Wrestlers Protest: దేశ రాజధానిలో క్రీడాకారిణుల కన్నీళ్లు.. పతకాలు తెచ్చిన వాళ్లకు ఇచ్చే గౌరవం ఇదేనా? ప్రభుత్వ మొండి వైఖరిపై విమర్శలు..!

వాళ్లు.. దేశానికి పతకాల పంట పండించిన క్రీడాకారులు.. మూడు రంగుల జెండాను ఎత్తుకుని గర్వంగా నిలబడ్డ వాళ్లు.. చుట్టూ ఉన్న ప్రేక్షకులంతా చప్పట్లు కొడుతుంటే.. అవి తమకు మాత్రమే కాదు.. మొత్తం భారత దేశానికి అని భావించిన వాళ్లు. పతకాలతో దేశం తిరిగొస్తే.. అభిమానులతో ఘన స్వాగతం అందుకున్న వాళ్లు.. ఇదంతా గతం..! ఇంత కీర్తి అందుకుని, కోట్లాది మందికి స్ఫూర్తిగా నిలిచిన క్రీడాకారులు ఇప్పుడు ఇదే దేశంలో కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. అధికార బలానికి, పోలీసుల కాఠిన్యానికి బలవుతున్నారు.

  • Written By:
  • Publish Date - May 29, 2023 / 05:39 PM IST

Wrestlers Protest: నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవంతో దేశమంతా గర్వపడే సంఘటన జరిగిన రోజే.. అదే పార్లమెంట్ భవనానికి సమీపంలో మహిళా క్రీడాకారిణులు అవమానానికి, అన్యాయానికి గురయ్యారు. దేశానికి ఎనలేని కీర్తి తెచ్చిపెట్టిన క్రీడాకారులు కన్నీళ్లు పెట్టుకున్నారు. పోలీసుల కాఠిన్యాన్ని చవిచూశారు. వాళ్లు చేసిన తప్పల్లా.. న్యాయం కోసం నినదించడమే. ఇదంతా తమకు న్యాయం చేయాలని కోరుతూ జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తున్న మహిళ, పురుష క్రీడాకారులపై పోలీసులు అమానుషంగా వ్యవహరించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దేశానికి మెడల్స్ తెచ్చిపెట్టి, ఛాంపియన్స్‌గా నిలిచిన వారికి ఇదేనా మన దేశం ఇచ్చే గౌరవం? ఇలాగేనా వారితో వ్యవహరించే తీరు? ఆడబిడ్డలని కూడా చూడకుండా ఈడ్చుకెళ్తారా? ఒక ఎంపీని రక్షించేందుకు ప్రభుత్వం ఇంతగా ఎందుకు ప్రయత్నిస్తోంది? మహిళా రాష్ట్రపతిపై నోరు జారినందుకు మహిళలందరికీ అన్యాయం జరిగిందంటూ మొన్నే పార్లమెంటులో గొంతు చించుకుని అరిచిన కేంద్ర మహిళా ఎంపీలంతా ఇప్పుడు ఏమయ్యారు?
పార్లమెంట్ నూతన భవన ప్రారంభోత్సవం ఢిల్లీలో ఆదివారం జరిగింది. అదే రోజు అక్కడికి సమీపంలోనే ఉన్న భారత స్టార్ రెజ్లర్లు వినేశ్ ఫొగాట్, సాక్షి మాలిక్, భజ్‍రంగ్ పునియా వంటి క్రీడాకారులను పోలీసులు అత్యంత అమానవీయంగా లాక్కెళ్లారు. తమ అరెస్టును అడ్డుకునేందుకు ఆ రెజ్లర్లు ఎంతగా ప్రయత్నించినా సాధ్యం కాలేదు. బలవంతంగా ఈడ్చుకెళ్లి మరీ బస్సులో పడేసి, పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఇదంతా చూసిన చాలా మంది షాకయ్యారు. నిజంగా రెజ్లర్లను ఇంతగా అవమానించాలా.. వారితో ఇంత దారుణంగా ప్రవర్తించాలా అంటూ మండిపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం, పోలీసులు తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు.
ఒక్క ఎంపీని కాపాడేందుకేనా ఇదంతా?
భారత రెజ్లర్ల ఫెడరేషన్ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ తమను లైంగికంగా వేధించాడంటూ కొన్ని రోజులుగా మహిళా రెజ్లర్లు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన నిర్వహిస్తున్నారు. బ్రిజ్ భూషన్ సింగ్‪ను ఆ పదవిలోంచి తొలగించి, అరెస్టు చేయాలంటూ క్రీడాకారులు డిమాండ్ చేస్తున్నారు. వీరిలో దేశానికి ఎన్నో పతకాలు తీసుకొచ్చిన స్టార్ రెజ్లర్లు సాక్షి మాలిక్, భజ్‌రంగ్ పునియా, వినేశ్ ఫొగాట్ వంటి క్రీడాకారిణులు ఉన్నారు. వీరికి మరెందరో రెజ్లర్లు మద్దతు పలుకుతున్నారు. ప్రతిపక్షాలూ వీరికి సంఘీభావం తెలిపాయి. అయితే, ప్రభుత్వం వీరిని పట్టించుకోవడం లేదు. కారణం.. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి బీజేపీకి చెందిన సీనియర్ ఎంపీ. అందుకే ప్రభుత్వ చర్యలు తూతూమంత్రంగా సాగుతున్నాయి. క్రీడాకారులు ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి వెనుకంజవేశారు. దేశమంతా కీర్తించిన క్రీడాకారులు తమ భవిష‌్యత్తును పక్కనబెట్టి మరీ ఇంతలా ఒక ఎంపీపై విమర్శలు చేస్తుంటే బీజేపీ స్పందన అంతంతమాత్రమే. ఈ విష‍యంలో ప్రభుత్వ ప్రతిష్ట ఎంతగా దిగజారుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.


మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా?
మహిళా క్రీడాకారిణులు చేసిన ఆరోపణలు సాధారణమైనవి కాదు. లైంగిక పరమైన ఆరోపణలు. వీటిని తేలిగ్గా తీసుకుంటే మన ఆడ బిడ్డలను అవమానించినట్లే. అందులోనూ ఈ ఆరోపణలు చేసింది అంతర్జాతీయ స్థాయి రెజ్లర్లు. మన దేశానికి ఎన్నో పతకాలు, కీర్తిప్రతిష్టలు తెచ్చిన వాళ్లు. అలాంటిది వాళ్లు చేసిన ఆరోణల విషయంలో ప్రభుత్వం సరిగ్గా స్పందించకపోవడం ఆశ్చర్యకరం. దీనిపై దేశ రాజధాని ఢిల్లీలో ఆరోపణలు చేసి, ఆందోళన చేస్తున్నా పట్టించుకోవడం లేదు. మహిళా సాధికారత గురించి, మన దేశంలో మహిళలకు ఇచ్చే గౌరవం గురించి ఎంతో గొప్పగా చెప్పుకొనే ప్రభుత్వం వీరి విషయంలో మాత్రం భిన్నంగా వ్యవహరిస్తోంది. ఇంత పేరున్న క్రీడాకారిణిలకే న్యాయం జరగకుంటే.. ఇక సామాన్య మహిళల పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు.
మహిళా మంత్రుల మౌనం..
గత ఏడాది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విషయంలో కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి తప్పుగా మాట్లాడినందుకు అప్పుడు పార్లమెంటే స్తంభించింది. రాష్ట్రపతి విషయంలో చౌదరి వ్యాఖ్యలు ముమ్మాటికీ తప్పే. ఈ సమయంలో బీజేపీకి చెందిన కేంద్ర మహిళా మంత్రులు గొంతు చించుకుని అరిచారు. కాంగ్రెస్‌పై మండిపడ్డారు. ఒక మహిళను ఇంతగా అవమానిస్తారా అంటూ ఆందోళన చేశారు. నిర్మలా సీతారామన్, స్మృతి ఇరానీ, ఇతర బీజేపీ మహిళా ఎంపీలు ఆందోళన చేశారు. కాంగ్రెస్ నేత క్షమాపణలు చెప్పాల్సిందే అంటూ డిమాండ్ చేశారు. చివరకు అధిర్.. రాష్ట్రపతికి క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. ఆ రోజు ఒక తప్పుడు మాట విషయంలో తెగ హడావిడి చేసిన ఆ పార్టీ నేతలు, కేంద్ర మంత్రులు ఇప్పుడు గొంతెత్తడం లేదు. ఈ అంశంపై ఇప్పటివరకు స్పందించలేదు. తమకు రాజకీయంగా పనికొస్తుంది అంటేనే మహిళా సమస్యలపై ప్రశ్నిస్తారా? నిజంగా మహిళలకు అన్యాయం జరుగుతుంటే అడగరా? మహిళలపైనే మహిళా మంత్రులకు ఎందుకీ వివక్ష?
మోదీకి తీరికలేదా..?
నిజానికి కేంద్రం సరిగ్గా స్పందించి ఉంటే ఇదంతా పెద్ద విషయంగా మారేది కాదు. కానీ, ప్రభుత్వం పట్టించుకోలేదు. రెజ్లర్లు తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నప్పుడు వాటిపై ప్రభుత్వం స్పందించే తీరు ఇదేనా? పోనీ వాళ్లేమైనా రాజకీయ నాయకులా? రాజకీయ ప్రయోజనాలు ఆశిస్తున్నారా? వాళ్లు ఆరోపణలు చేసింది బీజేపీపై కాదు. ఆ పార్టీ ఎంపీపై. పైగా దీనికీ.. రాజకీయానికీ ఏమాత్రం సంబంధం లేదు. ఈ విషయంలో మోదీ అండ్ కో.. సరిగ్గా స్పందించి, బ్రిష్ భూషణ్‌ను సస్పెండ్ చేసి, సరైన చర్యలకు ఆదేశించి ఉంటే సరిపోయేది. ఆ పార్టీ ఇమేజ్ కూడా పెరిగేది. ఇంత జరుగుతున్నా మోదీ మౌనంగా ఉండటం ఏమిటో? వాళ్ల గోడు వినేందుకు ఆయనకు సమయం లేదా? వాళ్లతో వ్యవహరించాల్సిన తీరు ఇదేనా? అంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.


ప్రతిపక్షాల స్పందన
రెజ్లర్లు చేస్తున్న పోరాటానికి కాంగ్రెస్, టీఎంసీ, ఆమ్ ఆద్మీ వంటి పార్టీలు మద్దతు ప్రకటించాయి. సోషల్ మీడియాలోనూ కొందరు రెజ్లర్లకు అనుకూలంగా ట్వీట్లు చేస్తున్నారు. అయితే.. రెజ్లర్లు దేశానికి పతకాలు తెచ్చినప్పుడంతా అభినందనలతో హోరెత్తిస్తూ, సోషల్ మీడియాలో తమ దేశ భక్తిని చాటుకునే సో కాల్డ్ దేశ భక్తులు కొందరు ఈ విషయంలో మాత్రం సైలైంట్‌గా ఉండిపోతున్నారు. మరోవైపు క్రీడాలోకం కూడా ఈ విషయంలో మౌనంగా ఉండిపోయింది. దేశంలో పెద్ద స్టార్లుగా చెలామణి అవుతున్న వాళ్లు రెజ్లర్ల విషయంలో కనీసం ఒక్కసారి కూడా స్పందించలేదు. రెజ్లింగ్ రింగ్‌లో విదేశీ ఆటగాళ్లను మట్టి కరిపించిన మన క్రీడాకారిణులు దేశ రాజకీయ నాయకుల చేతిలో ఓడిపోయారు. ఏదేమైనా.. మన రెజ్లర్లు ఈ స్థాయి అవమానానికి గురి కావడం కచ్చితంగా అంతర్జాతీయంగా దేశ ప్రతిష్టను దిగజార్చేదే.