Yarlagadda Venkat Rao: ఇంతకాలం గన్నవరం వైసీపీ నేతగా ఉన్న యార్లగడ్డ వెంకట్రావ్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. త్వరలో తెలుగుదేశం పార్టీలో చేరికకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ మేరకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును కలిసేందుకు యార్లగడ్డ ప్రయత్నిస్తున్నారు. ఆయన చంద్రబాబు అపాయింట్‌మెంట్ కోరారు. గన్నవరం అభ్యర్థిగా పనికొస్తానని భావిస్తే తనకు టిక్కెట్ ఇవ్వాలని, గన్నవరం ఎమ్మెల్యేగా గెలిచొస్తానని అంటున్నారు.
శుక్రవారం యార్లగడ్డ వైసీపీకి గుడ్ బై చెప్పారు. ఆయన 2019 ఎన్నికల్లో గన్నవరం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఇక్కడి నుంచి టీడీపీ తరఫున వల్లభనేని వంశీ ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం ఆయన వైసీపీలో చేరిపోయారు. దీంతో వైసీపీలో యార్లగడ్డ, వంశీ అంటూ రెండు వర్గాలు ఏర్పడ్డాయి. అయినప్పటికీ యార్లగడ్డ ఇంతకాలం వైసీపీలోనే ఉంటూ పనిచేశారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తన రాజకీయ భవిష్యత్ గురించి తేల్చుకోవాలనుకున్నారు. తనకే గన్నవరం టిక్కెట్ ఇవ్వాలని వైసీపీ అధిష్టానాన్ని కోరేందుకు ప్రయత్నించారు. అయితే, వైసీపీ మాత్రం రాబోయే ఎన్నికల్లో వంశీకే టిక్కెట్ ఇవ్వబోతున్నట్లు స్పష్టం చేసింది. యార్లగడ్డ పార్టీలో ఉండాలో.. వద్దో.. తేల్చుకోవాల్సింది ఆయనేనని సజ్జల అన్నారు. దీంతో నొచ్చుకున్న యార్లగడ్డ వైసీపీని వీడాలని నిర్ణయించుకున్నారు. శుక్రవారం ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా తన అనుచరులతో విజయవాడలో భేటీ అయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై అనుచరులతో చర్చించారు.
అనంతరం యార్లగ్డడ మీడియాతో మాట్లాడుతూ.. తాను టీడీపీలో చేరాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. “గన్నవరం టికెట్ ఇవ్వాలని చంద్రబాబును కోరుతున్నా. గన్నవరం ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీకి వస్తా. నన్ను చంద్రబాబు నమ్మాలి. మన ఓటమే మన సమస్యలకు కారణం. గెలిస్తే అన్నీ సమస్యలు తీరుతాయి. పదవి పోయిన తర్వాత పది మంది కూడా వెంట ఉండరు. నా వెంటే ఉండి నన్ను నమ్ముకుని చాలామంది ఉన్నారు. వైసీపీలో చేరినప్పటి నుంచి అన్ని సేవలు చేశా. నాకు జరిగిన అవమానాలు మీకందరికీ తెలుసు. గన్నవరంలో వైసీపీ సీటు వచ్చినప్పటి నుంచి గెలవడమే పనిగా పెట్టుకున్నా. రాజకీయాల్లో ఉండేటప్పుడు మన బాధలు ప్రజలకు చెప్పకూడదు. ప్రజా సమస్యలు విని పరిష్కరించగలిగితేనే నాయకుడు అవుతారు. కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టి పార్టీ కోసం పనిచేశా. ఉంటే ఉండు.. లేకపోతే వెళ్లు అని అంటున్నారని తెలిసింది. నాకు ఆ విషయం చాలా ఆవేదన కలిగించింది. ఓడిపోయినప్పుడు కూడా నేను బాధపడలేదు.
పోతే పో అనే దుస్థితి వస్తుందని నేను కలలో కూడా ఊహించలేదు. ఇప్పుడు నా బలం ఎందుకు బలహీనమయిందో పార్టీ పెద్దలే చెప్పాలి. నమ్మిన మనుషులను కాపాడుకోవాల్సిన బాధ్యత ఏ పార్టీకైనా ఉంటుంది. ఈ మూడున్నరేళ్లలో చంద్రబాబు, లోకేశ్‌ను నేను కలవలేదు. ఏ టీడీపీ నేతను కూడా నేను కలవలేదు. ఇది పార్టీ ఇంటెలిజెన్స్ వైఫల్యమేనని నమ్మాల్సి వస్తోంది. టీడీపీలో చేరేందుకు చంద్రబాబు అపాయింట్‌మెంట్ కోరుతున్నా. గన్నవరం అభ్యర్థిగా పనికొస్తానని భావిస్తే టికెట్ ఇవ్వాలని కోరుతున్నా” అంటూ యార్లగడ్డ వెంకట్రావు వ్యాఖ్యానించారు. యార్లగడ్డ ప్రకటనపై చంద్రబాబు ఎలా స్పందిస్తారో చూడాలి. అక్కడ టిక్కెట్ ఆయనకే ఇస్తారా.. లేదా మరెవరికైనా ఇస్తారా అనే విషయం ఆసక్తికరంగా మారింది.