లారెన్స్ బిష్ణోయ్… ఇప్పుడు ఈ పేరు వింటే బాలీవుడ్ షేక్ అవుతోంది. దావూద్ ఇబ్రహీంకే భయపడని బాలీవుడ్ స్టార్ హీరోలు ఇప్పుడు లారెన్స్ బిష్ణోయ్ పేరు వింటే వణికిపోతున్నారు. 700 మంది గ్యాంగ్, 5 రాష్ట్రాల్లో షార్ప్ షూటర్స్… విదేశాల్లో కూడా బలమైన నెట్వర్క్… నేర సామ్రాజ్యంలో లేని కేసు లేదు, చేయని పని లేదు. గంజాయి, డ్రగ్స్, ఆయుధాలు ఇలా ఎన్నో అక్రమాలు… హత్యలు, బెదిరింపులు, సెటిల్మెంట్లు… ఇప్పుడు ప్రముఖుల హత్యకు రూట్ మ్యాప్… ఇలా లారెన్స్ బిష్ణోయ్ అనే 31 ఏళ్ళ యువకుడు నార్త్ ఇండియాను షేక్ చేస్తున్నాడు.
పంజాబీ సింగర్ సిద్దూ మూసేవాలాను హత్య చేసిన తర్వాత లారెన్స్ పేరు దేశ వ్యాప్తంగా మార్మోగింది. తన స్నేహితుడు విక్కిని హత్య చేసేందుకు అతని మేనేజర్ షగన్ ప్రీత్ సింగ్ కు సహకరించాడని సిద్దూను అత్యంత దారుణంగా చంపింది లారెన్స్ గ్యాంగ్. దసరా రోజున మాజీ మంత్రి బాబా సిద్దిఖీని చంపడంతో మహారాష్ట్రలో కూడా లారెన్స్ గ్యాంగ్ రక్త చరిత్ర రాయడం మొదలుపెట్టింది. ఇదంతా గుజరాత్ లోని సబర్మతి జైలు నుంచే లారెన్స్ చేయడం గమనార్హం. అక్కడి నుంచే వాయిస్ కాల్స్ మాట్లాడుతూ గ్యాంగ్ కు ఆదేశాలు ఇస్తున్నాడు.
ఇక ఇప్పుడు అతన్ని చంపితే రూ.1 కోటి 11 లక్షల 11 వేల 111 రూపాయల రివార్డును ప్రకటించాడు ఓ వ్యక్తి. మహారాష్ట్రలోని ముంబైలో ఎన్సీపీ నేత, సల్మాన్ ఖాన్ స్నేహితుడు బాబా సిద్ధిఖీ హత్య తర్వాత లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ హాట్ టాపిక్ అయింది. అందరూ ఆ గ్యాంగ్ కు భయపడుతున్న సమయంలో ఈ ప్రకటన షేక్ చేస్తోంది. ఇంతకు ఆ ప్రకటన ఇచ్చిన వ్యక్తి ఎవరంటే … రాజ్ షెకావత్. రాజ్ షెకావత్ వీడియో వీడియో రిలీజ్ చేయగా అది ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. లారెన్స్ బిష్ణోయ్‌ని ఎన్‌కౌంటర్ చేసిన పోలీసులకు కోటి 11 లక్షల 11 వేల 111 రూపాయల రివార్డు ఇస్తామని సంచలన ప్రకటన చేసాడు.
అంతే కాకుండా చంపిన పోలీసులను గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటాం అని చెప్పాడు. రాజ్ షెకావత్ అలియాస్ రాజేంద్ర షెకావత్ క్షత్రియ కర్ణి సేన జాతీయ అధ్యక్షుడు. 2024లో రాజస్థాన్‌లోని జుంజును లోక్‌సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. అప్పుడు రాజ్ షెకావత్ కు 7690 ఓట్లు వచ్చాయి. ఆయన కాంగ్రెస్ అభ్యర్ధి బ్రిజేంద్ర ఓలాపై 5,45,478 ఓట్ల తేడాతో ఓడిపోయారు. బీజేపీకి చెందిన శుభకరన్ చౌదరి రెండో స్థానంలో నిలవగా రాజ్ షెకావత్ మూడో స్థానంలో ఉన్నాడు.
రాజ్ షెకావత్ ప్రస్తుతం క్షత్రియ మహాసమ్మేళనం కోసం గుజరాత్ పర్యటనకు వెళ్ళారు. ఇదే రాష్ట్రంలోని సబర్మతి జైల్లో లారెన్స్ బిష్ణోయ్ ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. గతంలో కూడా రాజ్ షెకావత్ లారెన్స్ ను గుజరాత్‌లోని వడోదరలో ఎన్‌కౌంటర్ చేయాలని డిమాండ్ చేసి సంచలనం సృష్టించాడు. లారెన్స్ పై షెకావత్ పగ పెంచుకోవడానికి కారణం… లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ 2023 డిసెంబర్‌లో రాజస్థాన్ లోని జైపూర్‌లో శ్రీ రాష్ట్రీయ రాజ్‌పుత్ కర్ణి సేన జాతీయ అధ్యక్షుడు సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడిని హత్య చేసింది. అప్పటి నుంచి లారెన్స్ గ్యాంగ్ కు వ్యతిరేకంగా ఆయన పని చేస్తున్నారు.