఫ్ట్ పార్టీలతో, కాంగ్రెస్‌తో.. ఇలా ఇండియాలో అన్ని పార్టీలతోనూ పొత్తులు పెట్టుకున్న ఏకైక నాయకుడు చంద్రబాబు. అంటే అవసరార్థం ఎవరితోనైనా కలవగలరు. కానీ కష్టం వచ్చినప్పుడు ఏ ఒక్కరూ ఆయన కోసం ముందుకు రాలేదు. జీవితంలో స్థిరమైన సిద్ధాంతాలు లేకపోతే పరిస్థితి ఇలాగే ఉంటుంది అనేందుకు చంద్రబాబు ఉదంతమే ఒక ఉదాహరణ.