Pawan Kalyan: వారాహి మీద వైసీపీ కులముద్ర వేస్తోందా ?

 సినిమాలకు బ్రేక్ ఇచ్చి.. ఎట్టకేలకు రాజకీయాల్లో మళ్లీ బిజీ కాబోతున్నారు జనసేనాని పవన్ కల్యాణ్. వారాహి దుమ్ము దులిపి గేర్ మార్చబోతున్నారు. ఈ నెల 14న అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయ దగ్గర ప్రత్యేక పూజలు చేసి యాత్ర మొదలుపెట్టబోతున్నారు.

  • Written By:
  • Publish Date - June 4, 2023 / 12:59 PM IST

ఉభయ గోదావరి జిల్లాల్లోని 11 నియోజకవర్గాలను కవర్ చేస్తూ.. భీమవరంతో వారాహి యాత్ర ముగిసేలా షెడ్యూల్ ప్లాన్ చేసింది జనసేన. వీధుల్లో వారాహి వెళ్తుంటే.. దాని సౌండ్ ఎలా ఉంటుందో చూద్దామనే చాలామంది వెయిట్ చేస్తున్నారు ఏపీలో ! వారాహి ప్రయాణం మొదలుకాబోతున్న వేళ.. వైసీపీ కులం కార్డును తెరమీదకు తీసుకువస్తోంది.. వారాహికి కుల ముద్ర వేసేందుకు ప్రయత్నాలు చేస్తోందనే చర్చ.. రాజకీయవర్గాల్లో జోరుగా సాగుతోంది.

ఒక కులాన్ని నమ్ముకొని రాజకీయాలు చేస్తే.. జనాలు ఒప్పుకోరు అంటూ సజ్జల చేసిన వ్యాఖ్యలే దీని ఎగ్జాంపుల్ అనే చర్చ జరుగుతోంది. కాపు సామాజికవర్గం కోసమే.. ఉభయ గోదావరి జిల్లాల్లో పవన్ మొదటి దశ యాత్ర చేస్తున్నారని అర్థం వచ్చేలా సజ్జల మాట్లాడిన మాటలు.. ఇప్పుడు రాజకీయాల్లో కొత్త చర్చకు కారణం అవుతున్నాయ్. వారాహి ప్రయాణం మొదలుకావడానికి ముందే జనాలు సిద్ధం చేసేలా.. కొన్ని వర్గాలను జనసేనకు దూరం చేసేలా అధికార పార్టీ వ్యూహాలు రచిస్తుందనే అభిప్రాయాలు చాలామందిలో వ్యక్తం అవుతున్నాయ్.

నిజానికి గోదావరి జిల్లాల్లో గత ఎన్నికల్లో వైసీపీ క్లీన్‌స్వీప్‌ చేసింది. టీడీపీ, జనసేన విడిగా పోటీ చేయడంతో.. కాపు ఓట్లు చీలిపోయి వైసీపీకి ప్లస్ అయింది. ఐతే ఇప్పుడు ఆ రెండు కలిస్తే అధికార పార్టీకి సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అందుకే కావాలని వారాహి, పవన్ ఒక కులానికే పరిమితం అనే సంకేతాలు వెళ్లేలా వైసీపీ ప్లాన్ చేస్తుందా అనే డిస్కషన్ వినిపిస్తోంది. ఐతే ఏ రాజకీయ పార్టీ అయినా.. తమకు బలం ఉన్న చోట నుంచి యుద్ధానికి రెడీ అవుతుంది. రాయలసీమ నుంచే వైసీపీ ఏదైనా మొదలుపెట్టేది కూడా అందుకే ! ఇప్పుడు జనసేన చేస్తోంది కూడా అదే ! ఉమ్మడి గోదావరి జిల్లాల్లో కాపు సామాజికవర్గం బలం ఎక్కువ.

జనసేనకు వాళ్లలో మెజారిటీ వర్గాలు మద్దతుగా ఉంది కూడా నిజమే ! అందుకే బలం ఉన్న చోట నుంచి పవన్ యాత్ర ప్రారంభించాలనుకోవడంలో తప్పేముంది అన్నది పవన్‌ వర్గం చెప్తున్న మాట. వాళ్లు చేస్తే సంసారం.. ఇంకొకకరు చేస్తే ఇంకొకటా అని ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు. ఇదంతా ఎలా ఉన్నా.. వారాహి మీద పవన్‌ను చూసేందుకు.. జనాలంతా ఎదురుచూస్తున్నారు. ఈ షెడ్యూల్‌ ఖరారు కావడంతో.. జనసేన శ్రేణుల్లోనూ కొత్త ఉత్సాహం కనిపిస్తోంది.