TS Assembly” అసెంబ్లీ సమావేశాలంటే అంత అలుసెందుకు కేసీఆర్ గారూ..?

అసెంబ్లీలో చర్చించాల్సిన అంశాలను కూడా ప్రెస్ మీట్లు పెట్టేసే నేతలు చెప్పేస్తున్నారు. మీడియా ముందే వాదించుకుంటున్నారు. సమాధానాలు చెప్పేసుకుంటున్నారు. అందుకేనేమో ఇక అసెంబ్లీతో పనేముంది అనుకున్నట్టున్నారు మన నేతలు.

  • Written By:
  • Publish Date - August 2, 2023 / 06:44 PM IST

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఈ టర్మ్ లో బహుశా ఇవే చివరి అసెంబ్లీ సమావేశాలు. ఈ ఏడాది డిసెంబర్ లో అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే అసెంబ్లీ మళ్లీ కొలువుదీరనుంది. అయితే అసెంబ్లీ సమావేశాల నిర్వహణలో తెలంగాణ ప్రభుత్వం చాలా వెనుకబడి ఉంది. అతి తక్కువ రోజులు అసెంబ్లీ నిర్వహిస్తున్న రాష్ట్రాల్లో.. తెలంగాణ దేశంలోనే ఫస్ట్ ప్లేస్ లో ఉంది. దీన్ని బట్టి అసెంబ్లీ సమావేశాలంటే కేసీఆర్ ప్రభుత్వానికి ఎంత నిర్లక్ష్యమో అర్థం చేసుకోవచ్చు.

రాజ్యాంగం ప్రకారం ప్రతి ఆరు నెలలకు అసెంబ్లీ సమావేశం కావాలి. రాష్ట్రంలో పరిస్థితులపై ప్రభుత్వం ప్రతిపక్షాల ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి. అసెంబ్లీ నిర్దేశించిన మేరకే వాస్తవానికి పాలన జరగాలి. ఏదైనా కీలక నిర్ణయం తీసుకున్నప్పుడు అసెంబ్లీ ఆమోదం పొందిన తర్వాతే వాటిని అమలు చేయాలి. అసెంబ్లీ అనేది ప్రజా ప్రతినిధుల వేదిక అంటే ప్రజలకు ప్రాతినిధ్యం వహించే వారు కొలువుదీరే సభ. అక్కడ వాళ్లు హాజరయ్యారంటే ప్రజలు హాజరైనట్టే. అయితే ప్రస్తుత మన పాలకులు అసెంబ్లీ అర్థాన్నే మార్చేశారు. అది పూర్తిగా ప్రభుత్వం ఆధీనంలో నడిచే సభగా తీర్చిదిద్దారు. ఇందులో విపక్షాలకు స్థానం లేదు. ప్రభుత్వం చెప్పినట్టు నడుచుకోవాలి.. ప్రతిపక్షం తోకజాడిస్తే వేటు వేసు బయటకు పంపించేయడమే. అలా తయరయ్యాయి అసెంబ్లీలు.

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు పెట్టి ఈ నెల 11నాటికి ఆరు నెలలు అవుతుంది. అంటే ఆ లోపు అసెంబ్లీ మళ్లీ సమావేశం కావాలి. అందుకే రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఏదో తూతూమంత్రంగా మూడు రోజులు సభ పెట్టి మమ అనిపించేస్తే ఓ పనైపోతుందే ఫీలింగులో ప్రభుత్వం ఉందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. కనీసం నెల రోజులు సమావేశాలు నిర్వహించాలని కాంగ్రెస్, బీజేపీ డిమాండ్ చేస్తున్నా వారి మొర ఆలకించే నాథులే లేరు. అసెంబ్లీలో చర్చించాల్సిన అంశాలను కూడా ప్రెస్ మీట్లు పెట్టేసే నేతలు చెప్పేస్తున్నారు. మీడియా ముందే వాదించుకుంటున్నారు. సమాధానాలు చెప్పేసుకుంటున్నారు. అందుకేనేమో ఇక అసెంబ్లీతో పనేముంది అనుకున్నట్టున్నారు మన నేతలు.