YS Jagan: సర్వేల మాయలో జగన్.. అసెంబ్లీ ఎన్నికల్లో మునిగిపోబోతున్నారా..?

ఎవరు ఎన్ని అనుకున్నా ఏం చేసినా.. ఎన్ని విమర్శలున్న వైసీపీకి వచ్చే ఎన్నికల్లో 130 సీట్లు పక్కాగా వస్తాయని ఐ ప్యాక్ చెప్తుందట. దీన్ని ముఖ్యమంత్రి కూడా బలంగా నమ్ముతున్నారట. తన సన్నిహితులతో కూడా ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి బలంగా చెబుతున్నారు.

  • Written By:
  • Publish Date - September 19, 2023 / 08:01 PM IST

YS Jagan: ఐ ప్యాక్‌సహా మరికొన్ని సర్వే సంస్థలు వైసీపీకి 110 నుంచి 130 సీట్లు వస్తాయని ఘంటాపథంగా చెబుతున్నాయి. ముఖ్యంగా ఐ ప్యాక్ సంస్థ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో నిత్యం టచ్‌లోనే ఉంటుంది. ఏపీలో ప్రతి నియోజకవర్గానికి సంబంధించి ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తూనే ఉంది. ఎవరు ఎన్ని అనుకున్నా ఏం చేసినా.. ఎన్ని విమర్శలున్న వైసీపీకి వచ్చే ఎన్నికల్లో 130 సీట్లు పక్కాగా వస్తాయని ఐ ప్యాక్ చెప్తుందట. దీన్ని ముఖ్యమంత్రి కూడా బలంగా నమ్ముతున్నారట. తన సన్నిహితులతో కూడా ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి బలంగా చెబుతున్నారు. తాను నొక్కిన బటన్‌లే రాబోయే ఎన్నికల్లో తనకు ఓట్లు రాలుస్తాయని, పథకాలు తీసుకున్న వాళ్ళు ఎవరూ మరోవైపు చూడరని, కచ్చితంగా లాభం పొందిన ప్రతి ఒక్కరూ వైసీపీకే ఓటు వేస్తారని జగన్ బలంగా నమ్ముతున్నారు.

ఆయన నమ్ముతున్నారు అనడం కన్నా ఐపాక్ సంస్థ బలంగా నమ్మిస్తోంది. కానీ పార్టీలో మాత్రం భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఐ ప్యాక్ ప్రతినిధులు నిజాయితీగా గ్రౌండ్ నుంచి సమాచారాన్ని సేకరించడం లేదని, గ్రౌండ్లో పరిస్థితి చూస్తే గెలుపుపై అంత ధీమా రాకపోవచ్చని వైసిపి వర్గాలు చెబుతున్నాయి. రాయలసీమలో వైసీపీ అప్పటికంటే ఇంకా చాలా బలంగా ఉందని 2019లో వచ్చిన సీట్లు మళ్లీ రిపీట్ అవుతాయని, 52 స్థానాల్లో కచ్చితంగా 45 చోట్ల వైసీపీ గెలిచి తీరుతుందని ఆ పార్టీ చేయిస్తున్న సొంత సర్వేలు చెబుతున్నాయి. కానీ ఫీల్డ్‌లో పరిస్థితి భిన్నంగా ఉందని వైసీపీ ఎమ్మెల్యేలే గుసగుసలాడుకుంటున్నారు. కడప మినహాయిస్తే మిగిలిన మూడు జిల్లాల్లో పరిస్థితి అంత బాగా లేదన్నది పార్టీలోనే వినిపిస్తోంది. ఇక ఉత్తరాంధ్ర విషయానికి వస్తే 2019తో పోలిస్తే కనీసం సగం సీట్లు ఎగిరిపోతాయి అనేది జనంలో ఉన్న మాట.

నెల్లూరు అంతర్గత కుమ్ములాటలో సగం సీట్లు పోగొట్టుకోవచ్చు. ఇక ప్రకాశంలో పరిస్థితి సగం.. సగం అన్నట్లు ఉంది. గుంటూరు నుంచి తూర్పుగోదావరి వరకు, ఆ తర్వాత ఉత్తరాంధ్ర అంతా పవన్ కళ్యాణ్ ప్రభావం కచ్చితంగా ఉంటుంది. ప్రతి నియోజకవర్గంలోనూ జనసేన కనీసం పదివేల ఓట్లు ప్రభావం చూపించగలుగుతుంది. జనసేన ఓట్లే రాబోయే ఎన్నికల్లో విజేతను నిర్ణయిస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో సర్వేలు చేసే వాళ్ళు వాస్తవాలు మరకలు పెట్టి సీఎంకి సమాచారం ఇచ్చేస్తున్నారని పార్టీలో సీనియర్ నేతలే నెత్తినూరు కొట్టుకుంటున్నారు. 2019లో చంద్రబాబు కూడా ఇలాగే సొంత సర్వేలు చేయించుకుని, ఇంటెలిజెన్స్ రిపోర్ట్‌లపై ఆధారపడి దెబ్బ తినేశారు. ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి కూడా ఆనాటి చంద్రబాబు దారిలోనే వెళ్తున్నారు.
చంద్రబాబు అరెస్టు తర్వాత ఏపీలో సమీకరణాలు చాలా మారాయి. తటస్థ ఓటర్.. తాను ఎటు ఉండాలో నిర్ణయించుకుంటున్నాడు. ఆ తరహా ఓటర్లు నేరుగా వచ్చి పోలింగ్ బూత్‌లో తమ నిర్ణయం ఏమిటో తేల్చి పడేస్తారు. సర్వే సంస్థలు సీఎంకు, పోలీస్ ఇంటెలిజెన్స్‌కు పక్కాగా రిపోర్ట్ ఇచ్చిన చరిత్ర లేదు. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి ఎప్పుడూ వ్యతిరేకంగా ఇవ్వలేవు. కానీ ఇప్పుడు జగన్ సొంత ఇంటిలిజెన్స్ వాలిచ్చే రిపోర్ట్‌ని, ఐ ప్యాక్ సర్వేల్ని గుడ్డిగా నమ్ముతున్నారు. లేకపోతే ఇంత ప్రభుత్వ వ్యతిరేకత ఉన్న సమయంలో ఏకంగా 130 సీట్లు వచ్చేస్తాయని వైసీపీకి అంత కాన్ఫిడెన్స్ ఏమిటో..? ఆ పార్టీ నేతల్లో లేకపోయినా ముఖ్యమంత్రి మాత్రం చాలా బలంగా నమ్ముతున్నారు. బహుశా ఈ గుడ్డి నమ్మకమే వైసీపీని 2024లో ఊహించని దెబ్బ తీయవచ్చు.