జనసేన పార్టీకి పదేళ్లు పూర్తికావడంతో.. మచిలీపట్నంలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. అధ్యక్షుడు పవన్‌తో పాటు.. పార్టీ కీలక నేతలంతా హాజరుకాబోతున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో జనసేన కార్యకర్తలు, పవన్ అభిమానులు తరలివస్తున్నారు. దీంతో సభ కోసం జనసేన విస్తృత ఏర్పాట్లు చేసింది. ఎన్నికల కోసం సిద్ధం చేసుకున్న ప్రచారరథం వారాహిపై పవన్ కల్యాణ్ మచిలీపట్నం చేరుకుంటారు. దీని కోసం జనసేన ప్రత్యేక రూట్ మ్యాప్ సిద్ధం చేసింది. దీన్నే పోలీసులకు ఇచ్చింది. ఐతే ర్యాలీపై పోలీసులు అభ్యంతరం చెప్పడం వివాదంగా మారింది. బందరు శివారులో 35ఎకరాల్లో ఏర్పాటు చేసిన సభా వేదికకు… పొట్టి శ్రీరాములు పేరు పెట్టారు. ఎల్‌ఈడీ స్క్రీన్‌లతో పది గ్యాలరీలను ఏర్పాటు చేశారు. పార్కింగ్, భోజనాలకు ఎలాంటి సమస్య రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
సభలో పవన్ ఏం మాట్లాడుతారు.. ఏం చెప్తారన్నది ఆసక్తికరంగా మారింది. జనసేన పార్టీ పదేళ్లు పూర్తి చేసుకుంది. ఇంతవరకు ఒక్క ఎమ్మెల్యే సీటును కూడా గెలవలేకపోయింది. గెలిచిన ఓ ఎమ్మెల్యే కూడా వైసీపీకి మద్దతు ప్రకటించారు. మరో ఏడాదిలో ఎన్నికలు రాబోతున్నాయ్. ఈ సమయంలో జనసేనాని పవన్ ఏం ప్రకటిస్తారనేది ఉత్కంఠగా ఉంది. పొత్తులపై క్లారిటీ ఇస్తారా.. లేదంటే ఎప్పటిలానే సైలెంట్‌గా ఉంటారా అనే చర్చ సాగుతోంది. ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయ్. బీజేపీతో పొత్తులో ఉన్నా.. కమలంతో పవన్ అంటీ ముట్టనట్లే కనిపిస్తున్నారు. ప్రతిపక్షాల ఓట్లు చీలిపోకుండా ప్రయత్నిస్తానంటూ ప్రతి వేదికపై చెప్తున్న పవన్.. మరి ఆవిర్భావ వేదికపై పొత్తుల గురించి ఎలాంటి ప్రకటన చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. పవన్ బస్సు యాత్ర చేస్తారని.. ఏడాదిగా టాక్ నడుస్తోంది. నిజానికి వారాహిని ముందుగా సిద్ధం చేసింది కూడా అందుకే అనే చర్చ జరిగింది. ఐతే ఏం జరిగిందో కానీ.. ఆ తర్వాత అంతా సైలెంట్ అయింది. మరి ఆవిర్భావ వేదికపై యాత్రకు సంబంధించి పవన్ క్లారిటీ ఇస్తారా అనే చర్చ కూడా జనసేన కార్యకర్తలు, అభిమానుల్లో వినిపిస్తోంది.