తెలంగాణలోని 115 అసెంబ్లీ స్థానాలకు బీఆర్ఎస్ ప్రకటించిన ఫస్ట్ లిస్టుపై ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ డిబేట్ నడుస్తోంది. ఈ లిస్టులో ముఖ్యమైన అంశాలను 2 ఉన్నాయి. అవేమిటంటే.. తొమ్మిది స్థానాల్లో అభ్యర్థులను మార్చగా.. నాలుగు సీట్లను పెండింగ్‌లో పెట్టారు. బోథ్, స్టేషన్ ఘన్‌పూర్, ఖానాపూర్, ఆసిఫాబాద్, వైరా, కామారెడ్డి, ఉప్పల్, వేములవాడ, కోరుట్ల స్థానాల్లో అభ్యర్థులను మార్చారు. కోరుట్లలో విద్యాసాగర్ బదులు ఆయన కుమారుడు సంజయ్ కు టికెట్ కేటాయించారు. నర్సాపూర్, జనగామ, నాంపల్లి, గోషామహల్ సీట్లు పెండింగ్‌లో పెట్టారు. ఈ సారి సీఎం కేసీఆర్ గజ్వేల్‌తో పాటు కామారెడ్డి నుంచి పోటీ చేస్తారు.
ఉప్పల్ – సుభాష్ రెడ్డి
ఉప్పల్ లో సిట్టింగ్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డికి కేసీఆర్ టికెట్ ఇవ్వలేదు. అక్కడి నుంచి టికెట్ ఆశించిన మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కు కూడా నిరాశే మిగిలింది. ఇప్పుడు సుభాష్ రెడ్డి, బొంతు రామ్మోహన్ ఏకమై.. తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేని లక్ష్మారెడ్డికి టికెట్ ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే బేతి సుభాష్ రెడ్డికి టికెట్ దక్కకపోవడానికి గల కారణాలు డిఫరెంట్ గా ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ విజయలక్ష్మికి, ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి కి మధ్య ఏ దశలోనూ పొసగలేదు. 2022 డిసెంబరులో ఉప్పల్ నియోజకవర్గంలోని చిలుకానగర్ లో అభివృద్ధి కార్యక్రమాలకు మేయర్ విజయలక్ష్మి శంకుస్థాపన చేశారు. అయితే మేయర్ శంకుస్థాపనలు ఎలా చేస్తారంటూ.. ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి అనుచరులు ఆ ప్రోగ్రాంలో చేసిన రాద్ధాంతం సమాచారం కేసీఆర్ దృష్టికి వెళ్ళింది. ఐక్యతా భావం లోపించడం అనేది బేతి సుభాష్ రెడ్డికి మైనస్ పాయింట్ అయింది.
స్టేషన్ ఘనపూర్ – రాజయ్య
స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కు ఈసారి టికెట్ దక్కలేదు. ఈ స్థానంలో స్థానిక లీడర్ కడియం శ్రీహరికి టికెట్ ఇచ్చారు. టికెట్ రాకపోవడానికి ఆయన ప్రవర్తనే ప్రధాన కారణమంటున్నారు రాజకీయ మేధావులు. స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే రాజయ్య, జానకీపురం మహిళా సర్పంచ్ నవ్య ఎపిసోడ్ అందరికీ తెలిసిందే. ఎమ్మెల్యే రాజయ్య వేధింపులకు గురి చేస్తున్నారంటూ జానకీపురం మహిళా సర్పంచ్ నవ్య స్వయంగా మీడియా ముందు సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వ్యక్తి ఇవేం పిచ్చి పనులు అంటూ రాజయ్యపై సోషల్ మీడియా వేదికగా దుమ్మెత్తిపోశారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే రాజయ్య నేరుగా జానకీపురం సర్పంచ్ నవ్య ఇంటికి వెళ్లి లోలోప చర్చలు జరిపి ఆమెను శాంతింపజేసే ప్రయత్నాలు కూడా చేశారు. దీంతో ఆమె ఇంటి నుండి మీడియాతో మాట్లాడుతూ గ్రామ అభివృద్ది కొన్ని నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ కారణంగానే ఎమ్మెల్యే రాజయ్యకు స్టేషన్ ఘన్ పూర్ టికెట్ దక్కలేదని విశ్లేషకులు భావిస్తున్నారు.
వైరా- రాములు నాయక్
వైరా నియోజకవర్గంలో నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా బానోత్ మదన్ లాల్ అభ్యర్థిత్వాన్ని సీఎం కేసీఆర్ ప్రకటించారు. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యే రాములు నాయక్ కు మొండి చెయ్యే మిగిలింది. 2014 నుంచి 2018 వరకు మదన్ లాల్ కు ప్రస్తుత కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డికి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. గత పోల్స్ లో లావుడ్యా రాములు నాయక్ కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డారు. దీంతో రాములు నాయక్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి 2013 ఓట్ల స్వల్ప మెజార్టీతో గెలుపొందారు. ఆ ఎన్నికల్లో రాములు నాయక్ కు 52,650 ఓట్లు రాగా, బానోత్ మదన్ లాల్ కు 50637 ఓట్లు లభించాయి. 2018లో ఓటమి చెందినా మదన్ లాల్ నియోజకవర్గంలో నిరంతరం పర్యటించారు. బీఆర్ఎస్ నిర్వహించిన పలుసర్వేలలో సిట్టింగ్ ఎమ్మెల్యే రాములు నాయక్ కంటే మదన్ లాల్ కు సానుకూల వాతావరణ ఉందని తేలింది. దీంతో సీఎం కేసీఆర్ ఆయనకే టికెట్ కేటాయించారు. కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఢీకొనే తత్వం ఉండటం మదన్ లాల్ కు ప్లస్ పాయింట్ అయింది. గతంలో కాంగ్రెస్ లో పనిచేసి ఉండటం సిట్టింగ్ ఎమ్మెల్యే రాములు నాయక్ కు మైనస్ పాయింట్ అయింది.
ఖానాపూర్ – రేఖానాయక్
ఖానాపూర్ అసెంబ్లీ టికెట్ భూక్య జాన్సన్ రాథోడ్ నాయక్ కు దక్కింది. ఏకంగా ఆరుగురు నేతలు టిక్కట్ కోసం ట్రై చేయడం.. సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖానాయక్ కు మైనస్ పాయింట్ అయింది. ఆమెకు క్యాడర్ నుంచి తీవ్ర వ్యతిరేకత ఉందనే సంకేతాలను బీఆర్ఎస్ అధిష్టానానికి పంపింది. ఎంతసేపూ కమీషన్లపై ఫోకస్ పెట్టే ఎమ్మెల్యే అభివృద్ధిపై అస్సలు దృష్టిపెట్టడం లేదని బహిరంగంగానే విమర్శలు వచ్చాయి. మంత్రి కేటీఆర్ స్నేహితుడు కావడం జాన్సన్ నాయక్ కు కలిసి వచ్చింది.
వేములవాడ- చెన్నమనేని రమేష్
వేములవాడ అసెంబ్లీ టికెట్ చల్మెడ లక్ష్మీనరసింహారావుకు దక్కింది. ఇక సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబుకు టికెట్ దక్కలేదు. పదిహేనుళ్లుగా సాగుతున్న పౌర సత్వ వివాదమే.. ఆయనకు టికెట్ రాకుండా చేసిందని అంటున్నారు. నేడో.. రేపో తీర్పు వెలువడనున్న నేపథ్యంలో ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయలేకపోయింది బీఆర్ఎస్ పార్టీ.
బోధ్ – రాథోడ్ బాపురావు
బోథ్ అసెంబ్లీ టికెట్ అనిల్ జాదవ్ కు దక్కింది. సిట్టింగ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు కు కేసీఆర్ నో చెప్పారు. ఆయన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేదనే అపవాదు ఉంది. దీనితో ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. వ్యతిరేకతతోపాటు పార్టీలో అసంతృప్తి ఉంది. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఉన్నారు. ఇలాంటి అంశాలతో టిక్కెట్ ఇచ్చినా గెలిచే అవకాశాలు లేవని సర్వేలలో తెలిందట.
ఆసిఫాబాద్ – ఆత్రం సక్కు
ఆసిఫాబాద్ అసెంబ్లీ టికీట్ కోవ లక్ష్మికి దక్కింది. ఆమె గత ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ స్థానిక సంస్థల ఎన్నికల్లో జడ్పీటీసీగా గెలిచి జడ్పీ చైర్ పర్సన్ పదవి దక్కించుకున్నారు. ఈ నిర్ణయం సిట్టింగ్ ఎమ్మెల్యే ఆత్రం సక్కుకు ఓ రకంగా మింగుడుపడని విషయమే. అయితే ఆత్రం సక్కుకు అసెంబ్లీకి ప్రత్యామ్నా యంగా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఆదిలాబాద్ నుంచి ఎంపీగా టికెట్ ఇచ్చేలా కేసీఆర్ హామీ ఇచ్చినట్లు సమాచారం. వాస్తవానికి కాంగ్రెస్ నుంచి విజయం సాధించిన ఆత్రం సక్కు బీఆర్‌ఎస్‌లో చేరిన క్రమంలో కోవ లక్ష్మి వర్గం కొంత నిరుత్సాహానికి గురైంది. కేసీఆర్ చేయించిన సర్వేల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న సక్కుకు ప్రతికూల జనాభిప్రాయం రావడం వల్లే టికెట్ ఇవ్వలేదని తెలుస్తోంది.