PM Modi: మోదీజీ.. బ్రిజ్ భూషణ్‌పై మీకెందుకంత ప్రేమ.. జపాన్‌లో ఏం జరిగిందో మీకు తెలుసా..?

మన్‌కీ బాత్ ద్వారా 130 కోట్ల దేశ ప్రజలకు మీ అభిప్రాయాలను వినిపిస్తూ ఉంటారు కదా.. ఈ ఒక్కసారి మీరు మా మాట కూడా ఆలకిస్తారని ఆశిస్తున్నాం. బహుశా మీకు , మీ పార్టీ నేతలకు ఈ విషయం చాలా చిన్నగా కనిపించవచ్చు.

PM Modi: గౌరవనీయులైన ప్రధానమంత్రికి, ముందుగా మీకు శుభాకాంక్షలు. విశ్వ గురువుగా ప్రపంచం మొత్తం మీకు నీరాజనాలు పడుతుంటే.. ఈ దేశ ప్రధానిగా మిమ్మల్ని చూసి గర్విస్తూ మా రోమాలు నిక్కపొడుచుకుంటున్నాయి. ఇటీవల మీరు ఆస్ట్రేలియా వెళ్లినప్పుడు నమో.. నమో.. అంటూ ప్రవాస భారతీయులు చేసిన నినాదాలు ఇంకా మా చెవుల్లో మారుమోగుతూనే ఉన్నాయి. మోదీ ఈజ్ బాస్ అంటూ ఆస్ట్రేలియా ప్రధాని అనగానే.. మీరు చిందించిన చిరు నవ్వులు కూడా మా కళ్ల ముందు ఇంకా కదులుతూనే ఉన్నాయి. విదేశీ యాత్రలు, పార్లమెంట్ ప్రారంభోత్సవం, ఎన్నికల ఫలితాలపై సమీక్షలు, రానున్న ఎన్నికల్లో ఎలా గెలావాలా అన్నదానిపై కసరత్తులు.. ఇలా అనేక విషయాల్లో క్షణం తీరికలేకుండా మీరు ఉంటారని తెలిసినా.. ఓ విషయాన్ని మీ దృష్టికి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నాం. మన్‌కీ బాత్ ద్వారా 130 కోట్ల దేశ ప్రజలకు మీ అభిప్రాయాలను వినిపిస్తూ ఉంటారు కదా.. ఈ ఒక్కసారి మీరు మా మాట కూడా ఆలకిస్తారని ఆశిస్తున్నాం.
బహుశా మీకు , మీ పార్టీ నేతలకు ఈ విషయం చాలా చిన్నగా కనిపించవచ్చు. పట్టించుకోవాల్సిన అవసరం లేదనిపించవచ్చు. దీని వెనుక రాజకీయాలు కూడా ఉన్నాయని మీ పార్టీ నేతలు ఆరోపణలు కూడా చేస్తూ ఉండొచ్చు.. మీతో సహా మీ పార్టీ నేతలు ఎలా అనుకున్నా… అసమాన ప్రతిభతో ప్రపంచ పటంపై ఈ దేశాన్ని సగర్వంగా తలెత్తుకునేలా చేసిన మహిళా క్రీడాకారులకు సంబంధించిన విషయం ఇది. అందుకని కాస్త పెద్ద మనసు చేసుకుని ఆలకించండి..
రెజ్లర్లు ఎందుకు కొంతకాలంగా ఆందోళన చేస్తున్నారు ? వాళ్లు ఏం కోరుకుంటున్నారు ? ఢిల్లీ నడివీధుల్లో పోలీసులు ఈడ్చుకెళుతున్నా.. బూటుకాళ్లతో తన్నుతున్నా.. ఎందుకు వెనకడుగు వేయడం లేదు..? వీటి గురించి మీకు వివరంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ దేశంలో ఏం జరిగినా.. మీకు ఆసక్తి ఉన్నా లేకపోయినా.. ప్రధానమంత్రి హోదాలో అన్ని విషయాలు మీ చెవిన పడుతూనే ఉంటాయి. అందుకని రెజ్లర్ల పోరాటం గురించి మీకు తెలియదనే అమాయకత్వం మాకైతె లేదు. కాకపోతే.. వాళ్ల పోరాటాన్ని చూసి.. వాళ్లకు జరిగిన అన్యాయాన్ని చూసి.. వాళ్లపై పోలీసుల ప్రవర్తిస్తున్న తీరును చూసి.. ఈ దేశం మొత్తం కలత చెందుతున్నా మీతో సహా కేంద్ర ప్రభుత్వం గానీ.. మీ పార్టీకి చెందిన నేతలు కూడా ఎందుకు స్పందించడం లేదన్నదే మాకు అంతుపట్టడం లేదు.
బ్రిజ్ భూషణ్‌ మీ పార్టీ పార్లమెంట్ సభ్యుడే కావొచ్చు. ఆరుసార్లుగా మీ పార్టీకి లోక్‌సభలో ప్రాతినిధ్యం వహించి ఉండొచ్చు. ఉత్తరప్రదేశ్‌లో.. ముఖ్యంగా గోండా ప్రాంతంలో అంగబలం, రాజకీయ బలం ఉన్న కీలక నేత కావొచ్చు. కానీ ఆయన ఓ క్రిమినల్ అన్న విషయాన్ని మీరు మర్చిపోయారా..? అవును నేను గతంలో హత్య కూడా చేశాను అని బ్రిజ్ భూషణ్ గతంలో ఇంటర్వ్యూ ఇచ్చిన సంగతి మీ వరకూ రాలేదా..? బాబ్రీ మసీదు విధ్వంసం నుంచి మానభంగాలు, హత్యలు, ఎన్నికల కోడ్ ఉల్లంఘనలు ఇలా 40కి పైగా క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న వ్యక్తి విషయంలో మీరెందుకు ఉదారంగా ఉంటున్నారో ఈ దేశ ప్రజలకు ఏకోశానా అర్థం కావడం లేదు.
సరే మీ ఎంపీ గారి మీదున్న పాత కేసులు, క్రిమినల్ రికార్డుల గురించి ఇప్పుడెందుకు అనుకుంటే.. కాసేపు వాటిని పక్కన పెట్టి.. రెజ్లర్ల గురించి మాట్లాడుకుందాం. ఆరుగురు మహిళా రెజ్లర్లతో పాటు ఒక మైనర్ ఇచ్చిన లైంగిక ఫిర్యాదులపై నమోదైన రెండు ఎఫ్ఐఆర్‌లను మీరు చూశారా..? రెజ్లర్లను దగ్గరకు తీసుకోవడం.. వాళ్ల ప్రైవేటు పార్ట్స్ పై చేతులు వేయడం.. మీరు నాకు సహకరిస్తే నేను మీకు సహకరిస్తానని చెప్పడం.. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు చేయాల్సిన పనులేనా ఇవి. తండ్రిలాగా క్రీడాకారులను ప్రోత్సహించి.. వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాల్సిన ఫెడరేషన్ అధ్యక్షుడు ఇంత నీచానికి దిగజారడాన్ని మీరెలా చూస్తున్నారు.
దేశం గర్వించదగ్గ క్రీడాకారులు తమ పతకాలను గంగలో కలిపేందుకు కూడా సిద్ధమైనా సరే.. మీతో సహా స్పందించాల్సిన నేతలంతా ఎందుకు మౌనంగా ఉంటున్నారు ? సందర్భం వచ్చింది కాబట్టి.. మీకు ఒక విషయం గురించి చెప్పాలనుకుంటున్నాం. మీరు ఇటీవలే జీ 7 దేశాల సమావేశంలో పాల్గొనేందుకు జపాన్ వెళ్లారు కదా. హిరోషిమా వేదికగా ప్రపంచానికి సందేశం కూడా ఇచ్చారు కదా. అయితే ఆ దేశ ప్రధాని తీసుకున్న ఓ నిర్ణయం గురించి ఈ ప్రస్తావించాలి. జపాన్ ప్రధాని ఫునియో కిషిదా కుమారుడు షొతారో ఈ మధ్య వార్తల్లోకి వచ్చాడు. ఎందుకో తెలుసా.. తన తండ్రి ప్రధానమంత్రి కదా.. ఎంత విచ్చలవిడిగా ప్రవర్తించినా.. తనను ఎవరూ ఏమీ చేయలేరనుకున్నాడు. తండ్రికి ఎగ్జిక్యూటివ్ పాలసీ సెక్రటరీగా పనిచేస్తున్న షొతారో.. అధికార దర్పాన్ని ప్రదర్శించాడు. తండ్రి అధికార నివాసాన్ని తన ప్రైవేటు పార్టీ కోసం వాడుకున్నాడు. ప్రైవేటు పార్టీల కోసం ప్రభుత్వ కార్యాలయాలను దుర్వినియోగం చేస్తారా అంటూ జపాన్ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం ప్రధాని చెవిన పడింది. విచారణ జరిపించిన ఆయన తన కొడుకు చేసిన నిర్వాకాన్ని లైట్ తీసుకోలేదు. కొడుకుకి కట్టపెట్టిన ఎగ్జిక్యూటివ్ పాలసీ సెక్రటరీ పదవిని పీకి పక్కన పెట్టారు. ఇకపై అధికారిక వ్యవహారాలకు దూరంగా ఉండమంటూ కొడుక్కి వార్నింగ్ కూడా ఇచ్చారు. జపాన్ ప్రధాని తన సొంత కొడుకు విషయంలో స్పందించిన తీరు అది. కానీ మన దేశంలో ఏం జరుగుతోంది. అధికార పార్టీ ఎంపీపై లైంగిక ఆరోపణలు వస్తే.. ఆ ఆరోపణలు చేసిన వాళ్లు లాఠీ దెబ్బలు తింటూ వారాల తరబడి పోరాటం చేస్తున్నా ఆ ఎంపీపై కనీసం చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా లేకపోవడాన్ని ఏమనుకోవాలి.
సరే బ్రిజ్ భూషణ్‌తో పాటు మీ పార్టీ నేతలు చెబుతున్నట్టు ఆయన సచ్చీలుడే అనుకుందాం. రెజ్లర్లే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అనుకుందాం.. వాటిని నిరూపించేందుకైనా దర్యాప్తు చేయించాలి కదా. 40కి పైగా క్రిమినల్ కేసులు ఉన్నా.. రెజ్లర్ల విషయంలో తాను పరిధి దాటలేదన్న విషయాన్ని బ్రిజ్ భూషణ్ నిరూపించుకోవాలి కదా? ఎందుకు అలా జరగడం లేదు.
ఆడపిల్లలు.. అది కూడా దేశం గర్వించదగ్గ పతక విజేతలు.. కన్నీరు పెట్టడం.. అవమానాలు ఎదుర్కోవడం.. ఈ దేశానికి ఏమాత్రం మంచి కాదు మోడీజీ.. ఇప్పటికైనా స్పందించండి. ఆరోపణలు ఎదుర్కొంటున్న మీ ఎంపీ వల్ల మీ పార్టీకి కలిగే ప్రయోజనాల సంగతి పక్కన పెట్టి.. విచారణ జరిపించండి.. బ్రిజ్ భూషణ్‌ సచ్చీలుడు అవునో, కాదో తేల్చండి.
మళ్లీ చెబుతున్నాం.. ఆడపిల్లల శోకం ఏమాత్రం మంచికాదు మోదీజీ…!
ఇట్లు..
మీ..!
దేశ పౌరుడు!