తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఎంతో సమయం లేదు.. ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో మూడు రోజుల పాటు మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. నవంబర్ 28 మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి నవంబర్ 30 గురువారం సాయంత్రం 5 గంటల వరకు మద్యం అమ్మకాలు నిలిపివేయనున్నారు. ఈ విషయంపై వైన్స్, బార్ల యజమానులకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ముందస్తు సమాచారం ఇచ్చింది. రాష్ట్రంలోని మద్యం దుకాణాల యజమానులను రాష్ట్ర ఎక్సైజ్ శాఖ అప్రమత్తం చేసింది. రాష్ట్రంలో ప్రస్తుతం 2,620 మద్యం దుకాణాలుండగా.. అవన్ని కూడా మూతబడనున్నాయి.
ఎన్నికల నేపథ్యంలో ఎవరైనా.. అక్రమంగా మద్యం అమ్మినట్లు సమాచారం అందితే.. వారి షాప్ లైసెన్స్లు రద్దు చేస్తామని ఎక్సైజ్ శాఖ హెచ్చరించింది. మరో వైపు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్న డిసెంబర్ 3వ తేదీ కూడా మధ్యం షాపులు తెరిచేందుకు అనుమతి లేదు అని అధికారులు స్పష్టం చేసింది. కాగా డిసెంబర్ 1 నుంచే నూతన మద్యం దుకాణాలు ప్రారంభం కానున్నాయి.
ఎన్నికల ఫలితాల నేపథ్యంలో మద్యం ఎక్కువ సేల్ అవ్వలాని.. మద్యం బాటిల్‌పై ఉన్న ఎమ్మార్పీ కంటే తక్కువ ధరకు మద్యం విక్రయించొద్దంటూ ఎక్సైజ్ శాఖ కమిషనర్ జ్యోతి బుద్ధప్రకాశ్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ఎక్సైజ్ నిబంధనల ప్రకారం.. ఎమ్మార్పీ కంటే తక్కువ ధరకు మద్యం అమ్మితే రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు ఫైన్ విధించాల్సి ఉంటుందని ఉత్తర్వులో పేర్కొన్నారు. నేరం రుజువైతే 6 నెలల నుంచి రెండేళ్ల వరకు జైలు శిక్ష పడుతుందని హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు మద్యం వ్యాపారులకు అవగాహన కల్పిస్తున్నారు.