మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఎంవీఏకి ఊహించని షాక్ ఇచ్చాయి. కాంగ్రెస్, శివసేన యుబీటీ, ఎన్సీపీ శరద్ పవార్ వర్గాలు కోలుకోలేని విధంగా దెబ్బతిన్నాయి. దీంతో మూడు పార్టీ భవిష్యత్ గందరగోళంలో పడింది. మహా వికాస్ ఆఘాడీ కూటమి కొనసాగుతుందా ? లేదంటే ఎవరి దారి వారు చూసుకుంటారా ? వచ్చే ఎన్నికల దాకా కలిసి పని చేస్తారా అన్నది ఉత్కంఠ రేపుతోంది.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో…చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బీజేపీ కూటమి 233 స్థానాలను గెలుచుకుంది. ఇందులో బీజేపీ 132, షిండే శివసేన 57, ఎన్సీపీ అజిత్ పవార్ వర్గానికి 41 సీట్లు వచ్చాయి. అటు మహా వికాస్ ఆఘాడీ కూటమిలోని శివసేన ఉద్దవ్ వర్గానికి 20, కాంగ్రెస్ కు 16, ఎన్సీపీ శరద్ పవార్ వర్గానికి 10 సీట్లు మాత్రమే వచ్చాయి. మూడు పార్టీలు ఈ అసెంబ్లీ ఎన్నికల్లో చావు దెబ్బ తిన్నాయి. గత ఎన్నికల్లో బీజేపీకి 105 సీట్లు, శివసేనకు 56 సీట్లు వచ్చాయి. ఎన్సీపీకి 54, కాంగ్రెస్ పార్టీకి 44 సీట్లు వచ్చాయి. బీజేపీ కూటమికి స్పష్టమైన మెజార్టీ రావడంతో….దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి అయ్యారు. ఉద్దవ్ థాకరే మద్దతు ఉపసంహరించుకోవడంతో…ఐదు రోజుల్లోనే ప్రభుత్వం కూలిపోయింది. ఆ తర్వాత కాంగ్రెస్, ఎన్సీపీ సాయంతో ముఖ్యమంత్రి అయ్యారు. రెండు సంవత్సరాల 214 రోజుల పాటు పని చేశారు. ఆ తర్వాత కూటమికి వ్యతిరేకంగా ఏక్ నాథ్ షిండే తిరుగుబాటు చేశారు. 40 మంది ఎమ్మెల్యేలతో కలిసి…బీజేపీకి మద్దతు ఇచ్చారు. ఆ పార్టీ సాయంతో సీఎం అయ్యారు.
కాంగ్రెస్, శివసేన, ఎన్సీపీలకు…దశాబ్దాలుగా సాంప్రదాయబద్దంగా వస్తున్న ఓటర్లు…ఈ ఎన్నికల్లో దూరమయ్యారు. ఇలాంటి పరిస్థితులు వస్తాయని కూడా ఆ మూడు పార్టీలు ఊహించలేకపోయాయి. అందరికంటే ఎక్కువ శరద్ పవార్ నాయకత్వంలోని ఎన్సీపీకి…ఈ ఎన్నికలు చావుదెబ్బ లాంటివి. 54 సీట్ల నుంచి ఆ పార్టీ పది సీట్లకు పడిపోయింది. అంటే 44 సీట్లను కోల్పోయింది. శివసేన 56 నుంచి 20 సీట్లకు, కాంగ్రెస్ 44 నుంచి 16 సీట్లకు పరిమితం అయ్యాయి. శివసేన యుబీటీ 36 సీట్లను కోల్పోతే…కాంగ్రెస్ 28 సీట్లను సమర్పించుకుంది. ఎన్నికల ముందు శివసేన విల్లు బాణం గుర్తు కోల్పోతే…ఎన్సీపీ ఘడియారం గుర్తును వదులుకోవాల్సి వచ్చింది. ఇది ఆ పార్టీలకు పెద్ద మైనస్ అయితే…ఏక్ నాథ్ షిండే, అజిత్ వర్గాలకు సింబల్స్ కలిసి వచ్చాయి. సింబల్సే శరద్ పవార్, ఉద్దవ్ థాకరే వర్గాల కొంపముంచాయి. మహారాష్ట్రలో విజయం సాధించి, ఇండియా కూటమిని మరింత బలోపేతం చేయాలని కాంగ్రెస్ భావించింది. కానీ హస్తం పార్టీ ఆశలు కూడా అడియాశలయ్యాయి. మహారాష్ట్ర రాజకీయాల్లో ఈ పార్టీల భవిష్యత్ ఏమిటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
ఉద్ధవ్ థాకరే, శరద్ పవార్ పార్టీలు ఈ ఎన్నికల్లో అస్తిత్వ కోసం పోరాటం చేయాల్సి వచ్చింది. కాంగ్రెస్‌తో కలిసి మహాయుతిని అడ్డుకునే ప్రయత్నాలు చేసినా లాభం లేకపోయింది. దీంతో ఈ పార్టీల భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఇంతకాలం హిందూ భావజాల పార్టీగా చలామణీ అయిన శివసేన…రాజకీయ భవిష్యత్తు కోసం బద్ద వ్యతిరేకి అయిన కాంగ్రెస్‌తో చేతులు కలిపింది. ఈ కారణంగానే శివసేనకు మద్దతు తగ్గిందనే వాదనలు ఉన్నాయి. పార్టీ గుర్తు, అస్తిత్వం, ప్రజల మద్దతు కోల్పోయిన శివసేన-ఉద్ధవ్ భవిష్యత్తు ఏంటన్నది ఆసక్తికరంగా మారింది. పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలంటే…ఉద్ధవ్ థాకరే సిద్ధాంతపరంగా పార్టీని పునర్నర్మించాల్సి పరిస్థితి ఏర్పడింది. ఇదే జరిగితే మహా వికాస్ అఘాడీ నుంచి బయటికి రావాల్సి ఉంటుంది.
దేశ రాజకీయాల్లో ఉద్దండుడుగా పేరు గాంచిన శరద్ పవార్ స్థాపించిన పార్టీ….రెండు ముక్కలైంది. అక్కడితోనే పవార్ పతనం మొదలైందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. పార్టీ వ్యవస్థాపకుడికే అధికారిక చిహ్నం దక్కక..మరో సింబల్ తో ఎన్నికల్లో పోటీ చేయాల్సి వచ్చింది. పార్టీలో కీలక నేతలు ఉన్నా…ఓట్లు పోలరైజ్ చేయగలిగే సత్తా మాత్రం శరద్ పవార్‌కే ఉంది. అయితే ఈ ఎన్నికల్లో పరాజయం మూటగట్టుకోవాల్సి వచ్చింది. 83 ఏళ్ల శరద్ పవార్ ప్రయత్నించిన ఆశించిన ఫలితం రాలేదు. దీంతో ఆయన వారసుడు ఎవరన్న దానిపై ఆసక్తికర చర్చ మొదలైంది. ఎవరు పార్టీ పగ్గాలు చేపట్టినా…పార్టీ నిర్మాణం మాత్రం కత్తిమీద సాములాంటిదే. పార్టీకి పునర్వైభవం తీసుకురావడం అంతసులువైన విషయం కాదు.
మరోవైపు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి…నానాటి రాష్ట్రాల్లో దిగజారుతూనే ఉంది. లోక్‌సభ ఎన్నికల్లో 100 సీట్లు గెలిచినా…అదే ఊపును కొనసాగించలేకపోయింది. హర్యానాలో గెలుస్తామనుకున్నా అనూహ్యంగా ఓడిపోయింది. మహారాష్ట్రలో అలాగే ఆలోచించి బొక్క బోర్లా పడింది. ఘోర పరాజయం పాలయిన తర్వాత…దేశవ్యాప్తంగా ఇండియా కూటమిలో ఉన్న పార్టీలు కొనసాగుతాయా ? లేదంటే వేరు కుంపటి పెట్టుకుంటాయా అన్నది భవిష్యత్ నిర్ణయించనుంది. మహా ఎన్నికల ఓటమితో కొన్ని పార్టీలు కచ్చితంగా దూరమవుతాయని పొలిటికల్ ఎనలిస్టులు అంచనా వేస్తున్నాయి. ఏం జరుగుతుందో చూడాలి.