Vijaya Sai Reddy: విజయసాయి లేని లోటు జగన్‌కు తెలిసొచ్చిందా.. మళ్లీ పార్టీలో కీలక బాధ్యతలు అప్పగిస్తారా?

వైసీపీ ప్రతీ అడుగులు, ప్రతీ విజయంలో విజయసాయి కీలక పాత్ర పోషించారు అనడంలో ఎలాంటి అనుమానం లేదు.. ఉండకూడదు కూడా ! పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్‌ కాకపోయినా.. రాజకీయ అనుభవం లేకపోయినా.. రాజకీయం తెలియకపోయినా.. వైసీపీని సక్సెస్‌ఫుల్‌ పార్టీగా నిలబెట్టడంలో విజయసాయిది కీలక పాత్ర. 2019 ఎన్నికల్లో వైసీపీ విజయంలో సోషల్‌ మీడియా ప్రముఖ పాత్ర పోషిస్తే.. దాన్ని నడిపించడంలో విజయసాయికి వందకు 150 మార్కులు పడ్డాయ్.

  • Written By:
  • Publish Date - May 9, 2023 / 04:50 PM IST

ఉత్తరాంధ్రలో పార్టీని బలోపేతం చేయడంలో విజయసాయి కష్టాన్ని ప్రతీ ఒక్కరు మెచ్చుకోవాల్సిందే. ఇక పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకు అదే ఇంపార్టెన్స్‌ కనిపించింది కొద్దిరోజులు ! ప్రతీ నిర్ణయంలో విజయసాయి సలహాలు తీసుకుంటూ కనిపించేవారు జగన్‌. కట్ చేస్తే ఏం జరిగందో ఏమో కానీ.. విజయసాయిని జగన్ దూరం పెట్టడం మొదలుపెట్టారు. అన్ని పదవులకు దూరం ఉంటారు. ఉత్తరాంధ్ర జిల్లాల వైసీపీ ఇంచార్జిగా తప్పించారు. వైసీపీ అనుబంధ సంఘాల ఇంచార్జిగా నియమించి ఆ తర్వాత పక్కనపెట్టారు. దీంతో విజయసాయి హర్ట్ అయ్యారు. వైసీపీకి, విజయవాడకు దూరంగా ఉంటున్నారు. ఢిల్లీ, హైదరాబాద్‌కే ఎక్కువ పరిమితం అవుతున్నారు. దీంతో జగన్‌, విజయసాయి మధ్య దూరం పెరిగింది అనే అనుమానం కాస్త.. మరింత బలంగా మారింది. నిజం అనిపించింది కూడా చాలాసార్లు !

మరో ఏడాదిలో ఏపీలో ఎన్నికలు జరగబోతున్నాయ్. వైసీపీని వరుస వివాదాలు వెంటాడుతున్నాయ్. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి ఓవైపు.. వివేకా కేసు మరోవైపు.. జనాల్లో పెరుగుతున్న వ్యతిరేకత మరోవైపు.. ఇలాంటి పరిణామాల మధ్య విజయసాయి పక్కన లేని లోటు జగన్‌కు పక్కాగా తెలిసొచ్చిందా అంటే.. అవును అనే సమాధానమే వినిపిస్తోంది. నువ్ నా పక్కన ఉండే.. నన్ను కొట్టేవాడు ఇంకా పుట్టలేదు అని బాహుబలిలో ఓ డైలాగ్. ప్రస్తుతం జగన్ పరిస్థితి ఇలానే తయారైంది. పెద్దమనిషి పక్కనలేడు. దీంతో వరుస వివాదాలు, వైఫల్యాలు పార్టీని వెంటాడుతున్నాయని వైసీపీలోనే చర్చ జరుగుతోంది. సజ్జల ఎప్పుడూ పక్కనే ఉన్నా.. ఆయనతో లాభం కంటే నష్టాలే ఎక్కువ కనిపిస్తున్నాయ్. వివాదాస్పద వ్యాఖ్యలతో పార్టీని ఇబ్బందుల్లో పెట్టడం.. పక్క రాష్ట్రంతో పంచాయితీలతో పరువు తీసుకోవడంలాంటి పరిణామాలతో.. ప్రయోజనం కంటే పార్టీకి డ్యామేజీనే ఎక్కువ జరుగుతుందని జగన్‌ను గుర్తించారని.. అందుకే మళ్లీ విజయసాయిని దగ్గర చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నారనే టాక్ నడుస్తోంది.

నిజానికి విజయసాయి మహామేధావి. పార్లమెంట్‌లో వాదనలు కానీ.. కేంద్ర ప్రభుత్వంతో లాబీయింగ్‌లో కానీ.. విజయసాయి తర్వాతే ఎవరైనా ! ఆయన నిజంగా అండగా ఉంటే.. వివేకా కేసులో లాబీయింగ్‌ కోసం ఎవరో స్వామీజీకి స్పెషల్ ఫ్లైట్ వేయాల్సిన అవసరం జగన్‌కు కనీసం వచ్చి ఉండేది కాదనే చర్చ పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. విజయసాయిని ఉత్తరాంధ్ర జిల్లా ఇంచార్జిగా తప్పించి.. వైవీ సుబ్బారెడ్డికి బాధ్యతలు అప్పగించారు. ఐతే ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి ఘోర పరాభవం ఎదురైంది అక్కడే ! ఇలా ప్రతీ అంశాన్ని గమనించి, విశ్లేషించి.. విజయసాయికి మళ్లీ కీలక పగ్గాలు అప్పజెప్పడమే బెటర్ అని జగన్ ఓ నిర్ణయానికి వచ్చినట్లు రాజకీయవర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.

ఒక్కటి మాత్రం నిజం.. నాయకుడనే వాడు ఎప్పుడైనా తనవాళ్లు అనుకునే కోటరీని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఒకరకంగా ఆయనను రక్షించే సైన్యం వాళ్లే ! అలాంటి వారిని దూరం పెడితే.. ఆ చిన్న తప్పే ప్రత్యర్థికి ఆయుధం అవుతుంది. రాజ్యాన్ని కూల్చేవరకు వెళ్తుంది. ఈ విషయం తెలుసుకున్న జగన్.. ఇప్పుడు విజయసాయి విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారని.. త్వరలోనే కీలక నిర్ణయం ఆయన నుంచి రాబోతోందనే టాక్‌ ఏపీ పొలిటికల్స్ సర్కిల్స్‌లో హీట్‌ పుట్టిస్తోంది.