మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పార్టీని నడిపించలేకపోతున్నాడా ? సొంత పార్టీ నేతలను కంట్రోల్ చేయలేక…సతమతం అవుతున్నాడా ? చిన్న సమస్యలను కొలిక్కి తెచ్చుకోవడం లేదా ? ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి వ్యవహారం…వైసీపీని భారీగా డ్యామేజ్ చేసిందా ? సస్పెండ్ చేయకుండా ఎందుకు నాన్చుడు ధోరణి అవలంభించారు. పార్టీపై పట్టుకోల్పోతున్నారా ? బై బై చెబుతున్న నేతలే ఇందుకు ఉదాహరణగా తీసుకోవచ్చా ?
రాజకీయ పార్టీని నడిపించడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. నేతలకు అవసరమైనపుడు ఫ్రీడం ఇవ్వాలి. తప్పదని భావించినపుడు కళ్లెం వేయాలి. ఏ రాజకీయ నేత అయినా సమయాన్ని బట్టి వ్యవహరించాలి. ప్రత్యర్థుల ఎత్తులకు పైఎత్తులు వేయాలి. రాజకీయాల్లో నిరంతర అప్రమత్తంగా వ్యవహరించాలి. ఏ క్షణం నిర్లక్ష్యంగా వ్యవహరించినా…శత్రువుకు మనం చిక్కిపోతాం. ఏమరుపాటు రాజకీయాలు ఎంతటి మహా నేతకైనా పనికి రావు. 2024 ఎన్నికల్లో వైసీపీ 11 అసెంబ్లీ సీట్లకే పరిమితం అయింది. కొన్ని జిల్లాలో ఆ పార్టీ అడ్రస్ లేకుండా పోయింది. 2019 ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిన వైసీపీ…ఐదేళ్లు తిరిగే సరికి సీన్ రివర్స్ అయింది. బళ్లు ఓడలయ్యాయి…ఓడలు బళ్లయ్యాయి. కాలచక్రం గిర్రున తిరిగింది. 151 సీట్లతో తిరుగులేని విజయాన్ని సాధించిన జగన్…2024లో కనీసం ప్రతిపక్ష హోదాను కూడా దక్కించుకోలేకపోయాడు. ప్రతిపక్ష హోదా ఇస్తే అసెంబ్లీ వస్తానంటూ…జూనియర్ రాజకీయ వేత్తలా తెలివి తక్కువ కామెంట్లు చేశాడు. తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ కోర్టుకు వెళ్లాడు. అధికారమైనా…ప్రతిపక్ష హోదా అయినా…ప్రజలు ఇస్తారు కానీ…కోర్టులు కాదు. ఈ చిన్న లాజిక్ మిస్సయినా…ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఎలా పని చేశాడు అన్న అనుమానాలు సగటు మానవుడికి కచ్చితంగా వస్తాయి. లాజిక్ లేని మాటలతో మ్యాజిక్ చేయాలనుకుంటే…ప్రజలు ఈడ్చి కొడతారు. ఏదైనా ఒకటికి పదిసార్లు ఆలోచించి చేయాలి.
అధికారాన్ని కోల్పోయిన తర్వాత…ఐదేళ్ల పాటు వైసీపీని నడిపింది జగన్మోహన్ రెడ్డేనా ? లేదా ఇంకెవరైనా తెరవెనుక నడిపించారా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ…ఇంత ఘోరంగా ఓడిపోవడానికి నేతల ఆరాచకాలే ప్రధానంగా పని చేశాయ్. ఒక మంత్రేమో అరగంట అంటాడు…మరో మంత్రి గంట అంటాడు…ఒక ఎంపీ అయితే ఏకంగా బట్టలు విప్పేసి చూపిస్తాడు. ఇన్ని అరాచకాలు చేసినా…ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి…సదరు నేతలను ఒక్క మాట కూడా అనలేదు. దీంతో ఆ నేతలంతా మరింత రెచ్చిపోయారు. తూర్పు గోదావరి జిల్లాలో అయితే దళితుల్ని చంపి డోర్ చేసిన ఎమ్మెల్సీ అనంతబాబును పక్కన కూర్చోబెట్టుకొని ప్రచారం చేశారు. మాజీ మంత్రులు జోగి రమేశ్, కొడాలి నాని, పేర్ని నాని, ఆర్కే రోజా, విజయసాయి రెడ్డి వంటి నేతలు…నోటికి అడ్డు అదుపు లేకుండా మాట్లాడారు. ఇలా చేస్తే…ఎన్నికల్లో ప్రజలు ఓట్లు వేస్తారా ? ఈ రోజు వాళ్లకు జరిగింది…రేపు మనకు జరగదా అనే రీతిలో ప్రజలు ఆలోచించారు. అందుకే జగన్మోహన్ రెడ్డికి కర్రుకాల్చి వాత పెట్టారు.
అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డిలో ఎలాంటి మార్పు రాలేదు. అధికారాన్ని కోల్పోయిన తర్వాత…అసలసిసలు రాజకీయ నేత బయటకు రావాలి. అధికార పక్షాన్ని నిరంతర ఇరుకున పెట్టేలా వ్యవహరించాలి. కానీ జగన్మోహన్ రెడ్డే వరుస సమస్యలతో ఇరుకునపడుతున్నారు. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి వ్యవహారం…తెలుగు రాష్ట్రాల్లో దుమారం రేపింది. భార్య వాణి, ఆమె పిల్లలు…దువ్వాడ శ్రీనివాస్ వివాహేతర సంబంధంపై విరుచుకుపడ్డారు. శ్రీనివాస్ ఇంటి ముందు ఆందోళనకు దిగిన భార్య, పిల్లలపై దాడికి ప్రయత్నించాడు. నోటితో చెప్పలేని విధంగా అనరాని మాటలు అన్నాడు. రోజుల తరబడి ఈ వ్యవహారం సాగినా…పత్రికలు, టీవీల్లో వచ్చినా…జగన్మోహన్ రెడ్డి మాత్రం తనకేమీ పట్టనట్లు వ్యవహరించాడు. ఇంకా చెప్పాలంటే తనకేమీ తెలియదు అనేలా నటించాడు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం వ్యవహారం వెలుగులోకి రాగానే…అతడ్ని సస్పెండ్ చేసింది. అదే పని జగన్మోహన్ రెడ్డి ఎందుకు చేయలేకపోయారంటే…పరిణతి లేదనుకోవాలా ? లేదంటే నిర్లక్ష్యం అనాలా ? దువ్వాడ శ్రీనివాస్, ఆయన భార్య మధ్య గొడవ జరిగిన వెంటనే యాక్షన్ తీసుకుని ఉంటే పరిస్థితి మరో ఉండేది. దువ్వాడ శ్రీనివాస్ పై చర్యలు తీసుకోకపోవడంతో…వివాహేతర సంబంధాలను జగన్మోహన్ రెడ్డి ప్రొత్సహిస్తున్నాడన్న విమర్శలు వచ్చాయి.
అసలే ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి…పార్టీ విషయంలో నిఖార్సయిన రాజకీయ నేతగా వ్యవహరించకపోతే వైసీపీ కష్టాలే. నేతలు చేసే అరాచకాలకు ఎప్పటికపుడు చరమగీతం పాడాలి. ప్రత్యర్థులకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా…సొంత పార్టీ నేతలు తప్పు చేసినా…సస్పెండ్ చేయాలి. లేదని దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి వ్యవహారం లాగే…చూస్తూ ఊరుకుంటే…వైసీపీకి నష్టమే తప్పా ఎలాంటి లాభం ఉండదు. ఓటు ఎలాగో రావు…ప్రజల్లో చెడ్డ పేరును మూటగట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి మేల్కోకపోతే…వైసీపీని ఆ దేవుడు కూడా కాపాడలేడు.