వై.ఎస్.వివేకానంద రెడ్డి హత్య కేసులో ట్విస్టులు కొనసాగుతున్నాయి. ఈ నెలాఖరులోపు ఈ కేసును క్లోజ్ చేయాలని సుప్రీంకోర్టు సీబీఐని ఆదేశించింది. దీంతో దీన్ని ఎలాగైనా తేల్చేయాలని సీబీఐ గట్టి పట్టుదలగా ఉంది. రోజువారీ విచారణలతో హడావుడి చేస్తోంది. అటుతిరిగి ఇటు తిరిగి ఈ కేసు వ్యవహారం ఇప్పుడు వై.ఎస్.ఫ్యామిలీలోకి ఎంటరైంది. కడప ఎంపీ అవినాశ్ రెడ్డి కుటుంబం చుట్టూ తిరుగుతోంది. ఇప్పటికే ఈ కేసులో అవినాశ్ రెడ్డి తండ్రి వై.ఎస్.భాస్కర్ రెడ్డి అరెస్టయ్యారు. అవినాశ్ రెడ్డి కూడా అరెస్ట్ ఖాయమనుకుంటున్న సమయంలో ఆయన ముందస్తు బెయిల్ కు వెళ్లి ఊరట పొందారు. దీంతో అవినాశ్ అరెస్ట్ కు తాత్కాలిక బ్రేక్ పడింది.
అయితే వివేకా హత్య కేసుతో తమకేం సంబంధం లేదని, ఇది ఆయన కుటుంబ విభేదాల వల్లే జరిగిందని చెప్పేందుకు అవినాశ్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఆయన మీడియా ముందుకొచ్చిన ప్రతిసారీ… తాము చెప్పే విషయాలను సీబీఐ పట్టించుకోవట్లేదని ఆరోపిస్తున్నారు. ఒకవైపే విచారణ చేస్తోందని, మరో యాంగిల్లో దీన్ని చూడట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వివేకాకు వివాహేతర సంబంధాలున్నాయని, నిందితుల కుటుంబసభ్యులతో కూడా ఆయనకు అక్రమ సంబంధాలున్నాయని అవినాశ్ చెప్పారు. అంతేకాక, వివేకా రెండో భార్యకు, సునీతకు మధ్య ఆస్తి పంపకాల్లో విభేదాలున్నాయని, అందుకే ఆయన హత్యకు గురయ్యారని చెప్తున్నారు.
ఇప్పుడు వివేకా రెండో భార్య షమీమ్ కూడా త్వరలో మీడియా ముందుకొచ్చేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. సీబీఐకి షమీమ్ ఇచ్చిన వాంగ్మూలం ఇప్పుడు బయటికొచ్చింది, తన కుమారుడ్ని వారసుడిగా ప్రకటించాలని వివేకా కోరుకున్నారని, అయితే ఇందుకు సునీత అంగీకరించలేదన్నది షమీమ్ చెప్పిన మాట. లాగే వివేకా వీలునామా మేరకు తమకు ఆస్తి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆమె కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నారు. రెండేళ్లుగా అసలు మీడియా ముందుకు రాని షమీమ్.. ఇప్పుడే ఎందుకు బయటికొస్తున్నారనేది అనుమానాలకు తావిస్తోంది. ఈ సమయంలో ఆమె బయటకు రావడం వెనుక కొంతమంది ప్రమేయం ఉందని కచ్చితంగా చెప్పొచ్చు.
అయితే షమీమ్ ద్వారా వివేకా హత్య కేసును డైవర్ట్ చేసేందుకు కొంతమంది ప్రయత్నిస్తున్నారని స్పష్టంగా అర్థమవుతోంది. ఇన్నాళ్లూ ఒక యాంగిల్లో ఈ కేసు విచారణ జరుగుతోంది. ఇప్పుడు దాని నుంచి సైడ్ చేసి మరో యాంగిల్లో విచారణ జరిగేలా చూసే ప్రయత్నం జరుగుతోంది. అయితే వివేకా రెండో భార్య వ్యవహారం మీడియాకు ఇప్పుడు బయటికొస్తోందేమో కానీ… సీబీఐ 2020లోనే షమీమ్ నుంచి వాంగ్మూలం తీసుకుంది. ఆమె చెప్పిన విషయాలన్నింటిపైనా ఆరా తీసింది. ఆ యాంగిల్లో కూడా సుదీర్ఘ విచారణ చేసేసింది. అవన్నీ చేసేసిన తర్వాత కేసు ఇక్కడి దాకా వచ్చింది. కాబట్టి ఆస్తి పంపకాలు, వారసత్వా పోరు.. ఇవన్నీ ఇప్పుడ సమస్య కానే కాదు. అసలు వివేకానంద రెడ్డి ఎలా హత్యకు గురయ్యారు.. ఎవరు చంపారనేదే మ్యాటర్.