Women’s Reservation Bill: పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్..? బుధవారం ప్రవేశపెట్టే ఛాన్స్..!

మహిళా రిజర్వేషన్ బిల్లుఎప్పటినుంచో పెండింగ్‌లో ఉంది. ఆదివారం జరిగిన పార్లమెంట్ అఖిలపక్ష సమావేశంలో కూడా దీనిపై చర్చ జరిగింది. దీనికి ఎన్డీయే పక్షాలతోపాటు, ఇండియా కూటమి పక్షాలు కూడా సానుకూలంగా స్పందించాయి.

  • Written By:
  • Publish Date - September 18, 2023 / 03:19 PM IST

Women’s Reservation Bill: ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న మహిళా రిజర్వేషన్ బిల్లు తాజా పార్లమెంట్ సమావేశాల్లోనే ప్రవేశపెట్టే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. సోమవారం నుంచి ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ సమావేశాల్లో కీలక బిల్లులు ప్రవేశపెట్టాలని మోదీ సర్కారు భావిస్తోంది. దీనిలో భాగంగా మహిళా రిజర్వేషన్ బిల్లు బుధవారం లోక్‌సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించడమే ఈ బిల్లు. దీనిపై దశాబ్దాలుగా డిమాండ్లు ఉన్నాయి.

ఈ బిల్లు ఎప్పటినుంచో పెండింగ్‌లో ఉంది. ఈ సమావేశాల్లో బిల్లు సంగతి తేల్చేయాలని బీజేపీ డిసైడైనట్లు కనిపిస్తోంది. ఆదివారం జరిగిన పార్లమెంట్ అఖిలపక్ష సమావేశంలో కూడా దీనిపై చర్చ జరిగింది. దీనికి ఎన్డీయే పక్షాలతోపాటు, ఇండియా కూటమి పక్షాలు కూడా సానుకూలంగా స్పందించాయి. దాదాపు అన్ని పార్టీలు ఈ బిల్లుకు మద్దతు తెలిపాయి. ఈ లెక్కన ఈ బిల్లు పార్లమెంట్ ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఇక.. ఇటీవల కాంగ్రెస్ సహా పలు పార్టీలు మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇటీవలే సోనియా గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో ప్రధాని మోదీకి లేఖ రాసింది. బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవిత కూడా దీనిపై చాలా కాలంగా పోరాడుతున్నారు. కొద్దిరోజుల క్రితం ఢిల్లీలో కూడా కవిత దీక్ష చేసిన సంగతి తెలిసిందే. మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టాలని కోరుతూ ఇటీవల కవిత.. ప్రధానికి లేఖ రాశారు. కాంగ్రెస్, బిఆర్ఎస్, టిడిపి, బిజెడి వంటి ప్రధాన పార్టీల నుంచి డిమాండ్లు పెరుగుతున్న వేళ కేంద్రం కూడా సానుకూలంగా స్పందించింది.

దీనికి సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నామని చెప్పింది. దీంతో తాజా సమావేశాల్లోనే బిల్లు పార్లమెంట్ ముందుకొచ్చే ఛాన్స్ ఉంది. అన్ని పార్టీల మద్దతుతో సులభంగానే బిల్ పాసవుతుంది. అయితే, ఆర్జేడీ, సమాజ్ వాదీ పార్టీ వంటి కొన్ని ప్రాంతీయ పార్టీలు మహిళలకు రిజర్వేషన్లను సమర్ధించినప్పటికీ, రిజర్వేషన్లలో వెనుకబడిన కులాలు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు చెందిన మహిళలకు కోటాను నిర్ణయించే అంశంలో కేంద్రం అభిప్రాయం ఏంటని ప్రశ్నించాయి. ఈ విషయంలో కేంద్రం స్పష్టతనివ్వాల్సి ఉంది. ఇతర రిజర్వేషన్లను కూడా కేంద్రం పరిగణనలోకి తీసుకుంటే బిల్లు పాసయ్యేందుకు ఎలాంటి ఆటంకాలు ఉండకపోవచ్చు.