BRS About AP: ఏపీని బీఆర్ఎస్ ఉద్ధరిస్తుందా? అసలు తెలంగాణలో బాగుపడ్డ కుటుంబాలెన్ని? ఎందుకీ డ్రామాలు!

ఉమ్మడి రాష్ట్రం ఉన్నంతకాలం సీమాంధ్రుల్ని ఆడిపోసుకునే వాళ్లు. ఇప్పుడు బీఆర్ఎస్‌గా మారినా అదే ఫార్ములా. ఇప్పుడు కేంద్రాన్ని తిడుతోంది అంతే. మరోవైపు కొత్తగా ఆంధ్రామీద ప్రేమ ఒలకబోస్తుంది. ఏపీని మేమే అభివృద్ధి చేస్తాం అంటున్నారు ఆ పార్టీ నేతలు. ఏపీకి కేసీఆర్, బీఆర్ఎస్ పాలన కావాలంటూ గొప్పలు చెబుతున్నారు.

  • Written By:
  • Publish Date - May 3, 2023 / 03:45 PM IST

BRS About AP: అభివృద్దిలో ఏపీ వెనుకబడిందన్నది వాస్తవమే. అది అక్కడి నాయకుల వైఫల్యమే. కాదనలేం. అధికార పక్షానిది, ప్రతిపక్షాలది అదే దారి. రాజకీయాలు తప్ప అభివృద్ధి చేతకాదు. దీనికి అందరూ కారణమే. అక్కడి నాయకులు విఫలమైనంత మాత్రాన బీఆర్ఎస్ ఏదో అక్కడికెళ్లి పొడిచేయాలా? అంటే తెలంగాణను బీఆర్ఎస్ ఏదో మొత్తం ఉద్ధరించేసినట్లు. ఇక్కడేదో ప్రతి ఇల్లు సిరిసంపదలతో తులతూగుతున్నట్లు! ఏపీని అభివృద్ధి చేస్తాం అని చెప్పే అర్హత బీఆర్ఎస్ పార్టీకి ఉందా? అసలు ఆ పార్టీకి సిద్ధాంతాలున్నాయా? పొలిటికల్ కమెడియన్స్ ఏదో చెప్పేస్తే అంతా మారిపోద్దా?
ప్రత్యేక రాష్ట్ర నినాదంతో వచ్చిన పార్టీ టీఆర్ఎస్. కేసీఆర్ అధ్యక్షుడిగా మొదలైన ఈ పార్టీ లక్ష్యమైతే నెరవేరింది. తెలంగాణ సాధనలో ఎవరి పాత్ర ఏంటనే విషయంలో భిన్న వాదనలున్నాయి. అయితే, అప్పట్లో తెలంగాణలో టీఆర్ఎస్ వైఖరి హర్షించదగ్గది కాదు. ఆంధ్రాని తిట్టూ.. ఆంధ్రా నేతల్ని తిట్టూ.. అన్నట్లుండేది. ఉమ్మడి రాష్ట్రం ఉన్నంతకాలం సీమాంధ్రుల్ని ఆడిపోసుకునే వాళ్లు. ఇప్పుడు బీఆర్ఎస్‌గా మారినా అదే ఫార్ములా. ఇప్పుడు కేంద్రాన్ని తిడుతోంది అంతే. మరోవైపు కొత్తగా ఆంధ్రామీద ప్రేమ ఒలకబోస్తుంది. ఏపీని మేమే అభివృద్ధి చేస్తాం అంటున్నారు ఆ పార్టీ నేతలు. ఏపీకి కేసీఆర్, బీఆర్ఎస్ పాలన కావాలంటూ గొప్పలు చెబుతున్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని, విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడుతామని మంత్రి మల్లారెడ్డి లాంటోళ్లు దరువేసి మరీ చెబుతున్నారు. బీఆర్ఎస్ తమ మాటల ద్వారా ఆంధ్రా నేతల్ని, ప్రజల్ని అవమాన పరుస్తోంది.
మల్లారెడ్డి కామెడీ మాటలు
మంత్రి మల్లారెడ్డి మాటలకు తెలంగాణలోనే ప్రాధాన్యం ఉండదు. అలాంటిది ఆయన ఏపీ గురించి మాట్లాడితే మరింత కామెడీగా అనిపిస్తుంది. మేడే వేడుకల్లో మంత్రి మల్లారెడ్డి కేసీఆర్ గురించి, బీఆర్ఎస్ గురించి గొప్పగా చెప్పుకొచ్చారు. మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, అక్కడ బీఆర్ఎస్ ప్రభంజనం సృష్టిస్తుందని చెప్పారు. ఏపీలో పోలవరాన్ని పూర్తి చేసే సత్తా కేసీఆర్‌కే ఉందని, విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కూడా కేసీఆరే కాపాడుతారని చెప్పుకొచ్చారు. కర్ణాటక, మహారాష్ట్ర ప్రజలు కూడా కేసీఆర్ లాంటి సీఎం కావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఈ మాటలు మల్లారెడ్డి మరోసారి నవ్వులపాలయ్యేలా చేశాయి. అసలు పక్కరాష్ట్రాల గురించి మల్లారెడ్డి మట్లాడ్డమేంటి? అందులోనూ ఏపీ గురించి చెబుతుంటే హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే విశాఖ స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్ పేరుతో కేసీఆర్ ఆడిన డ్రామా ఇంకా కళ్లముందు కదులుతూనే ఉంది. స్టీల్ ప్లాంట్‌ను కాపాడి ఏపీకి మేలు చేస్తాం అన్నట్లు కవరింగ్ ఇచ్చారు కేసీఆర్, కేటీఆర్.

దీంతో ఏపీలో కూడా తమకు ఆదరణ పెరుగుతుందంటూ చెప్పుకొచ్చారు. తీరా చూస్తే బిడ్డింగ్ వేయకుండానే వెనుదిరిగారు. ఈ ఒక్క అంశం చాలు కేసీఆర్‌కు ఆంధ్రా మీద ఎంత ప్రేముందో చెప్పడానికి. ఏదో ఓట్ల కోసం ఏపీని ఉద్ధరిస్తాం అని చెప్పుకొంటారు అంతే. వాస్తవానికి వచ్చేసరికి అంత సీన్ లేదని తేలిపోయింది. ఆల్రెడీ స్టీల్ ప్లాంట్ కథ దాదాపు ముగిసినట్లే. అలాంటిది మల్లారెడ్డిలాంటి మంత్రుల చేత కేసీఆర్, కేటీఆర్ ఏవో నాలుగు మాటలు చెప్పించుకున్నంత మాత్రాన వీళ్లు ఏపీని ఉద్ధరిస్తారా? పోలవరం ప్రాజెక్టు ఇంకా పూర్తి కాలేదు. అసలెప్పుడు పూర్తవుతుందో అక్కడి వాళ్లకే తెలీదు. కానీ, ఆ ప్రాజెక్టును కూడా బీఆర్ఎస్ తన రాజకీయానికి వాడుకుంటోంది. నిన్నామొన్నటివరకు ప్రాంతీయవాదంతో నెట్టుకొచ్చి.. ఇప్పుడు జాతీయవాదంతో ముందుకెళ్తే సరిపోతుందా? పక్క రాష్ట్రాలతో తెలంగాణకు ఉన్న సమస్యలెన్ని? వాటి విషయంలో బీఆర్ఎస్ వైఖరేంటి? ఇలాంటి ప్రశ్నల మధ్య జాతీయ రాజకీయాల్లో ఇతర రాష్ట్రాలను తిట్టడం సరైందేనా?


ఆంధ్రా అంత దిగజారిందా? తెలంగాణ అంత బాగుపడిందా?
తెలంగాణతో పోలిస్తే ఏపీ చాలా వెనుకబడిపోయింది. కానీ, అదేమీ సోమాలియానో, శ్రీలంకో అయిపోలేదు. కానీ, బీఆర్ఎస్ మాత్రం అక్కడ పరిస్థితి అలాగే ఉందని, తాము అధికారంలోకి వస్తేనే ఏపీ బాగుపడుతుందని చెప్పుకొంటూ ఉంటారు. పక్కరాష్ట్రం మరీ అంతగా ఏమీ దిగజారలేదు. అలాగని తెలంగాణ కూడా మరీ బాగుపడిందేమీ లేదు. తెలంగాణలోని నగరాల్ని లండన్ చేస్తామని, డల్లాస్ చేస్తామని చెప్పే కేసీఆర్.. కనీసం వర్షపు నీళ్లు పోయేలా కూడా చేయలేకపోయారు. కానీ, తెలంగాణ ఏదో పూర్తిగా అభివృద్ధి చెందినట్లు.. దేశానికే మోడల్ అన్నట్లు ఆ పార్టీ నేతలు కలరింగ్ ఇస్తుంటారు. తెలంగాణలో పేదలకు ఇండ్లు ఇచ్చింది లేదు. ఉద్యోగాలు ఇచ్చింది లేదు. రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. కేజీ టూ పీజీ ఉచిత విద్యకు దిక్కులేదు.

నిరుద్యోగ భృతి లేదు. కానీ, ఏపీని తెలంగాణలా చేస్తాం అంటారు. ఇక్కడేదో ప్రతి కుటుంబం సిరిసంపదలతో తులతూగుతున్నట్లు ప్రచారం చేసుకుంటారు. కేవలం తన వైఫల్యాల్ని కప్పి పుచ్చుకోవడానికి తన మంత్రులతో ఇలాంటి మాటలు చెప్పిస్తుంటారు కేసీఆర్. పక్కరాష్ట్రాల్ని ఉద్ధరించడానికి బయల్దేరే ముందు సొంత రాష్ట్రంలోని సమస్యలపై ఫోకస్ చేస్తే ప్రయోజనం ఉంటుంది. అంతేకానీ.. ఇక్కడేదో అద్భుత పాలన సాగుతోందని, ప్రజలు సుఖసంతోషాలతో ఉన్నారని ఊరికే ప్రచారం చేసుకుంటే ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఏ ప్రయోజనాలు ఆశించి, కావాలని ఏపీని టార్గె‌ట్ చేస్తున్నారో కానీ.. ప్రజలు మాత్రం బీఆర్ఎస్ వైఖరిని గమనిస్తూనే ఉన్నారు.