Telangana Congress: కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్.. ఆశలు పెంచే ఆయుధం ?

తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ ఓట్లను ఆకర్షించేందుకు కాంగ్రెస్ వేసిన డిక్లరేషన్ వ్యూహం ఫలిస్తుందా.

  • Written By:
  • Publish Date - August 27, 2023 / 12:29 PM IST

ఎట్టకేలకు ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో జరిగిన కాంగ్రెస్‌ ప్రజాగర్జన సభ వేదికగా దీనిపై అనౌన్స్ మెంట్ వెలువడింది. ఎన్నికలు సమీపించిన వేళ ఈ డిక్లరేషన్ లోని ‘అంబేడ్కర్ అభయహస్తం’ పథకంపై పెద్ద డిబేట్ జరుగుతోంది. ఒకప్పుడు కాంగ్రెస్ వైపు ఉన్న ఎస్సీ, ఎస్టీ ఓటుబ్యాంకు.. గత పదేళ్లుగా బీఆర్ఎస్ వెంట నడుస్తోంది. ఈనేపథ్యంలో ఎలాగైనా వారిని తమ వైపునకు తిప్పుకునే వ్యూహంలో భాగంగా ‘అంబేడ్కర్ అభయహస్తం’ స్కీమ్ ను కాంగ్రెస్ ప్రకటించింది. దీని ద్వారా ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు 12 లక్షల ఆర్థిక సహాయం అందిస్తామని వెల్లడించింది. అయితే కేసీఆర్ పార్టీ బీఆర్ఎస్ వర్గాలు ‘అంబేడ్కర్ అభయహస్తం’ సహా ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ లోని అన్ని పథకాలను తమ నుంచే కాంగ్రెస్ కాపీ కొట్టిందని విమర్శిస్తున్నాయి. దళితబంధు స్కీమ్ ను చూశాకే కాంగ్రెస్ పెద్దలకు ‘అంబేడ్కర్ అభయహస్తం’ ఆలోచన వచ్చి ఉంటుందని ఎద్దేవా చేస్తున్నాయి. హస్తం పార్టీ ఏలుతున్న ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి స్కీమ్ లేదని గుర్తు చేస్తున్నాయి. కాంగ్రెస్ నేతలు మాత్రం ఎస్సీ, ఎస్టీ సంక్షేమానికి తాము ఇచ్చే ప్రాధాన్యానికి ఈ డిక్లరేషనే నిదర్శనమని వాదిస్తున్నారు. అణగారిన వర్గాలకు అండగా ఉంటామని అంటే బీఆర్ఎస్ వాళ్లు అక్కసు వెళ్లగక్కుతున్నారని మండిపడుతున్నారు.

‘‘దళిత బంధు పథకాన్ని ప్రకటించి సీఎం కేసీఆర్ సింహంపై స్వారీని మొదలుపెట్టారు.. అది ఎలా ముగుస్తుందో తెలియదు’’ అని సాక్షాత్తూ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత ఒకరు గతంలో కామెంట్ చేశారు. ఎందుకంటే ఆ స్కీమ్ కు అంత భారీ స్థాయిలో ఫండ్స్ అవసరమవుతాయి. సీఎం కేసీఆర్ దత్తత గ్రామం వాసాలమర్రిలో 76 దళిత కుటుంబాలకు, మెదక్‌ జిల్లా చింతమడక పంచాయతీ గ్రామాల్లోని 1,276 కుటుంబాలకు, హుజూరాబాద్‌లో 15 మందికి, ఇతర అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొందరికి మాత్రమే దళిత బంధు పథకాన్ని అమలు చేశారు. తొలివిడతగా 5వేల మందికి ఈ స్కీమ్ ద్వారా లబ్ధి చేకూర్చాలన్న లక్ష్యాన్ని కూడా నేటికీ చేరుకోలేదు.ఇక రాష్ట్రమంతటా దాన్ని అమలు చేయడం పెద్ద ఛాలెంజే. ఈనేపథ్యంలో కాంగ్రెస్ ప్రకటించిన ‘అంబేడ్కర్ అభయహస్తం’ కూడా ఆచరణ సాధ్యమయ్యే అవకాశాలు దాదాపు లేవు.

ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ఇళ్లులేని ప్రతి ఎస్సీ, ఎస్టీ కుటుంబానికి స్థలం కేటాయించడంతో పాటు ఇంటి నిర్మాణానికి రూ.6 లక్షలను అందిస్తామని కాంగ్రెస్ అంటోంది. ఈ పథకం అమలు సాధ్యమయ్యే విషయమే. ఇదే తరహా పథకం ఒకదాన్ని గృహలక్ష్మి పేరుతో కేసీఆర్ సర్కారు ఇటీవలే ప్రకటించింది. ఎన్నికలకు సరిగ్గా ఐదు నెలల ముందు (జులైలో) ఈ స్కీమ్ ను తెలంగాణ ప్రభుత్వం అనౌన్స్ చేసింది. ఒకవేళ చిత్తశుద్ధి ఉండి ఉంటే .. అధికారంలోకి రాగానే దీన్ని ప్రకటించి ఉండేవారు. ఇళ్లు కట్టుకునే పేదలకు గృహలక్ష్మి పథకం ద్వారా బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.3 లక్షలు ఇస్తుంటే.. కాంగ్రెస్ అంతకంటే డబుల్ అమౌంట్ ఇస్తామని అంటోంది. ఇందులో కాంగ్రెస్ పోటీతత్వమే తప్ప.. చిత్తశుద్ధి కనిపించడం లేదని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. మాదిగ, మాల, ఇతర ఎస్సీ ఉపకులాలకు కొత్తగా 3 ఎస్సీ కార్పొరేషన్లను ఏర్పాటు చేసి, ఏటా చెరో రూ.750 కోట్లు మంజూరు చేస్తామని కాంగ్రెస్ అంటోంది. ఈ ప్రకటన హస్తం పార్టీకి కొంతమేర వర్క్ ఔట్ అయ్యే ఛాన్స్ ఉంది. బీఆర్ఎస్ సర్కారు ఇప్పటికే ఎంబీసీలు, 12 బీసీ కులాలకు ఫెడరేషన్లను ఏర్పాటుచేసింది. కానీ ఈవిధంగా ఎస్సీ, ఎస్టీలకు కేటాయింపులు పెంచాలనే ఆలోచన చేయలేదు. ఇక ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ లోని మిగతా 9 ప్రకటనలు కొత్తసీసాలో పాత పాయసం అన్నట్టుగా ఉన్నాయనే అభిప్రాయం రాజకీయ పరిశీలకుల్లో వ్యక్తమవుతోంది.