VijayaSai Reddy: విజయసాయి రెడ్డికి, జగన్‌కు మధ్య చెడిందా…?

ఒకప్పుడు జగన్ ఎక్కడ ఉంటే అక్కడ విజయసాయి రెడ్డి ప్రత్యక్షమయ్యే వారు. కానీ ఇప్పుడు తాడేపల్లి మొహం కూడా చూడట్లేదు. జగన్ తో కరచాలనమే కష్టంగా మారింది.

  • Written By:
  • Publish Date - February 25, 2023 / 04:30 PM IST

విజయసాయి రెడ్డి.. వైసీపీలో కీలక నేత. పార్టీ ఎంపీగా కూడా ఉన్నారు. ఆ పార్టీ అధినేత జగన్ రాజకీయాల్లోకి రాకముందు నుంచి కూడా విజయసాయి రెడ్డి వైఎస్ ఫ్యామిలీతో ఉంటున్నారు. దివంగత సీఎం వై.ఎస్.రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కూడా జగన్ వ్యాపార లావాదేవీలన్నీ విజయసాయి రెడ్డే చూసుకునేవారు. అయితే రాజశేఖర రెడ్డి మరణానంతరం క్విడ్ ప్రోకో ఆరోపణలు రావడం, కేసులు నమోదవడం, జైలుకు వెళ్లడం, పార్టీ పెట్టడం.. లాంటివన్నీ చకచకా జరిగిపోయాయి. వీటన్నిటిలోనూ జగన్ కు తోడుగానే ఉన్నారు విజయసాయి రెడ్డి. అయితే ఇప్పుడు విజయ సాయి రెడ్డిని జగన్ పెద్దగా పట్టించుకోవట్లేదనే వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.

 

వైసీపీ పెట్టక ముందు జగన్ తో పాటు జైలుకెళ్లిన వారిలో విజయసాయి రెడ్డి ఒకరు. ఆ తర్వాత బయటకు వచ్చి పార్టీ పెట్టారు. పార్టీని 2019లో అధికారంలోకి తీసుకొచ్చారు. అప్పటి వరకూ జగన్ కు అన్నీ తానై వ్యవహరించారు విజయసాయి రెడ్డి. ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత కూడా విజయ సాయి రెడ్డే అన్ని పనులు చక్కబెట్టేవారు. పార్టీలో నెంబర్ 2 ఎవరంటే విజయసాయి రెడ్డి పేరే వినిపించేది. అయితే రెండేళ్లు గడిచే సరికి విజయసాయి రెడ్డి పేరు క్రమంగా కనుమరుగైపోవడం మొదలైంది. ఇప్పుడు పార్టీలో ఆయన పేరు పెద్దగా వినిపించట్లేదు. జగన్ వెంట కూడా కనిపించట్లేదు. అసలు ఎందుకింత మార్పు..?

 

పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉత్తరాంధ్ర వ్యవహారాలను చక్కబెట్టాల్సిందిగా విజయసాయి రెడ్డిని ఆదేశించారు జగన్. అందులో భాగంగా విశాఖలో మకాం వేసిన విజయసాయి రెడ్డి పార్టీకోసం ఎంతో శ్రమించారు. ఈ క్రమంలో విజయసాయి రెడ్డిపైన అనేక ఆరోపణలు వచ్చాయి. అక్కడి ప్రజాప్రతినిధులందరూ విజయసాయి రెడ్డి పెత్తనాన్ని సహించలేక జగన్ కు కంప్లెయింట్స్ చేసినట్టు సమాచారం. అంతేకాక విశాఖలో భూకబ్జా ఆరోపణలు కూడా వినిపించాయి. అల్లుడి కుటుంబం కోసం విజయసాయి రెడ్డి అక్కడ అన్నీ తానై వ్యవహరించారనే గుసగుసలు వినిపించాయి. దీంతో విజయసాయి రెడ్డిని ఉత్తరాంధ్ర బాధ్యతల నుంచి తప్పించారు జగన్. అంతేకాదు.. పార్టీ అనుబంధ విభాగాల బాధ్యతల నుంచి కూడా తప్పించారు. ఒకప్పుడు సోషల్ మీడియాను చూసిన సాయిరెడ్డిని ఆ బాధ్యతల నుంచి కూడా తొలగించి సజ్జల రామకృష్ణా రెడ్డికి అప్పగించారు. ఒకప్పుడు జగన్ ఎక్కడ ఉంటే అక్కడ విజయసాయి రెడ్డి ప్రత్యక్షమయ్యే వారు. కానీ ఇప్పుడు తాడేపల్లి మొహం కూడా చూడట్లేదు. జగన్ తో కరచాలనమే కష్టంగా మారింది.

 

నిన్నమొన్నటివరకూ విజయసాయి రెడ్డి ట్వీట్లలో ఉన్న పదును కూడా ఈ మధ్య బాగా తగ్గింది. ఇదే సమయంలో తారకరత్న మరణించడంతో చంద్రబాబు కుటుంబసభ్యులతో సన్నిహితంగా మెలగాల్సి వచ్చింది. ఇది కూడా జగన్ ఆగ్రహానికి కారణమైందనే వార్తలు వినిపిస్తున్నాయి. విజయసాయి రెడ్డి కూడా వై.ఎస్. కుటుంబానికి ఎంత చేసినా తనకు చివరకు మిగిలింది ఇదేనంటూ సన్నిహితుల వద్ద వాపోతున్నట్టు సమాచారం. అందుకే తన పనేదో తాను చేసుకుంటూ పోతున్నారట.