ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు ఇంకో ఏడాది మాత్రమే టైముంది. మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు జగన్ ఇప్పటినుంచే ప్రిపేర్ అవుతున్నారు. 2018కి, ఇప్పటికి చాలా మార్పు వచ్చింది. అప్పుడు జగన్ అందరివాడు. కానీ ఇప్పుడు కొందరివాడు. అప్పుడు ప్రాంతాలు, కులాలతో సంబంధం లేకుండా జగన్ ను అందరూ ఆదరించారు. అందుకే 175కు 151 సీట్లు కట్టబెట్టారు. అప్పుడు డిస్టింక్షన్ లో పాసయ్యారు జగన్. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. ఇప్పుడు అన్ని మార్కులు రావడం కష్టమే.
అందుకే ఈసారి జగన్ స్ట్రాటజీ వేరేగా ఉంది. గతంలో లాగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాలు, కులాలను సంతృప్తి పరచడం అసాధ్యమని జగన్ కు అర్థమైపోయింది. అప్పటిలాగా ఇప్పుడు అందరూ తమ వెంటే నడుస్తారనే నమ్మకం కూడా ఇప్పుడు లేదు. అందుకే ఒక నిర్దిష్ట ప్రణాళికతో ముందుకెళ్లాలనుకుంటున్నారు. అందరినీ కాకుండా తన అనుకున్న వాళ్లనే నమ్ముకునేందుకు ట్రై చేస్తున్నారు.
జగన్ ప్రభుత్వంపై కొన్ని వర్గాల్లో తీవ్ర అసంతృప్తి ఉన్న మాట వాస్తవం. ముఖ్యంగా ఉద్యోగులు, పట్టభద్రుల్లో వ్యతిరేకత కనిపిస్తోంది. తాజా ఎమ్మెల్సీ ఎన్నికలే ఇందుకు పెద్ద ఉదాహరణ. ఇప్పటికిప్పుడు వాళ్లను సంతృప్తి పరచడం కూడా కష్టమే. ఎందుకంటే రాష్ట్ర బడ్జెట్ సహకరించదు. కాబట్టి వాళ్లను వదులుకోవడమే బెటర్ అనుకుంటున్నారు జగన్. మధ్యతరగతి, ఆపై చదువుకున్న ఉన్నత విద్యావంతులు, ధనికులు, పట్టణ ప్రాంతాల వాళ్లు ఈసారి తనవైపు నిలబడరనే క్లారిటీ జగన్ కు వచ్చేసింది. అందుకే వాళ్లను వదిలేసి మిగిలిన పేద, బడుగు, బలహీన, ముస్లిం, క్రిస్టియన్ మైనారిటీ వర్గాలను మాత్రమే నమ్ముకుకున్నారు. అంటే ఈసారి వందలో 40 మార్కులకు వదిలేసి కేవలం 60 మార్కులకు మాత్రమే పరీక్ష రాయబోతున్నారు. అందులో 55 మార్కులు సాధించాలనేది జగన్ టార్గెట్. అంటే 175లో 100 సీట్లు సాధించాలనుకుంటున్నారు. మరి జగన్ 60 మార్క్స్ స్ట్రాటజీ వర్కవుట్ అవుతుందా..?