Graduate MLC Elections: జగన్‌కు షాక్ ఇచ్చిన పట్టభద్రులు..!!

ఇదే ట్రెండ్ కొనసాగితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి ఇబ్బందులు తప్పకపోవచ్చు. అదే సమయంలో టీడీపీ బాగా పుంజుకున్నట్టు అర్థమవుతోంది. కేపిటల్ సిటీగా వైసీపీ ప్రకటించిన వైజాగ్ లాంటి చోట కూడా భారీ మెజారిటీ సాధించడం టీడీపీకి పెద్ద ఊరటనిచ్చే అంశం.

  • Written By:
  • Publish Date - March 17, 2023 / 06:00 PM IST

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 175కు 175 సీట్లూ గెలవాలని వైసీపీ సీరియస్ గా ట్రై చేస్తోంది. ఆ పార్టీ అధినేత జగన్ కూడా ఇదే విషయాన్ని పార్టీ శ్రేణులకు పదే పదే చెప్తున్నారు. వైసీపీ నేతలు కూడా జగన్ పెట్టిన టార్గెట్ రీచ్ అయ్యేందుకు ఎంతో కష్టపడుతున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించడం ద్వారా వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు పునాది వేసుకోవాలని వైసీపీ భావించింది. అయితే వైసీపీ ఆశించినట్లుగా లేవు ఫలితాలు.

స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ తిరుగులేని విజయం సాధించింది. అన్ని స్థానాలను క్లీన్ స్వీప్ చేసింది. అలాగే టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా వైసీపీ మద్దతు ఇచ్చిన అభ్యర్థులే విజయం సాధించారు. కానీ పట్టభద్రులు మాత్రం వైసీపీకి గట్టిగా బుద్ధి చెప్పారు. స్థానిక సంస్థలను వైసీపీ గతంలో క్లీన్ స్వీప్ చేయడంతో ఆ స్థానాలు గెలవడం పెద్ద కష్టం కాదు. అలాగే టీచర్ల యూనియన్లు కూడా అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయి కాబట్టి ఆ స్థానాల్లో విజయం సాధించడంలో కూడా గొప్ప లేదు. అయితే పట్టభద్రుల స్థానాల్లో గెలిచినప్పుడే ప్రజాభిప్రాయం వెల్లడవుతుంది. ఇక్కడ వైసీపీ పూర్తిగా ఫెయిల్ అయినట్లు నిర్ధారణ అయింది.

ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఘన విజయం దిశగా దూసుకెళ్తున్నారు. పైగా వైసీపీ అభ్యర్థితో పోల్చితే దాదాపు 16 శాతం ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. 27వేలకు పైగా మెజారిటీతో దూసుకెళ్తున్నారు. దీంతో అక్కడ టీడీపీని ఓడించడం ఆషామాషీ కాదు. అలాగే.. తూర్పు రాయలసీమ గ్రాడ్యుయేట్స్ ఎన్నికలో కూడా మొదటి రౌండు నుంచి టీడీపీ అభ్యర్థి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక్కడ కూడా 20వేలకు పైగా మెజారిటీ కొనసాగుతోంది. దీంతో ఈ స్థానం పైన కూడా వైసీపీ ఆశలు వదిలేసుకుంది. ఇక పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎన్నికలో మాత్రం వైసీపీ కొంచెం లీడ్ లో ఉంది. అది కూడా 2వేలకు లోపే. రెండో ప్రాధాన్యత ఓట్లతో ఈ స్థానాన్ని కూడా కొట్టేస్తామని ధీమాగా ఉంది టీడీపీ.

ఇలా మూడు పట్టభద్రుల స్థానాల్లో వైసీపీని ప్రజలు తిరస్కరించారు. ఇప్పుడు జరిగిన అన్ని ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎక్కువ మంది ఓటర్లు పాల్గొంది ఈ పట్టభద్రుల స్థానాల్లోనే. కాబట్టి దీన్నే ప్రజాభిప్రాయంగా పరిగణించాల్సి ఉంటుంది. ఇదే ట్రెండ్ కొనసాగితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి ఇబ్బందులు తప్పకపోవచ్చు. అదే సమయంలో టీడీపీ బాగా పుంజుకున్నట్టు అర్థమవుతోంది. కేపిటల్ సిటీగా వైసీపీ ప్రకటించిన వైజాగ్ లాంటి చోట కూడా భారీ మెజారిటీ సాధించడం టీడీపీకి పెద్ద ఊరటనిచ్చే అంశం.