Yarlagadda Venkata Rao: ఏదీ తెగేవరకు లాగొద్దు అనేది అందుకే. తెగేదాకా లాగితే ఇబ్బందులు తప్పవు. ఇలాంటి పరిస్థితే ఎదురయింది గన్నవరంలో యార్లగడ్డ వెంకట్రావుకు. వైసీపీ పార్టీ ఆఫీస్ డోర్లు క్లోజ్ అయ్యాయి ఆయనకు. ఉంటే ఉండు.. పోతే పో.. తేల్చి చెప్పేసింది పార్టీ అధిష్టానం. ఆయనను ఉండమనే వాళ్లు లేరు.. పొమ్మని పొగ పెట్టే వాళ్లు తప్ప అన్నట్లుగా వైసీపీ పెద్దల నుంచి వెంకట్రావుకు క్లియర్‌గా సూచనలు అందాయి. పార్టీలో ఉండడం, ఉండకపోవడం యార్లగడ్డ ఇష్టం అని సజ్జల కుండ బద్దలు కొట్టేశారు.
గత ఎన్నికల్లో గన్నవరం నుంచి వైసీపీ తరఫున పోటీ చేసిన యార్లగడ్డ.. వల్లభనేని వంశీ చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత పరిణామాలతో వంశీ.. వైసీపీ వైపు చేరారు. అప్పటి నుంచి వంశీకి, యార్లగడ్డకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో వైసీపీ రెండుగా చీలిపోయి.. కేడర్ పక్కదారి పడుతున్నట్లు అనిపించింది. ఇలాంటి పరిణామాల మధ్య వచ్చే ఎన్నికల్లో టికెట్ సంగతి గురించి జగన్‌ను కలిసి తేల్చుకుంటానని యార్లగడ్డ చెప్పాడు. అయితే, ఆయనకు టిక్కెట్ ఇచ్చే ఉద్దేశాలేమీ లేవని సజ్జల క్లియర్‌కట్‌గా చెప్పేశారు. అప్పటి నుంచి వైసీపీకి దూరంగా ఉన్న యార్లగడ్డ.. పార్టీని వీడేందుకు సిద్ధం అవుతున్నారు. రెండు రోజుల క్రితం కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి.. తనకు అన్యాయం జరిగిందని గుండెలు బాదుకున్నారని టాక్. ఆ తర్వాత అధిష్టానం పెద్దలు యార్లగడ్డతో టచ్‌లోకి వెళ్లి బుజ్జగించే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. దీంతో యార్లగడ్డ తీరు కనిపెట్టిన వైసీపీ పెద్దలు చర్చల్లేవు.. చర్చించుకోవడ్డాల్లేవు.. ఉండేవాళ్లు ఉంటారు, పోయేవాళ్లు పోతారు అని క్లారిటీ ఇచ్చేశారు.
దీంతో యార్లగడ్డ పార్టీ మారేందుకు సిద్ధం అవుతున్నారు. రెండు మూడు రోజుల్లో టీడీపీ తీర్థం పుచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. నియోజకవర్గ ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించి ఈ తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. టీడీపీలో చేరాలా.. స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేయాలా అనే దానిపై కార్యకర్తలు, అనుచరుల అభిప్రాయం తీసుకోనున్నారు. ఒకవేళ యార్లగడ్డ టీడీపీలోకి వెళ్తే రాజకీయ సమీకరణాలు ఎలా మారతాయన్న దానిపై ఇప్పుడు గన్నవరంలో గల్లీగల్లీలో చర్చ జరుగుతోంది. సైకిలెక్కితే.. దుట్టా సహకరిస్తారా లేదా అన్న అంశంపై కూడా.. యార్లగడ్డ అండ్ కోలో చర్చలు జరుగుతున్నాయి.