Rajasthan: రాజస్థాన్ మరో మధ్యప్రదేశ్ అవుతుందా ? లేక కర్ణాటక నుంచి నేర్చుకుంటుందా ?

ఏ పార్టీయైనా ప్రజాస్వామ్యయుతంగానే వ్యవహరించాలి. అందరి అభిప్రాయాలకు పెద్ద పీట వేయాలి. లేకపోతే పార్టీతో పాటు వ్యక్తులు కూడా నియంతలుగా మారతారు. కాంగ్రెస్ పార్టీ విషయానికొస్తే ఆ పార్టీలో ప్రజాస్వామ్యం చాలా ఎక్కువ. అందరూ హైకమాండ్ జపం చేస్తారు గానీ.. ఎవరిదారి వారిదే అన్నట్టు వ్యవహరిస్తారు. ప్రజాస్వామ్యం ఏస్థాయిలో ఉంటుందంటే నిత్యం గాంధీ కుటుంబం పేరు జపించేవాళ్లు కూడా తమకు అనుకూలంగా పరిణామాలు లేకపోతే తిరుగుబాటు చేసే స్థాయి వరకు వెళ్తారు. దటీజ్ కాంగ్రెస్.

  • Written By:
  • Publish Date - May 31, 2023 / 03:02 PM IST

కర్ణాటక ఎన్నికల్లో బీజేపీకి షాక్ ఇచ్చి అద్భుతమైన విజయాన్ని సాధించిన కాంగ్రెస్ పార్టీకి.. ఇతర రాష్ట్రాల నుంచి ఎదురవుతున్న సంక్షోభాలు కునుకులేకుండా చేస్తున్నాయి. కర్ణాటకలో వచ్చిన విజయం త్వరలోనే జరగనున్న ఇతర రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో రిపీట్ కావాలంటే.. ముందు కాంగ్రెస్ పార్టీ నేతలు ఏకతాటిపై ఉండాలి. వర్గాలుగా చీలిపోతే ఎన్నికల ముందు పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుంది. రాజస్థాన్‌లో ఇప్పుడు ఇదే జరుగుతుంది. ముఖ్యమంత్రి గెహ్లాట్, సీనియర్ నేత సచిన్ పైలెట్‌కు మధ్య రాజకీయ వైరం పార్టీకి తలనొప్పిగా మారింది.

కర్ణాటకలా రాజస్థాన్ రాజకీయం నడుస్తుందా ?
కాంగ్రెస్ అధికారంలో ఉన్న కొన్ని రాష్ట్రాల్లో రాజస్థాన్ ఒకటి. ఈ ఏడాదిలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇక్కడ కాంగ్రెస్ ఎప్పుడో రెండు వర్గాలుగా చీలిపోయింది. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌కు.. సీనియర్ నేత సచిన్ పైలెట్‌కు మధ్య పచ్చగడ్డి వేయకుండానే మండిపోతుంది. గెహ్లాట్‌పై తిరుగుబాటు చేసేందుకు గతంలోనే విఫలయత్నం చేసిన సచిన్ పైలెట్… మరో అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. ముఖ్యమంత్రి కావాలని కలలు కంటున్న సచిన్ పైలెట్‌కు గెహ్లాట్‌ పెద్ద అడ్డుగోడగా మారారు. సొంత ప్రభుత్వం విధానాలనే ప్రశ్నిస్తూ సచిన్ పైలెట్ ఆందోళనలు నిర్వహిస్తున్నారు. గెహ్లాట్‌కు అల్టిమేటం కూడా ఇచ్చారు. అయితే ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఈ ఇద్దరి నేతల మధ్య ఆధిపత్యం పోరు పార్టీ విజయావకాశాలను దారుణంగా దెబ్బ తీసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

కాంగ్రెస్ హైకమాండ్ రాజీ కుదిర్చిందా ?
రెండు రోజుల క్రితం రాజస్థాన్ ముఖ్యమంత్రి గెహ్లాట్‌తో పాటు సచిన్‌ పైలెట్‌తో కాంగ్రెస్ హైకమాండ్ అర్థరాత్రి వరకు చర్చలు జరిపింది. ఆ తర్వాత ఇద్దరు నేతలను వెంటపెట్టుకుని రాయబారిగా వ్యవహరించిన పార్టీ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ మీడియా ముందుకొచ్చారు. గెహ్లాట్ , సచిన్ పైలెట్ ఇకపై కలిసి పనిచేస్తారని.. వాళ్ల మధ్య సమస్యలుంటే హైకమాండ్‌ చూసుకుంటుందని ప్రకటించారు. ఇంకేముంది గెహ్లాట్ – పైలెట్ చేతులు కలిపేశారు.. సిద్ధ..డీకే స్థాయిలో రాజస్థాన్‌లో కాంగ్రెస్ పార్టీ విజయం కోసం కలిసకట్టుగా పనిచేస్తారని అందరూ భావించారు. కానీ గ్రౌండ్ రియాల్టీలో అది కనిపించడం లేదు. కేసీ వేణుగోపాల్ మీడియాతో మాట్లాడిన సందర్భంలో ఆయనకు చెరో వైపు నిలబడిన గెహ్లాట్.. పైలెట్.. ఎడమొహం..పెడమొహం అన్నట్టే ఉన్నారు. హైకమాండ్ పెద్దలు పిలిచారు కాబట్టి మొహమాటంగా కలిసొచ్చిన గెహ్లాట్.. పైలెట్.. వాళ్ల మనసులు మాత్రం మార్చుకోలేదు.

రాజస్థాన్ కాంగ్రెస్‌తో తిరుగుబాటు తప్పదా ?
వసుంధర రాజే హయాంలో బీజేపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై దర్యాప్తు చేయించాలని సచిన్ పైలెట్ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. ఇవాల్టిలో తేల్చాలని గెహ్లాట్‌కు అల్టిమేటం కూడా ఇచ్చారు. అయినా కాంగ్రెస్ ప్రభుత్వం గానీ, ఢిల్లీలో ఉన్న హైకమాండ్ గానీ సచిన్ పైలెట్ అల్టిమేటంపై ఒక్క మాట కూడా మాట్లాడలేదు. రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను పునర్‌వ్యవస్థీకరించాలని కూడా సచిన్ పైలెట్ డిమాండ్ చేస్తున్నారు. దీని విషయంలోనూ గెహ్లాట్ సానుకూలంగా లేరు. అంటే పైలెట్ డిమాండ్లను కాంగ్రెస్ పెడచెవిన పెట్టిందని అనుకోవాలా ? గెహ్లాట్‌తో సర్దుకుపొమ్మని సలహాలు ఇవ్వడం వరకే కాంగ్రెస్ పెద్దలు పరిమితమయ్యారా ? రాజస్థాన్ కాంగ్రెస్ లో సచిన్ పైలెట్ బలమైన నేత. ఆయనకంటూ ఓ వర్గం ఉంది. ఆయన తిరుగుబాటు చేస్తే వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయవకాశాలు కచ్చితంగా దెబ్బతింటాయి. కర్ణాటక ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌కు అనుకూల పవనాలు వీస్తున్న సమయంలో రాజస్థాన్‌ కాంగ్రెస్‌లో సచిన్ పైలెట్ రూపంలో తిరుగుబాటు జరిగితే అసెంబ్లీ ఎన్నికల్లోనే కాదు ఆ ప్రభావం వచ్చే పార్లమెంట్ ఎన్నికలపైనా పడుతుంది.

రాజస్థాన్ సంక్షోభాన్ని కాంగ్రెస్ నివారించలేదా ?
రోగానికి మూలం కనుక్కోకుండా పైపై వైద్యం చేస్తే అది ఎప్పటికైనా తిరగబెడుతుంది. గెహ్లాట్, సచిన్ పైలెట్ల మధ్య రాజకీయ వైరానికి కారణాలు తెలుకుని ఇద్దరిని సంతృప్తి పరిచేలా రాజీ ఫార్మాలా కోసం ప్రయత్నించకుండా.. అంతా హైకమాండ్ చూసుకుంటుంది.. మీరు కలిసి పనిచేయండి అంటే రాజకీయం నడవదు. గెహ్లాట్, సచిన్ పైలెట్ ఢిల్లీ వచ్చారు.. కాంగ్రెస్ పెద్దలను కలిశారు.. మీడియా ముందు ఫోటోలు దిగారు..జైపూర్ వెళ్లిపోయారు. కానీ వాళ్ల మధ్య రాజకీయ వైరం మాత్రం అలాగే ఉంది. దీనికే మందు పడాలి.
కర్ణాటక నుంచి కాంగ్రెస్ నేర్చుకోవాల్సిందే. ఎక్కడ గెలవాలో కాదు..ఎక్కడ తగ్గాలో తెలిసినోడే తోపు.. రాజకీయాలకు కూడా ఇది వర్తిస్తుంది.

బలం బలగం ఉంది కదా అని ఎగిరెగిరి పడితే అసలుకే మోసం వస్తుంది. దేశం మొత్తం కాంగ్రెస్ పార్టీ తీవ్ర సంక్షోభంలో చిక్కుకుని మోదీ మానియాను ఎదుర్కోలేకపోతున్ సమయంలో కర్ణాటక కాంగ్రెస్ నేతలు మైండ్ బ్లాంక్ అయ్యే ఫలితాలను చూపించారు. మీ రాజకీయాలు రాష్ట్రంలో కాదంటూ బీజేపీకి కర్రుకాల్చి వాతపెట్టారు. కర్ణాటకలో కాంగ్రెస్ విజయం వెనుక ఉన్న ఇద్దరు వ్యక్తులు సిద్ధరామయ్య.. డీకే శివకుమార్. పార్టీని ఏకతాటిపై నిలిపి ఊహించని విజయాన్ని అందించిన క్రెడిట్ సిద్ధరామయ్య కంటే డీకే శివకుమార్‌కే ఎక్కువ దక్కుతుంది. ముఖ్యమంత్రి కావాలని కలలు కన్నా..అధిష్టానం వద్ద పట్టుపట్టినా చివరకు ఆయన ఓ మెట్టు దిగారు. పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీని గెలిపే బాధ్యత కూడా తనపై వేసుకుని డిప్యూటీతో సరిపెట్టుకున్నారు. వాస్తవానికి డీకే సర్దుకుపోకపోతే.. భారీ విజయం సాధించిన తర్వాత కూడా కర్ణాటక కాంగ్రెస్ లో కల్లోలం చెలరేగేది. డీకే శివకుమార్ మెట్టుదిగకపోతే కర్ణాటక కాంగ్రెస్ ఈ పాటికే రెండు ముక్కలయ్యేది.. సంక్షోభాన్ని ప్రత్యర్థి పార్టీలు రాజకీయంగా వాడుకునేవి. అలా జరగకుండా డీకే శివకుమార్ వ్యూహాత్మకంగా వ్యవహరించారు.

సచిన్ పైలెట్ మరో డీకే శివకుమార్ కాగలరా ?
కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఇప్పుడు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విధానాలను, నిర్ణయాలను డీకే శివకుమార్ కూడా బహిరంగంగానే విమర్శించారు. ఇద్దరి మధ్య రాజకీయ వైరం ప్రపంచానికి తెలియంది కాదు. అయితే బీజేపీ ప్రభుత్వానికి గద్దె దించి.. మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేలా చేయడంలో డీకే శివకుమార్ పాత్ర చాలా ఉంది. పీసీసీ అధ్యక్షుడి హోదాలో డీకే ఎన్నికలను చాలెంజ్‌గా తీసుకున్నారు. ముఖ్యమంత్రి కావాలనే లక్ష్యంతోనే ఆయన కష్టపడి ఉండొచ్చు. ఫలితాలు వచ్చిన తర్వాత కాంగ్రెస్ హైకమాండ్ సిద్ధరామయ్య వైపు మొగ్గినా… ఆయన స్వరం పెంచలేదు. హైకమాండ్ మాటను గౌరవిస్తూ డిప్యూటీ సీఎం పదవితో సరిపెట్టుకున్నారు. పవర్ షేరింగ్ లో భాగంగా రెండేళ్ల తర్వాత డీకే సీఎం అయ్యే అవకాశాలు ఉండొచ్చు. ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత డీకే పూర్తిగా పార్టీని కాపాడంలో సక్సెస్ అయ్యారు. తన వర్గాన్ని ప్రోత్సహిస్తూనే సిద్ధరామయ్యతో కయ్యానికి కాలుదువ్వకుండా ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఇది ఆయన భవిష్యత్తు రాజకీయ వ్యూహంలో భాగమే కావొచ్చు. అదే కర్ణాటకలో కాంగ్రెస్‌ను గెలిపించింది.

ఇప్పుడు సచిన్ పైలెట్ కూడా అలాంటి వ్యూహాన్నే అమలు చేయాలి. నిజంగా ఆయన కాంగ్రెస్ పార్టీ విజయాన్ని కోరుకుంటే ఎన్నికల ముందు సంక్షోభం ముదరకుండా జాగ్రత్త పడాలి. గెహ్లాట్‌తో రాజకీయ పంచాయితీని పక్కన పెట్టి రాజస్థాన్ ఎన్నికల్లో మరోసారి కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి కృష్టి చేయాలి. ఆ గెలుపు పార్టీకి, వ్యక్తిగతంగా సచిన్ పైలెట్‌కు కూడా రాజకీయం ఉపయోగపడుతుంది. ఎన్నికల సీజన్‌లో గెహ్లాట్‌తో యుద్ధానికి దిగితే.. ప్రభుత్వాన్ని అస్థిరపరచడంతో పాటు పార్టీ ఓటమికి కారణమైన వ్యక్తిగా సచిన్ పైలెట్ నిలిచిపోతారు. కాంగ్రెస్ పార్టీలో ఎన్నో పదవులు అనుభవించిన గెహ్లాట్‌ కూడా సచిన్‌తో కలుపుకుపోవాలి. ఎల్లకాలం తానే ముఖ్యమంత్రిగా ఉండాలనుకోకుండా యువతరాన్ని ప్రోత్సహించాలి. హైకమాండ్ దగ్గర ఆయనకున్న పలుకుబడిని రాష్ట్రంలో పార్టీ ప్రయోజనాలను కాపాడుకోవడానికి ఉపయోగించాలి. బీజేపీతో యుద్ధం చేస్తున్న కాంగ్రెస్.. కర్ణాటక తరహా ఫలితాలను ఆశిస్తే… సచిన్ పైలెట్ విషయంలో వ్యూహత్మకంగా నిర్ణయం తీసుకోవాలి. రాజకీయంగా ఆయన భవిష్యత్తుకు హైకమాండ్ భరోసా కల్పించాలి. లేకపోతే మధ్యప్రదేశ్ సంక్షోభం రాజస్థాన్‌లోనూ రిపీట్ అవుతుంది. సచిన్ పైలెట్ మరో జ్యోతిరాదిత్య సింథియాగా మారితే రాజస్థాన్‌లో కాంగ్రెస్ పార్టీకి పెద్ద దెబ్బే అవుతుంది.