నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు చిట్టచివరి ముఖ్యమంత్రి. రాష్ట్ర విభజనను చివరి వరకూ అడ్డుకున్న నేతగా ప్రసిద్ధి. లాస్ట్ బాల్ కు కూడా సిక్స్ కొడతానని చెప్పారు. కానీ అది సిక్స్ కాకపోగా క్లీన్ బౌల్డ్ అయింది. అలాగే ఆయన పొలిటికల్ కెరీర్ కూడా.! రాష్ట్ర విభజనను అడ్డుకుని విఫలమైన కిరణ్ కుమార్ రెడ్డి సమైక్యాంధ్ర పేరుతో పార్టీ పెట్టి ఎన్నికలకు వెళ్లారు. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభావంతో ఆయన పార్టీకి ఒక్క సీటు కూడా దక్కలేదు. దీంతో అప్పటి నుంచి చాలా కాలంపాటు క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉండిపోయారు. అయితే ఆ మధ్య మళ్లీ కాంగ్రెస్ నుంచి పిలుపు రావడంతో ఢిల్లీ వెళ్లి సోనియా, రాహుల్ గాంధీని కలిశారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో కిరణ్ కుమార్ రెడ్డి మళ్లీ యాక్టివ్ అవుతారని భావించారు. అయితే అలా జరగలేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి రెండోసారి రాజీనామా చేసి బయటికొచ్చేశారు కిరణ్ కుమార్ రెడ్డి.
కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరుతారని టాక్ నడుస్తోంది. నేడోరేపో ఆయన ఢిల్లీ వెళ్లి మోదీ, అమిత్ షా సమక్షంలో పార్టీ కండువా కప్పుకుంటారని చెప్తున్నారు. అయితే కిరణ్ కుమార్ రెడ్డి వల్ల బీజేపీకి ఏంటి ఉపయోగం అనేదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగిన కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర విభజన తర్వాత ఆ పార్టీలోనే ఇమడలేకపోయారు. అలాంటిది ఇప్పుడు బీజేపీలో ఏ మేరకు ఆ పార్టీకి ఉపయోగపడతారనేది ప్రశ్నార్థకంగా మారింది. కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ. అలాంటి చోటే మనుగడ సాగించలేకపోయిన కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో నెగ్గుకొస్తారా.. అనేది కూడా అనుమానమే.
ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ పరిస్థితి అంతంతమాత్రమే. అక్కడ పార్టీని నడిపించడం.. దాన్ని అధికారంలోకి తీసుకురావడం ఆషామాషీ విషయం కాదు. అక్కడ లీడర్లకూ కొరతే. అలాంటి చోట కిరణ్ కుమార్ రెడ్డికి బాధ్యతలు అప్పగిస్తే పెద్దగా ప్రయోజనం ఉండదనేది విశ్లేషకులు చెప్తున్నమాట. అంతేకాదు.. కిరణ్ కుమార్ రెడ్డి మాస్ లీడర్ కూడా కాదు. 2014 దాదాపు రాజకీయాలకు దూరంగానే ఉంటున్నారు. ఆయన సమకాలీకులంతా ఇతర పార్టీల్లో సెటిల్ అయిపోయారు. ఈయన పిలిస్తే వచ్చే నాయకులు కూడా లేరనే చెప్పాలి.
ఇక తెలంగాణలో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభావం గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. పైగా ఇక్కడి నాయకులు కిరణ్ కుమార్ రెడ్డి రాకనే జీర్ణించుకోలేకపోవచ్చు. మరి ఇలాంటి పరిస్థితిల్లో బీజేపీ కిరణ్ కుమార్ రెడ్డిని ఎందుకు పార్టీలో చేర్చుకుంటోందో… ఎలాంటి పదవి అప్పగిస్తుందో.. ఆయన నుంచి ఏం ఆశిస్తోందో.. అంతు చిక్కడం లేదు.