జనంతో ఉండాలి.. జనంలో ఉండాలి.. జనంలా ఉండాలి. ఇదీ నాయకుడు అంటే ! జనాలకు దూరం అయిన ఓ నాయకుడిని చరిత్ర గొప్పగా చూపించింది లేదు. జగన్, కేసీఆర్ ఇప్పుడు తెలుసుకోవాల్సింది అదే ! ఎన్నికలల్లో గెలిపించారు కదా.. పాలిస్తాం, తలా ఒక పాలు ఇస్తాం.. మమ్మల్నెవరు ఏమీ చేయలేరు అనుకుంటే.. అంతకుమించిన అమాయకత్వం లేదు. జనం అన్నీ గమనిస్తున్నారు జాగ్రత్త ! ప్రపంచం పరుగులు పెడుతోంది. పరిపాలనకు అర్థం మారుతోంది. ఇలాంటి సమయంలో కేసీఆర్, జగన్ తీరు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీస్తోంది.
ఫ్యూడల్ ప్రభువుల్లా వ్యవహరిస్తున్నారు ఇద్దరు. గెలిపించడం వరకే జనం వంతు.. ఆ తర్వాత ఐదేళ్లు ఇదే మా తంతు అన్నట్లుగా కనిపిస్తున్నారు ఇద్దరు సీఎంలు. ఎన్నికల సమయంలో అదీ.. సభలు, సమావేశాల రూపంలో మాత్రమే జనాల్లో కనిపిస్తారు. ఆ తర్వాత జనంతో సంబంధం లేదు అన్నట్లు ఉంటారు. నాలుగేళ్ల జగన్ పాలన అయినా.. తొమ్మిదేళ్ల కేసీఆర్ పాలన అయినా.. అర్థం అవుతోంది ఇదే ! 2019 ఎన్నికల్లో అద్భుతమైన మెజారిటీతో ఏపీలో జగన్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సీఎంగా ప్రమాణస్వీకారం చేసినప్పుడు కనిపించారు జనంలో.. ఆ తర్వాత పత్తాకు కూడా లేరు జగన్. జనాల సంగతి తర్వాత.. కనీసం మీడియా ముందుకు రావడం లేదు.
ప్రతీసారి ఎమ్మెల్యేలను, ప్రజాప్రతినిధులను తాడేపల్లికి పిలిపించుకోవడం.. సలహాలు, సూచనలు చేయడం.. అవసరం అయితే వార్నింగ్ ఇవ్వడం.. జగన్‌కు తెలిసింది ఇదే ! క్యాంప్ ఆఫీస్‌లో ఉండి.. బటన్ నొక్కి.. సంక్షేమ పథకాలు ప్రారంభించి.. ఆ ఫీడ్ ఎడిట్ చేసి మీడియాకు ఇవ్వడం తప్పితే.. ప్రత్యక్షంగా జనాలతో అయింది లేదు. నాలుగేళ్లలో ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా మీడియాను ఫేస్ చేసింది లేదు జగన్.
ఇక కేసీఆర్ అయితే.. ఒక ఆకు ఎక్కువే చదివారు. మీడియాతో అప్పుడప్పుడు కలిసి మాట్లాడతారు. అదీ రాజకీయ విషయాల్లో మాత్రమే. అలాంటి మీటింగ్‌ల్లోనూ.. మీడియావాళ్లను మాట్లాడనివ్వరు. పొరపాటున జనాల సమస్య ఎవరైనా ఎత్తితే.. నీకేం తెలుసు.. నువ్వేం జర్నలిస్టువు అంటూ వెక్కిరిస్తుంటారు ఒకరకంగా చెప్పాలంటే ! ఇంకా చెప్పాలంటే.. అలా వచ్చి, తనకు నచ్చింది ఇలా చెప్పి వెళ్తారంతే ! ఇవన్నీ వదిలేస్తే పేపర్ లీకేజీ వ్యవహారం తెలంగాణ రాజకీయాలను షేక్ చేసింది. నిరుద్యోగులు, విద్యార్థులు మరో ఉద్యమం అంటూ మొదలుపెట్టారు. ఉస్మానియా అయితే ఉడికిపోయింది. ఇంత జరిగినా.. ఈ వ్యవహారంలో కేసీఆర్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇలా ఇటు కేసీఆర్, అటు జగన్.. ఫ్యూడల్ ప్రభువుల్లా మారిపోయారు.
మీరు అడిగింది మేము చెప్పం.. మేము చెప్పిందే మీరు రాసుకోవాలి, పంచుకోవాలి అన్నట్లుగా ఉంది ఇద్దరి తీరు. వీళ్లకు చెప్పడం మాత్రమే ఇష్టం.. వినే ఓపిక ఉండదు. విని ఆ విషయాన్నీ తీసుకునే మనసు ఉండదు. ఇంతా చేసి.. జనాల సమస్యలు అన్నీ తెలుసు అని కలరింగ్ ఇస్తారు చూడండి.. ఇది ఇంకా హైలైట్ అని విమర్శలు గుప్పిస్తున్నారు చాలామంది. జగన్, కేసీఆర్‌ను చూస్తే ఇప్పుడు కలిగే అనుమానం ఒక్కటే. గెలిపించిన జనాలు.. వీళ్లకు కనీసం కనిపించరా అనే అనుమానం రాకుండా ఉండదు. ఇలా చేస్తే రాజకీయ నేతలు అవుతారేమో.. నిజమైన నాయకులు కాలేరు. లీడర్‌కు, పొలిటిషియన్‌కు చాలా తేడా ఉంటుంది. జగన్, కేసీఆర్ పక్కా పొలిటీషియన్లు.. వైఎస్, చంద్రబాబు లీడర్లు.. ఇదే ఇప్పుడు చాలామంది జనం మాట్లాడుకుంటున్న మాటలు.
సీఎంగా ఉన్నప్పుడు వైఎస్ఆర్ అయినా.. చంద్రబాబు అయినా.. జనాలకు అందుబాటులో ఉండేవారు. విమర్శ అయినా ఈజీగా తీసుకునేవారు. సమస్యకు పరిష్కారం చూపించేవారు. జనాల్లో తిరిగేవారు.. కుదరకపోతే మీడియా ద్వారా జనాలకు అండగా నిలిచేవారు. అదీ నిజమైన ప్రజానాయకుడి లక్షణం అంటే ! సంక్షేమ పథకాలు, ఉచిత పథకాలతో.. గొప్ప నాయకుడు అని కేసీఆర్, జగన్ మురిసిపోవచ్చు కానీ.. జనాలకు దూరంగా ఉన్న రాజకీయ నేత ఎవరికైనా.. ఆ ఫలితం వెంటనే కనిపించింది. చరిత్ర పేజీలు తిరగేస్తే తెలిసేది అదే.. ఇప్పుడు జగన్, కేసీఆర్ తెలుసుకోవాల్సింది అదే.