జనసేన… గత ఎన్నికల్లో జనం మెచ్చిన సేన… 100పర్సంట్ స్ట్రైక్ రేట్ అని గర్వంగా చెప్పుకుంటున్న పార్టీ… మార్పు కోసం అంటూ ఆవేశపూరితంగా జనంలోకి వచ్చిన జనసేన… జనం మెచ్చిన ఆ సిద్ధాంతానికి దూరమవుతోందా…? కొత్తసీసాలో పాత సారాను తలపిస్తోందా…? పవన్ కూడా సాధారణ రాజకీయ నాయకుడైపోయారా…? జరుగుతున్న పరిణామాలు ముఖ్యంగా చేరికలు చూస్తుంటే పవన్ కూడా తానూ ఆ ఊసరవెల్లి రాజకీయపార్టీల తాను ముక్కనే అని చెప్పుకుంటున్నట్లు కనిపిస్తోంది…!
రాజకీయ పార్టీలంటే చేరికలు సహజం… పక్క పార్టీల నుంచి, పక్క పార్టీల్లోకి జంపింగ్ లు మామూలే… కానీ జనసేన లెక్క మాత్రం వేరు… మాకు అధికారం ముఖ్యం కాదు… విలువలే ఆస్తి అంటూ జనానికి సరికొత్త ఆశను రేపిన పవన్ పార్టీలో జరుగుతున్న చేరికలు మాత్రం అభిమానుల గుండెల్లో గుచ్చుకుంటున్నాయి.
మొన్న బాలినేని వైసీపీకి రాజీనామా చేసి పవన్ తో భేటీ అయ్యారు. సామినేని ఉదయభాను పవన్ ను కలిసి వైసీపీని వీడారు. ఇక అదే బాటలో పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారు రోశయ్య నడుస్తున్నారు. మాజీ మంత్రి దాడిశెట్టి రాజా కూడా వయా చిరు ఫ్యామిలీ జనసేనలోకి ఎంట్రీ కోసం గట్టిగానే ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. వీళ్లే కాదు మరికొంతమంది వీరి బాటలో ఫ్యాను కట్టేసి గాజుగ్లాసు పట్టుకోవాలని రెడీ అవుతున్నారు. చోటామోటా నాయకులను కలుపుకుంటే ఆ లిస్టు భారీగానే ఉండనుంది. వైసీపీ నుంచి ఇంతమంది నేతలను తీసుకోవడం ద్వారా పవన్ ఏం సంకేతాలు ఇస్తున్నారన్నది కచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే. బాలినేని మినహా మిగిలిన వారంతా గత ఎన్నికల ముందు వరకు పవన్ పై ఓ రేంజ్ లో నోరు పారేసుకున్నవారే. ఒకరిద్దరు వస్తే ఓకే… కానీ వైసీపీ నుంచి ఇంతమందిని తీసుకోవడం ద్వారా జనసేన పార్టీ కూడా మిగిలిన పార్టీలకు ఏ మాత్రం తీసిపోదనే సంకేతాలు ఇస్తున్నారా జనసేనాని,,,? గెలిచినప్పుడు పదవులు అనుభవించి ఇప్పుడు తెప్ప తగలేస్తున్న ఇలాంటి ఊసరవెల్లి నేతలను పార్టీలో చేర్చుకుని పవన్ ఏం సంకేతం ఇవ్వదలుచుకున్నారో మరి…?
జనసేనలోకి క్యూ కడుతున్న నేతలెవరూ శుద్దపూసలు కాదు… ఒక్కొక్కరిపై ఆరోపణలు చాలానే ఉన్నాయి. పైగా వీరంతా జనం తిరస్కరించిన నేతలు.. వీరిలో కొందరైతే గత ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ ను వాడు వీడు అంటూ తిట్టి నోటిదూల తీర్చుకున్నారు. మూడు పెళ్లిళ్లు అంటూ పవన్ ను హేళన చేసినవారే. ఇప్పుడు వారందరికీ నేనే దిక్కయ్యానని పవన్ చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది కానీ నమ్మిన జనానికి మాత్రం మండిపోతోంది. ఇలాంటి వారందిరికీ జనసేన కండువా కప్పేస్తే వారంతా పవిత్రులైపోతారా పవన్…? రాజకీయ శుభ్రత పరిశుభ్రత అన్న మీ మాటలు కేవలం నీటిమూటలేనా…? వైసీపీ చెడ్డదైతే మరి అందులోంచి వస్తున్న వారిలో చెడ్డవారు లేరా…? పోనీ వస్తున్న అందరూ గంజాయివనంలో తులసిమొక్కలని పవన్ ఉద్దేశమా….?
ఇటీవలి ఎన్నికల్లో గెలిచిన పవన్ ఎమ్మెల్యేలు ఎంపీల్లో చాలామంది వైసీపీ నేతలే… వల్లభనేని బాలశౌరి, ఉదయ్, వంశీకృష్ణ, పంచకర్ల రమేష్ బాబు వీరంతా ఫ్యాను పార్టీ నుంచి వచ్చినవారే. మిగిలిన వారిలో కూడా చాలామంది వేరే పార్టీల నుంచి వచ్చినవారే. వీరంతా ఎన్నికలకు ముందు పార్టీలో చేరారు కాబట్టి ఏదో సర్ధిచెప్పుకోవడానికి అవకాశం దక్కింది. జనం కూడా పవన్ ను చూసో లేక వైసీపీపై కోపంతోనే వీరిని గెలిపించారు. కానీ ఇప్పుడు కొత్త రక్తాన్ని తయారు చేసుకోవాల్సిన సమయంలో పాత చింతకాయపచ్చడిని ఎందుకు తెచ్చి పెట్టుకుంటున్నారో జనసైనికులకు అర్థం కాని పరిస్థితి.
పార్టీకి బలం లేనప్పుడు పక్క పార్టీల నేతలను తీసుకోవడంలో తప్పులేదు. పట్టున్న నేతలను తీసుకుని పార్టీకి బూస్ట్ ఇవ్వాలనుకోవడం మంచిదే. కానీ జనం తిరస్కరించిన, అవినీతి ముద్రపడ్డ వారిని తీసుకుని పవన్ ఏం చేద్దామనుకుంటున్నారో మరి. రాజకీయాల్లోకి కొత్త రక్తం రావాలని పదేపదే చెప్పే పవన్…. కుళ్లిపోయిన రక్తాన్ని ఎక్కించి జనసేనను కూడా పాత పార్టీల వారసురాలేనని చెప్పదలుచుకున్నారా…?
జనసేనకు బలమైన సైన్యముంది.. వారే జనసేనానికి బలం… మొన్నటి ఎన్నికల్లో కూటమి విజయానికి కారణమైంది జనసేన నేతలు కాదు… జనసైనికులు… పవన్ మాట వారికి వేదవాక్కు. సైగచేస్తే కాల్చివచ్చే రకాలు. దేశంలో ఏ పార్టీకీ ఇంత కరడుకట్టిన కార్యకర్తలు లేరు. అలాంటప్పుడు పవన్ తన పార్టీని యువరక్తంతో నింపాలి కదా…! వారే కదా భవిష్యత్ నేతలవుతారు…! మార్పు అక్కడే మొదలవుతుంది కదా…! మరి నమ్ముకున్న పార్టీ కార్యకర్తలను కాదని పవన్ పాత కాపులను నెత్తిన ఎక్కించుకోవడం ఎందుకు..? ఇప్పట్లో ఎన్నికలు లేవు. వైసీపీ ఐదేళ్లు రెక్కలు తెగిన ఫ్యానే. ఈ సమయంలో ఆ పాతవాసనలు ఎందుకు…? ఒంగోలు, జగ్గయ్యపేట, పొన్నూరులో పవన్ కు బలమైన కార్యకర్తలు లేరా…? వారినే నేతలుగా తీర్చిదిద్దలేరా.?
1983 ఎన్నికల సమయంలో NTR యువరక్తంతో సంచలన విజయం సాధించారు. ఆ తరం ఇప్పటికీ టీడీపీకి వెన్నుదన్నుగా నిలిచింది. వారు, వారి వారసులతో పార్టీ బలమైన శక్తిగా నిలబడిపోయింది. పవన్ కూడా తన కార్యకర్తలనే బలమైన శక్తులుగా మార్చొచ్చు. పైగా ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది. ఇప్పట్నుంచి పార్టీ బలోపేతంపై దృష్టి పెడితే నేతలు వారే తయారవుతారు. మెన్ మేడ్ లీడర్స్ ఎక్కువ కాలం నిలబడరు. 151మంది వైసీపీ నేతల్లో అలాంటి వారు చాలామందే ఉన్నారు. కానీ కార్యకర్తల నుంచి వచ్చిన నేతలు నిలబడిపోతారు. రాజకీయ తుపానులను ఎదుర్కొని నిలబడతారు. అలాంటి వారిని తయారు చేసుకోవడానికి పవన్ ఎందుకు ప్రయత్నించడం లేదో సగటు జనసైనికుడికి అర్థం కావడం లేదు. మనల్ని తిట్టిన వారిని తెచ్చి మన నెత్తిన ఎందుకు పెడుతున్నారు అన్న వారి ఆవేదనకు పవన్ సమాధానం చెప్పాలి. ఇప్పుడు పార్టీ అధికారంలో ఉంది కాబట్టి మన దగ్గరకు వస్తున్న వలస నేతలు రేపు వేరే పార్టీ అధికారంలోకి వస్తే అటు వెళ్లరన్న గ్యారెంటీ ఉంటుుందా…?
పవన్ నమ్మిన సిద్ధాంతం రాజకీయాల్లో మార్పు. ఇలాంటి వారిని చేర్చుకుంటూ పోతే ఆ మార్పు వస్తుందో లేదో జనసేనాని ఆలోచించాలి. పవన్ రాజకీయ నాయకుడిగా నిలబడిపోవాలన్నా, లేక ముఖ్యమంత్రి కావాలన్న అభిమానుల కల నెరవేరాలన్నా ఆయన తన మూల సిద్ధాంతానికి కట్టుబడి ఉండాలి. దేశంలోని వేల పార్టీల్లో జనసేన కూడా ఒకటిగా ఉండిపోవాలా లేక ప్రత్యేకంగా నిలవాలా అన్నది పవన్ ఇష్టం… ఇలాంటి లీడర్లను తీసుకున్నంత మాత్రాన కార్యకర్తలు పార్టీని వదిలిపోరు. కానీ వారు తనపై పెట్టుకున్న నమ్మకం కొంత సడలిపోతుందని పవన్ గుర్తిస్తే అది ఆయనకే మంచిది.