G20 Summit: జీ20 సదస్సుకు జిన్‌పింగ్ దూరం.. పుతిన్ తర్వాత మరో అగ్రనేత గైర్హాజరు!

వివిధ కారణాలతో అగ్ర దేశమైన రష్యా అధినేత పుతిన్ ఈ సదస్సుకు హాజరుకాకూడదని నిర్ణయించుకున్నారు. ఇప్పుడు చైనా అధినేత జిన్‌పింగ్ కూడా ఈ సదస్సుకు హాజరు కావడం లేదు.

  • Written By:
  • Updated On - September 4, 2023 / 02:00 PM IST

G20 Summit: భారత్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్న జీ20 సదస్సుకు కళ తప్పుతోందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రపంచ అగ్రదేశాలైన చైనా, రష్యా అధినేతలు ఈ సదస్సుకు హాజరుకాకూడదని నిర్ణయించుకోవడమే దీనికి కారణం. దేశ రాజధాని ఢిల్లీలో ఈ నెల 9, 10 తేదీల్లో జీ20 సదస్సు జరుగుతుంది. దీనికి జీ20 దేశాధినేతలు హాజరవ్వాల్సి ఉంది.

అయితే, వివిధ కారణాలతో అగ్ర దేశమైన రష్యా అధినేత పుతిన్ ఈ సదస్సుకు హాజరుకాకూడదని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని గతవారమే రష్యా అధికారికంగా ప్రకటించింది కూడా. పుతిన్ స్థానంలో విదేశీ వ్యవహారాల మంత్రి హాజరవుతారు. ఇప్పుడు చైనా అధినేత జిన్‌పింగ్ కూడా ఈ సదస్సుకు హాజరు కావడం లేదు. ఈ విషయాన్ని చైనా విదేశాంగ వ్యవహారాల శాఖ అధికారికంగా వెల్లడించింది. జిన్‌పింగ్ స్థానంలో స్టేట్ కౌన్సిల్ ప్రీమియర్ లి కియాంగ్ హాజరవుతారని చైనా తెలిపింది. అయితే, ఈ నిర్ణయంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. జో బైడెన్ జీ20 సదస్సుకు హాజరవుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఆయన మోదీతో భేటీ కానున్నారు. అలాగే తాను జిన్‌పింగ్‌తో భేటీ కోసం ఎదురు చూశానని, కానీ, ఆయన హాజరుకావడం లేదని తెలిసి అసంతృప్తికి గురయ్యానని వ్యాఖ్యానించారు. ఈ ఇద్దరూ గత ఏడాది బాలిలో జరిగిన సదస్సులో కలిశారు. ఒకవైపు రష్యాధినేత, మరోవైపు చైనా అధ్యక్షుడు జీ20 సదస్సుకు డుమ్మా కొట్టడం ఈ సదస్సు నిర్వహణస్థాయిని తగ్గించే అవకాశం ఉంది. రెండింట్లో రష్యా.. ఇండియాకు మిత్ర దేశంకాగా, చైనా శతృదేశంగా ఉంది. రెండు దేశాలు ఒకేసారి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఈ వేడుకుల్ని నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఢిల్లీలో భద్రత కట్టుదిట్టం చేసింది.