Rajinikanth Vs Ysrcp: ఏపీలో రాజకీయాలు మరీ దిగజారిపోతున్నాయి. ముఖ్యంగా అధికార వైసీపీ రాజకీయం అవమానకరంగా ఉంటోంది. గతానికి భిన్నంగా దిగజారుడు రాజకీయాలు చేస్తోంది. సూపర్ స్టార్ రజినీ కాంత్‌పై వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలే దీనికి నిదర్శనం. ఆయనపై వ్యక్తిగతంగా విమర్శలు చేసింది. వ్యక్తిత్వ హననానికి పాల్పడుతోంది. సోషల్ మీడియాలోనూ రెచ్చిపోతోంది. అసలు వైసీపీని రజినీ ఒక్క మాటా అనలేదు. తనకు నచ్చిన ఎన్టీఆర్‌ను, చంద్రబాబును పొగిడారంతే. ఆ మాత్రానికే రజినీలాంటి వ్యక్తిపై వైసీపీ ఇంతలా దిగజారి విమర్శలు చేయాలా? ఎన్టీఆర్ గురించి గొప్పలు చెబితే వైసీపీ తట్టుకోలేకపోతోందా? లేక కావాలని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందా?
గత వారం రజినీకాంత్ ఏపీలో పర్యటించారు. ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో పాల్గొని ఆయన గురించి చాలా గొప్పగా చెప్పారు. పనిలోపనిగా చంద్రబాబు పాలన, విజన్ గురించి ఇంకాస్త ఎక్కువగా చెప్పుకొచ్చారు. అంతే.. వైసీపీ నేతలకు మండింది. రజినీ ఏపీ నుంచి వెళ్లడం ఆలస్యం వైసీపీ నేతలు రజినీపై ఎదురుదాడికి ప్రయత్నించారు. ముఖ్యంగా ఆ పార్టీకి చెందిన కొడాలి నాని వంటి బూతు నేతలు రజినీపై బూతులతో విరుచుకుపడ్డారు. బాడీ షేమింగ్‌కు పాల్పడ్డారు. ఆయన సినిమాల గురించి, వ్యక్తిత్వం గురించి నీచంగా మాట్లాడారు. ఇది రజినీ అభిమానుల్ని తీవ్రంగా బాధించింది. తమిళ అభిమానులే కాకుండా.. తెలుగు రాష్ట్రాలకు చెందిన అభిమానులు కూడా వైసీపీ తీరుపై మండిపడ్డారు. ఇప్పుడు ఏపీలో ఇదే ట్రెండింగ్ టాపిక్. ఒకవైపు వైసీపీ నేతలు రజినీని విమర్శిస్తుంటే.. ఆయన ఫ్యాన్స్, టీడీపీ నేతలు, ఇతర సినిమా హీరోల ఫ్యాన్స్ కూడా రజినీకి మద్దతుగా ట్వీట్లు చేస్తున్నారు. వైసీపీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
వైసీపీకి ఎందుకీ కక్ష?
నిజానికి రజినీ వైసీపీని ఒక్క మాట కూడా అనలేదు. సభలో ఎన్టీఆర్ గొప్పదనాన్నిగురించి వివరించారు. ఎన్టీఆర్ ఒక యుగ పురుషుడని, ఆయన స్ఫూర్తితోనే తాను సినిమాల్లోకి వచ్చానని చెప్పారు. ఆ తర్వాత చంద్రబాబు విజన్ గురించి చెప్పారు. చంద్రబాబు హయాంలో ఎలాంటి అభివృద్ధి జరిగిందో చెప్పారు. అలాంటి వ్యక్తి నాయకత్వం బాగుంటుందని ప్రశంసించారు. ఇందులో తప్పుబట్టడానికి కూడా ఏమీ లేదు. రజినీ తనకు నచ్చిన వ్యక్తుల గురించి మాత్రమే ప్రస్తావించారు. రాజకీయపరమైన విమర్శలు చేయలేదు. వైసీపీసహా ఏ పార్టీనీ విమర్శించలేదు. ఈ అంశాన్ని వైసీపీ వదిలేయవచ్చు. దీనిపై స్పందించాల్సిన అవసరం లేదు. “ఎవరో వచ్చారు.. తమకు నచ్చిన వ్యక్తుల గురించి పొగిడారు.. వెళ్లిపోయారు.. దీంతో మాకేం సంబంధం” అనుకుంటే సరిపోయేది. కానీ, వైసీపీ అనవసరంగా స్పందించింది. అసలు రజినీ మాటల్లో ఏం తప్పుందని వైసీపీ నేతలు ఆయన వ్యాఖ్యలతో ఉలిక్కిపడ్డారు?
ప్రత్యర్థి చంద్రబాబా.. రజినీకాంతా? వైసీపీకి ఇదేం బుద్ధి?
మనకు నచ్చని వ్యక్తులుంటారు. మన పార్టీకి ప్రత్యర్థి పార్టీలు ఉంటాయి. కొందరు ఆ వ్యక్తుల్ని, ఆ పార్టీల్ని అభిమానిస్తారు. పొగుడుతారు కూడా. అందులో తప్పేముంది? మనకు నచ్చని వ్యక్తుల్నో, పార్టీలనో ఎవరూ పొగడకూడదు అంటే ఎలా? దాన్లో మీ ప్రస్తావన ఏముందని స్పందిస్తారు? మిమ్మల్ని అంటే కదా మీరు మాట్లాడాల్సింది. మరి వైసీపీని రజినీ ఏం అనకుండానే ఆ పార్టీ నేతలు ఎందుకు ఇంతలా దిగజారి మాట్లాడుతున్నారు? చంద్రబాబును, ఎన్టీఆర్‌ను అభిమానించే వ్యక్తులు ఉండకూడదా? వాళ్లను ఎవరు పొగిడినా విమర్శిస్తారా? అసలు దేశంలో ఎక్కడైనా ఇలాంటి నీచ రాజకీయం నడుస్తోందా? వైసీపీకి చంద్రబాబు, టీడీపీ అంటే పడదు. అప్పుడు ఆ పార్టీని, బాబును మాత్రమే విమర్శించాలి. అంతేకానీ.. వాళ్లను అభిమానించే వాళ్లను కూడా తిడతామంటే ఎలా? ఇది ఏ తరహా రాజకీయం. వైసీపీ ప్రత్యర్థి చంద్రబాబా.. లేక రజినీ కాంతా?
అతిథిపై అక్కసు.. చీచీ!
వైసీపీ తెలుసుకోవాల్సింది ఒకటుంది. రజినీకాంత్ ఏపీకి ఒక అతిథిలా వచ్చారు. తనను ఆహ్వానించినవారిపై ప్రశంసల జల్లు కురిపించారు. వెళ్లిపోయారు. మధ్యలో ఎవరినీ విమర్శించలేదు. అలాంటిది ఒక అతిథిపై అక్కసు వెళ్లగక్కడం ఏ సంస్కృతి? మీకూ, చంద్రబాబుకు రాజకీయంగా ఏమైనా ఉంటే.. మీరూ, మీరూ తేల్చుకోవాలి. రాష్ట్రానికి అతిథిలా వచ్చిన వ్యక్తిని విమర్శించడం సరికాదు. ఆయనేమీ ఎన్నికల ప్రచారానికి రాలేదు. అయినా స్థాయి మరిచి విమర్శించారు. సొంత రాష్ట్రంలో అనేక అంశాల్లో రజినీ విమర్శలు ఎదుర్కొన్నా.. గతంలో ఎవరూ ఆయనని తిట్టనంత నీచంగా తిడుతున్నారు వైసీపీ బూతు నేతలు. ఈ వ్యవహారం చూసి తమిళనాడు ప్రజలు ఏపీనీ ఛీ కొడుతున్నారు. రాజధాని లేని రాష్ట్రం, సీబీఐ కేసులు, చార్జిషీట్లు అంటూ జగన్ పాలనను విమర్శిస్తున్నారు.
ఎన్టీఆర్‌పై అక్కసా..? డైవర్షనా?
రజినీపై వైసీపీ ఈ స్థాయిలో విమర్శలు చేయడం సామాన్యుల్ని, రాజకీయ విశ్లేషకుల్ని షాక్‌కు గురి చేస్తోంది. అసలు ఇంతకూ వైసీపీకి ఎందుకింత కోపం? ఎన్టీఆర్‌ను పొగిడినందుకేనా? తెలుగు జాతికి సంబంధించి రాజకీయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయే పేరు ఎన్టీఆర్. ఆ తర్వాత కొందరు వైఎస్ పేరు చెబుతారు. సరిగ్గా చెప్పాలంటే ఎన్టీఆర్ తర్వాతే ఎవరైనా. అందుకే ఎన్టీఆర్‌ను పొగడటం వల్ల ఆయనకు ఇంకా పేరొస్తుందని, దీని ద్వారా వైఎస్ ఇమేజ్ తగ్గుతుందని వైసీపీ పెద్దలు భావిస్తుండవచ్చు. లేదా రజినీ మాటలు టీడీపీకి మేలు చేస్తాయని కూడా అనుకుని ఉండవచ్చు. అందుకే వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. లేక ఇప్పుడున్న పరిస్థితుల్లో అనేక అంశాల్ని మరుగునపర్చడానికి వైసీపీ చేస్తున్న డైవర్షన్ పాలిటిక్సా అని మరికొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వైసీపీ వ్యవహరిస్తున్న తీరు మాత్రం ఆమోదయోగ్యం కాదు.