తెలంగాణ (Telangana) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అటు పార్టీలో… ఇటు ప్రభుత్వంలో తన మార్క్ చూపిస్తున్నట్టు అర్థమవుతోంది. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి (YS Rajasekhar Reddy) లాగా రేవంత్ మారిపోతారా… పార్టీలో పట్టు సాధించడానికి ప్రయత్నిస్తున్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మంత్రి వర్గ విస్తరణ, నామినేటెడ్ పదవుల పందేరం… లోక్ సభ ఎన్నికల అభ్యర్థుల ఎంపిక లాంటి కీలక పనులు అధిష్టానం రేవంత్ నిర్ణయానికి వదిలేసినట్టు తెలుస్తోంది. మహబూబ్ నగర్ లోక్ సభ నియోజకవర్గానికి అభ్యర్థిగా వంశీచంద్ రెడ్డి పేరును కొడంగల్ సభలో స్టేజ్ పైనే రేవంత్ ప్రకటించడం ఈ వాదనకు బలం చేకూరుస్తోంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో (Telangana Assembly Elections) కాంగ్రెస్ మెజారిటీ సాధించాక… సీఎం పదవి కోసం ఆ పార్టీ నేతలంతా ఢిల్లీకి వెళ్ళి పైరవీలు చేశారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం హైదరాబాద్ లో హోటల్ నుంచి బయటకు కాలు పెట్టలేదు. సీఎం పదవి తనకే వస్తుందని అంత ధీమాగా ఎలా ఉన్నారన్నఅనుమానాలు అందరిలో కలిగాయి. ఆ తర్వాత ఆయన్నే సీఎంగా కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించింది. అప్పటి నుంచి రాష్ట్రలో వరుసగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే… రేవంత్ కి కాంగ్రెస్ అధిష్టానం ఫ్రీ హ్యాండ్ ఇచ్చిందని అంటున్నారు.
రేవంత్ కి సీఎం పదవి రావడానికి ముఖ్యకారణం కాంగ్రెస్ (Congress) అగ్రనేత రాహుల్ గాంధీయే. పార్టీలో యువరక్తం ఎక్కించాలన్నది ఆయన ఆలోచనే. అందుకేనేమో… ఎమ్మెల్సీగా ఎంతమంది పోటీ పడ్డా… యువజన కాంగ్రెస్ నేత బల్మూరి వెంకట్ కి, తర్వాత రాజ్యసభకు అనిల్ కుమార్ యాదవ్ కు అవకాశం ఇచ్చారు. ఇప్పుడు లేటెస్ట్ గా మహబూబ్ నగర్ ఎంపీ సీటుకు వంశీచంద్ రెడ్డి పేరు ప్రకటించడం వెనుక కూడా రాహుల్ గాంధీ (Rahul Gandhi) భరోసా ఉన్నట్టు తెలుస్తోంది. కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల కోసం వెళ్ళిన రేవంత్…అక్కడి బహిరంగ సభలోనే ఎవరూ ఊహించని విధంగా వంశీ పేరును అనౌన్స్ చేశారు
కాంగ్రెస్ అభ్యర్థులను ఆ పార్టీ అధిష్టానం కాకుండా బహిరంగా సభల్లో ప్రకటించడం అనేది లేదు. గతంలో వైఎస్ హయాంలోనే ఇలాంటి స్వేచ్ఛ ఉండేది. ఇప్పుడు రేవంత్ కి హైకమాండ్ అలాంటి స్వేచ్ఛ ఇచ్చిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈమధ్యే ఢిల్లీ వెళ్ళొచ్చిన రేవంత్ … రాష్ట్రంలో పాలనపై రిపోర్టులు సమర్పించి ఢిల్లీ పెద్దల మనసు గెలుచుకున్నట్టు తెలుస్తోంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ వ్యూహం పని చేయబట్టే పార్టీ అధికారంలోకి వచ్చిందని హైకమాండ్ భావిస్తోంది. తన అనచురులు, సీనియర్లను కూడా కాదని.. గెలిచే వారికే అసెంబ్లీ టిక్కెట్లు వచ్చేలా రేవంత్ ప్రయత్నించారు. తెలంగాణ ఇచ్చిన పార్టీ అని చెప్పుకున్నా 10 యేళ్ళు అధికారానికి దూరమైంది కాంగ్రెస్.
అలాంటిది ఇక్కడ గెలుపులో రేవంత్ ది మేజర్ పార్ట్ అని అర్థమైంది.
రాబోయే 20యేళ్ళు నేనే సీఎం అంటూ ఈమధ్యే ఓ సభలో రేవంత్ రెడ్డి ప్రకటన కూడా చేశారు. కేవలం ప్రకటనే కాదు అందుకు ప్లాన్ కూడా చేస్తున్నట్టు తెలుస్తోంది. రాబోయే 20యేళ్ళు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉండేలా రేవంత్ మిషన్ రెడీ చేస్తున్నట్టు సమాచారం. అందుకోసం రాహుల్ సలహాతో యువతను ప్రోత్సహిస్తున్నారని అంటున్నారు. ఇదే నిజమైతే… రాబోయే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు, నామినేటెడ్ పదవుల్లోనూ యువతకే ఎక్కువ ప్రాధాన్యత దక్కే ఛాన్సుందని అంటున్నారు. గతంలో వైఎస్ లాగే… రేవంత్ రెడ్డి కూడా తన మార్క్ ను చూపించబోతున్నారని కాంగ్రెస్ లో చర్చ జరుగుతోంది.