2019 ఎన్నికలకు ముందు నవరత్నాలు అమలు చేస్తామని మాటిచ్చారు వైసీపీ అధినేత వై.ఎస్.జగన్. అధికారంలోకి రాగానే తాము హామీ ఇచ్చిన నవరత్నాలను అమలు చేసేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు ఆయన పాలన చివరి ఏడాదిలో ఉంది. తాము మాటిచ్చిన హామీల్లో 98 శాతం అమలు చేశామని వైసీపీ చెప్పుకుంటోంది. మాటిస్తే తప్పే వంశం కాదని.. మడమ తిప్పే ప్రసక్తే లేదని చెప్పుకుంటూ ఉంటారు. అయితే నవరత్నాలలో భాగంగా జగన్ హామీ ఇచ్చిన సంపూర్ణ మద్యపాన నిషేధం మాత్రం ఇప్పటికీ అమలు కావట్లేదు. ఇదిప్పుడు జగన్ మెడకు చుట్టుకోబోతోంది.
జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని హామీ ఇచ్చిన వాటిలో సంపూర్ణ మద్యపాన నిషేధం ఒకటి. గతంలో ఎన్టీఆర్, చంద్రబాబు ఈ హామీలు ఇచ్చి అమలు చేయలేకపోయారు. మద్యపానం లేకుంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరింత దిగజారిపోవడం ఖాయం. ఇప్పుడున్న పరిస్థితుల్లో మద్యపాన నిషేధం అమలు చేయడమంటే రాష్ట్రాన్ని దివాళా తీయించినట్లే. అయినా సరే జగన్ ఈ హామీ ఇచ్చారు. దశలవారీగా మద్యం దుకాణాలను తగ్గించుకుంటూ వస్తామని 2024 నాటికి పూర్తిగా మద్యం దుకాణాలు లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు. అయితే ఇప్పటివరకూ అది జరగలేదు.
జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం దుకాణాలను కొంతమేర తగ్గించే ప్రయత్నం చేశారు. రివర్స్ టెండరింగ్ పేరుతో టీడీపీ హయాంలో దక్కించుకున్న వారి నుంచి దుకాణాలన్నింటినీ స్వాధీనం చేసుకున్నారు. వాటిని ప్రభుత్వం ఆధ్వర్యంలోనే నిర్వహిస్తున్నారు. ఇలా చేయడం వల్ల జనాన్ని మద్యానికి బానిస కాకుండా చేయొచ్చని చెప్పుకొచ్చారు. అయితే అది సత్ఫలితాలు ఇవ్వకపోగా మరిన్ని విమర్శలకు తావిచ్చింది. విక్రయాలకు జవాబుదారీతనం లేదని.. మద్యం ద్వారా వచ్చిన సొమ్మంతా వైసీపీ దోచుకుంటోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగలేదు. అందుకే మద్యపాన నిషేధంపై జగన్ సర్కార్ పెద్దగా ఆసక్తి చూపట్లేదు. పైగా మద్యం ధరలను భారీగా పెంచేసింది. మిగిలిన ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇక్కడ మద్యం ధరలు భగ్గుమంటున్నాయి. అందుకే ఇక్కడ ఏడాదికి 20వేల కోట్లకు పైగా ఆదాయం వస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది చాలా అవసరం. అందుకే మద్యపాన నిషేధాన్ని అమలు చేసే సాహసం జగన్ చేయలేకపోతున్నారు. అయితే ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్నాయి. ప్రతిపక్షాలు ఇప్పటికే ఈ హామీని లేవనెత్తుతున్నాయి. దీనికి జగన్ జవాబు చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది.