Tamilisai Soundararajan: తెలంగాణలో గవర్నర్ మార్పు..? ఎన్నికల వేళ సంచలన నిర్ణయాల దిశగా మోదీ..?

ఈ ఏడాది తెలంగాణతోపాటు మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. అందుకే ఈ రాష్ట్రాల్లో కీలక మార్పుల దిశగా బీజేపీ అడుగులేస్తోంది. దీనిలో భాగంగా తెలంగాణ గవర్నర్ తమిళిసైతోపాటు ఆయా రాష్ట్రాల గవర్నర్లను మారుస్తారు

  • Written By:
  • Publish Date - July 4, 2023 / 03:13 PM IST

Tamilisai Soundararajan: ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రభుత్వంలో, పాలనలో, పార్టీలో సంచలన మార్పులు చేసేందుకు ప్రధాని మోదీ సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. మంత్రివర్గంలో మార్పులతోపాటు, పార్టీ అధ్యక్షుల మార్పులు, గవర్నర్ల మార్చడంతోపాటు అసవరమైతే కొన్ని రాష్ట్రాల్లో సీఎంలను కూడా మార్చే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం. ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం అవసరమయ్యే అన్ని అస్త్రాల్ని బీజేపీ సిద్ధం చేస్తోంది. దీనిలో భాగంగా తెలంగాణ గవర్నర్ తమిళిసైని బదిలీ చేస్తారని సమాచారం.
ప్రధాని మోదీ అధ్యక్షతన సోమవారం మంత్రివర్గ సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. ఈ సమావేశం తర్వాత కీలక మార్పులకు బీజేపీ అధిష్టానం సిద్ధమవుతోంది. చాలా మంది మంత్రులు తమ భవిష్యత్ ఏంటా అని ఆందోళనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు మోదీ సిద్ధపడటమే. దీంతో కొందరు మంత్రులకు ఉద్వాసన పలకబోతుండగా.. మరికొందరికి కొత్తగా మంత్రివర్గంలో చోటు దక్కనుంది. దీంతోపాటు పలు రాష్ట్రాల గవర్నర్లను కూడా మారుస్తారు. ఈ విషయంలో తెలంగాణ గవర్నర్‌ తమిళిసై పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆమెను బదిలీ చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. అయితే, మరో రాష్ట్రంలో గవర్నర్ చేస్తారా.. లేక ఇంకేదైనా పదవి ఇస్తారా అన్నది తేలాలి. దీంతోపాటు పలు రాష్ట్రాల బీజేపీ అధ్యక్షుల మార్పు ఉండబోతుంది. ఇప్పటికే ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజును తొలగించినట్లు ప్రచారం జరుగుతోంది. తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ విషయంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. మధ్యప్రదేశ్, హరియాణా ముఖ్యమంత్రులను కూడా మారుస్తారు.
ఎన్నికల నేపథ్యంలో
ఈ ఏడాది తెలంగాణతోపాటు మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. అందుకే ఈ రాష్ట్రాల్లో కీలక మార్పుల దిశగా బీజేపీ అడుగులేస్తోంది. దీనిలో భాగంగా తెలంగాణ గవర్నర్ తమిళిసైతోపాటు ఆయా రాష్ట్రాల గవర్నర్లను మారుస్తారు. అలాగే హరియాణా గవర్నర్‌ను కూడా మార్చే అవకాశం ఉంది. ఈ విషయంపై ఈ వారంలోనే నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. కీలక మార్పులు చేయడం ద్వారా ఆయా రాష్ట్రాల్లో అధికారం చేపట్టే అవకాశాల్ని పెంచుకోవాలని బీజేపీ చూస్తోంది.
బీఆర్ఎస్ వర్సెస్ గవర్నర్
తెలంగాణలో బీఆర్ఎస్ వర్సెస్ గవర్నర్ అనేలా పరిస్థితులు ఉన్న సంగతి తెలిసిందే. కేసీఆర్ ప్రభుత్వాన్ని తమిళిసై అనేక రకాలుగా ఇబ్బంది పెట్టారు. ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రశ్నించారు. ప్రభుత్వ తప్పులకు వ్యతిరేకంగా గళమెత్తారు. కొన్ని బిల్లుల్ని, ప్రభుత్వ ప్రతిపాదనల్ని తిరస్కరించారు. దీంతో బీఆర్ఎస్ వర్సెస్ గవర్నర్ అన్నట్లుగా పరిస్థితి తయారైంది. అనేక సందర్భాల్లో బీఆర్ఎస్ నేతలు తమిళిసైపై విమర్శలు చేశారు. ఆమె కూడా కేసీఆర్ సర్కారుపై అదే స్థాయిలో స్పందించారు. తమిళిసై బదిలీ అయితే, ఈ వార్ కాస్త తగ్గుతుందేమో చూడాలి.