Chandrababu : వైసీపీపై చంద్రబాబు మాటల యుద్ధం.. ఇది ఫ్రస్ట్రేషనా.. కాన్ఫిడెన్సా ?

రోజురోజుకు మరింత ఆసక్తికరంగా మారుతున్నాయ్ ఏపీ రాజకీయాలు. పొత్తులు, పొలిటికల్ ఎత్తులు.. ప్రతీ సీన్ క్లైమాక్స్‌లా అనిపిస్తోంది ఏపీలో ! ఎమ్మెల్సీ ఫలితాలతో.. రాజకీయం మరింత ఆసక్తికరంగా మారింది. 2024లో జరగబోయే ఎన్నికలు మాములువి కాదు.. పార్టీల ఫేట్‌ను, ఫ్యూచర్‌ను డిసైడ్‌ చేసే ఎన్నికలు ! రాజకీయానికి మించి ప్రతీకారాలు కనిపిస్తున్నాయ్ ఇప్పుడు ఏపీలో. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ నెగ్గి తీరాలని అటు వైసీపీ, ఇటు టీడీపీ వ్యూహాలు రచిస్తున్నాయ్. ఇప్పటి నుంచే జనాల్లో ఉంటున్నాయ్.

  • Written By:
  • Updated On - April 15, 2023 / 03:34 PM IST

ఎన్నికలకు మరో ఏడాదికి పైగా సమయం ఉన్నా.. అదేదో ఎన్నికల షెడ్యూల్ వచ్చేసినట్లు.. ఎలక్షన్ ప్రచారం సాగిస్తున్నట్లు బిహేవ్‌ చేస్తున్నాయ్ అన్ని పార్టీలు. వైసీపీ సంగతి ఎలా ఉన్నా.. టీడీపీ మాత్రం మరింత దూకుడు మీద కనిపిస్తోంది. ఓ వైపు యువగళం అంటూ లోకేశ్ పాదయాత్ర చేస్తుంటే.. మరోవైపు ఇదేం ఖర్మ రాష్ట్రానికి అంటూ చంద్రబాబు నియోజకవర్గాల పర్యటన చేస్తున్నారు. ఐతే ఇప్పటివరకు చూసిన చంద్రబాబు వేరు.. ఇప్పుడు చూస్తున్న చంద్రబాబు వేరు అన్నట్లుగా కనిపిస్తున్నారు ఆయన ! మాటల్లో వేడి.. నిర్ణయాల్లో వేడి.. కొత్త చంద్రబాబును రాజకీయానికి పరిచయం చేస్తున్నాయ్. ప్రత్యర్థి పార్టీ నేతలపై మరింతలా మాటల దూకుడు పెంచుతున్నారు చంద్రబాబు. అధికారుల నుంచి ఎమ్మెల్యేల వరకు.. అందరికీ వార్నింగ్ ఇస్తున్నారు.. గుర్తుంచుకోండి మళ్లీ అధికారంలోకి వస్తాం.. అందరి లెక్కలు తేల్చుతామని ప్రతీసారి అంటున్నారు.

నూజివీడులో అయితే.. ఓ డీఎస్పీకి డైరెక్ట్‌గా వార్నింగ్ ఇచ్చారు చంద్రబాబు. ఇక వైసీపీ ఎమ్మెల్యేలు, నాయకులపై ఫైర్‌ అయ్యే రేంజ్‌ను అమాంతం పెంచేశారు. అధికార పార్టీని భూస్థాపితం చేసే వరకు తగ్గేదే లేదని పదేపదే చెప్తున్నారు. నిజానికి కార్యక్రమం పేరు ఇదేం ఖర్మ రాష్ట్రానికి అయినా.. ఆయన పెడుతున్న సభలు.. అదేదే ఎన్నికల మీటింగ్‌లా అనిపిస్తున్నాయనే చర్చ జరుగుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత చంద్రబాబులో మరింత దూకుడు కనిపిస్తోంది. దీంతో ఇది కాన్ఫిడెన్సా.. ఫ్ర్రస్ట్రేషనా అనే చర్చజరుగుతోంది. 2024 ఎన్నికలు టీడీపీకి, చంద్రబాబుకు చాలా కీలకం. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రాకపోతే.. టీడీపీ అడ్రస్‌ కూడా గల్లంతు అయ్యే ప్రమాదం ఉంటుంది. ఆ స్థాయిలో వైసీపీ, జగన్‌ ప్లాన్ చేస్తున్నారు మరి !

2024లో అధికారంలోకి రాకపోతే.. 2029 ఎన్నికల్లో పోటీ పడాలి. అప్పటికీ చంద్రబాబు వయసు సహకరించదు. దీంతో వచ్చే ఎన్నికలు టీడీపీ అధినేతకు చాలాకీలకం. ఇవన్నీ వదిలేస్తే.. అసెంబ్లీ వేదికగా చంద్రబాబుకు జరిగిన అవమానం అంతా ఇంతా కాదు. మళ్లీ ముఖ్యమంత్రిగానే సభలో అడుగు పెడతానని చంద్రబాబు సవాల్‌ చేశారు. ఆ శపథం నెరవేరాలంటే.. కచ్చితంగా గెలిచి తీరాలి. అందుకే చంద్రబాబు దూకుడు పెంచారు. అదే సమయంలో తన టార్గెట్ ఏంటో.. తాను టార్గెట్ చేయబోయేది ఎవరినో చెప్పకనే చెప్తున్నారు. కొడాలి నానిని చరిత్ర హీనుడిగా నిలబెడదాం అని పిలుపునిచ్చింది కూడా అందుకే !

తన మాటకు మరింత ఘాటు యాడ్ చేసి.. దూకుడుగా విమర్శలు చేస్తున్నారు. ఇక అదే సమయంలో ఏపీపై తెలంగాణ మంత్రుల కామెంట్లను ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ.. ఈ దౌర్భాగ్యం మనకు అవసరమా అన్నట్లు కొత్త చర్చకు తెరతీస్తూ.. వైసీపీని కార్నర్‌ చేస్తున్నారు. ఏమైనా మీరు మారిపోయారు సార్‌ అంటున్నారు చంద్రబాబును చూసి ప్రతీ ఒక్కరు. ఇది ఫ్రస్ట్రేషనా.. పట్టుదలా.. కాన్ఫిడెన్సా అన్న సంగతి ఎలా ఉన్నా.. వచ్చే ఎన్నికలు మాత్రం అంచనాలకు మించి ఆసక్తికరంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది.