Chandrababu Naidu: సుప్రీంకు వెళ్లి కూడా బెయిల్ వద్దన్న చంద్రబాబు.. క్వాష్ పిటిషన్‌ మీదే పట్టు.. ఎందుకు, అసలేంటిది..?

స్కిల్ కేసులో రిమాండ్‌లో ఉన్న చంద్రబాబు.. ఇప్పటివరకు బెయిల్ కోసం కనీసం దరఖాస్తు చేసుకోలేదు. సుప్రీంకు వెళ్లి కూడా క్వాష్‌ పిటిషన్ మీద పట్టు పట్టారు. దీంతో చంద్రబాబు తీరుపై సామాన్యుల్లో కొత్త చర్చ జరుగుతోంది. ఇంతకీ క్వాష్ పిటిషన్ ఏంటి అనే డిస్కషన్‌ వినిపిస్తోంది.

  • Written By:
  • Publish Date - October 3, 2023 / 03:49 PM IST

Chandrababu Naidu: చంద్రబాబు అరెస్ట్‌ వ్యవహారంతో ఏపీ రాజకీయం పూర్తిగా మారిపోయింది. స్కిల్ స్కామ్‌లో తనను కావాలని ఇరికించారని ఆరోపిస్తున్న చంద్రబాబు.. హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేయగా.. అక్కడ కొట్టేశారు. దీంతో ఆయన సుప్రీంను ఆశ్రయించారు. చంద్రబాబు పిటిషన్‌పై సుప్రీంకోర్టులో వాడీవేడీ వాదనలు జరిగాయ్. చంద్రబాబు తరఫున హరీష్ సాల్వే వాదనలు వినిపించగా.. ఏపీ సీఐడీ తరఫున సింఘ్వీ బాధ్యత తీసుకున్నారు. సెక్షన్‌ 17A గురించే ప్రధానంగా వాదనలు జరిగాయ్. స్కిల్‌ స్కామ్‌కు సంబంధించి పూర్తి ఆధారాలు ఉన్నాయని సీఐడీ తరఫు లాయర్ వాదించగా.. సోమవారం లోపు వాటిని తమ ముందు ఉంచాలని సుప్రీం ధర్మాసనం చెప్పింది. విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

దీంతో ఆ రోజు ఏం జరగబోతుందన్న ఆసక్తి ప్రతీ ఒక్కరిలో కనిపిస్తోంది. ఐతే స్కిల్ కేసులో రిమాండ్‌లో ఉన్న చంద్రబాబు.. ఇప్పటివరకు బెయిల్ కోసం కనీసం దరఖాస్తు చేసుకోలేదు. సుప్రీంకు వెళ్లి కూడా క్వాష్‌ పిటిషన్ మీద పట్టు పట్టారు. దీంతో చంద్రబాబు తీరుపై సామాన్యుల్లో కొత్త చర్చ జరుగుతోంది. ఇంతకీ క్వాష్ పిటిషన్ ఏంటి అనే డిస్కషన్‌ వినిపిస్తోంది. రిమాండ్‌కు వెళ్లినప్పటి నుంచి స్కిల్‌ కేసులో బెయిల్ తీసుకోకుండా.. ఈ కేసు కొట్టేయాలని కోరుతూ క్వాష్ పిటిషన్లు వేస్తున్నారు చంద్రబాబు. హైకోర్టు క్వాష్ పిటిషన్ కొట్టివేయగా.. ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయిచారు. అక్కడ బెయిల్ లభించే అవకాశం ఉన్నా… క్వాష్ పిటిషన్ విచారణకే మొగ్గు చూపారు. బెయిల్‌ తీసుకోకుండా.. క్వాష్ పిటిషన్‌ మీదే పట్టు పడుతుండడంతో.. రాజమండ్రి జైలు నుంచి చంద్రబాబు విడుదల కావడం రోజురోజుకు ఆలస్యం అవుతోంది. స్కిల్ కేసులో చంద్రబాబు A37 నిందితుడిగా ఉన్నారు. ఏసీబీ కోర్టు ఆయనను రిమాండ్‌కు పంపినప్పుడే బెయిల్ కోరితే.. విడుదల అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉండేవన్నది న్యాయనిపుణుల మాట.

ఐతే చంద్రబాబు మాత్రం అవినీతి కేసులో బెయిల్ తీసుకునేందుకు మొగ్గు చూపలేదు. బెయిల్ కోరకపోవడంతో విమర్శలు రావడంతో.. ఏమైందో ఏమో కానీ, ఏసీబీ కోర్టులో ఆలస్యంగా బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబు అరెస్టు తర్వాత రిమాండ్ విధించగానే బెయిల్ కోరేందుకు అవకాశం ఉంది. అయినా చంద్రబాబు వినియోగించుకోలేదు. ఆ తర్వాత హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉన్నా వాడుకోలేదు. క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ తర్వాత హైకోర్టు దాన్ని కొట్టేస్తే తిరిగి సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ తీసుకునే అవకాశం ఉన్నా.. హైకోర్టులోనే బెయిల్ కోరే అవకాశం ఉన్నా.. మొగ్గు చూపలేదు. చివరికి సుప్రీంకోర్టులోనే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.

40ఏళ్ల పొలిటికల్ కెరీర్‌లో చంద్రబాబు మీద అవినీతి మరక లేదు. జైలుకు వెళ్లిన దాఖలాలు కూడా లేవు. అలాంటిది బెయిల్‌ కోసం దరఖాస్తు చేసుకోవడం అంటే.. పరోక్షంగా తప్పు ఉందని అంగీకరించినట్లు అవుతుందనే అలా చేస్తున్నారా..? అందుకే బెయిల్‌ కోసం కనీసం దరఖాస్తు చేసుకోవడం లేదా..? క్వాష్ పిటిషన్‌ విషయంలో ఇంత పట్టు మీద ఉంది అందుకేనా అనే చర్చ జరుగుతోంది.