YS JAGAN: అర్జునుడు కాదు.. అభిమన్యుడే.. చక్రబంధంలో జగన్.. ఇంటాబయట శత్రువులే

74 ఏళ్ల వయసులో చంద్రబాబు ఎప్పుడో ఎన్నికల శంఖారావం పూరించారు. సింగిల్ టార్గెట్ జగన్‌గా ఆయన ఆరోపణలు విమర్శలతో వైసీపీకి దడ పుట్టిస్తున్నారు. టీడీపీ, జనసేన కూటమితో కలవడం ఇష్టం లేకపోతే.. బిజెపి ఏపీలో ఒంటరిగా పోటీ చేయవచ్చు.

  • Written By:
  • Publish Date - January 28, 2024 / 04:53 PM IST

YS JAGAN: ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ పయనంలో అత్యంత క్లిష్టమైన పరిస్థితిని ఇప్పుడు ఎదుర్కొంటున్నారు. రాబోయే ఎన్నికల్లో జగన్ ఒక్కరే ఐదుగురు రాజకీయ ప్రత్యర్థులను ఎదుర్కోబోతున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్, వామపక్ష పార్టీలు.. వైసీపీకి వ్యతిరేకంగా బరిలోకి దిగుతున్నాయి. 2019లో 151 సీట్లతో చరిత్ర చూడని అద్భుతమైన విజయం సాధించిన జగన్.. ఈసారి ఒంటరిగా ఐదుగురు ప్రత్యర్ధుల్ని ఎదుర్కోబోతున్నారు. ఈ ఐదుగురిలో సొంత చెల్లెలు ఆయనకు ఊహించని ప్రత్యర్థిగా మారడంతో.. తనను తాను అర్జునుడిగా అభివర్ణించుకున్న జగన్.. నిజానికి అభిమన్యుడిగా మిగిలిపోనున్నారు.
ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్‌ని అమాయకంగా చదివేసే జగన్.. తెలియక అన్నారో, తెలిసి అన్నారో కానీ.. మహాభారత యుద్ధంలో అర్జునుడితో తనను తాను పోల్చుకున్నారు. కానీ నిజానికి ఏపీలో రాజకీయ పరిస్థితులు, ఎన్నికల జరుగుతున్న తీరు చూస్తే జగన్.. అర్జునుడిగా కాదు అభిమన్యుడిగా మిగిలిపోయేటట్లు కనిపిస్తోంది. జగన్ మొదటి నుంచి తాను ఒంటరిగా పోటీ చేస్తానని.. ఎవ్వరినీ కలుపుకుని ఎన్నికలకెళ్లే పరిస్థితి రాదని చెప్తూనే ఉన్నారు. ఇప్పుడే కాదు 2014, 2019 ఎన్నికల్లో కూడా వైసీపీ ఒంటరిగానే పోటీ చేసింది. ఈసారి కూడా ఎవరితో పొత్తు లేకుండా, ఒంటరిగానే బరిలోకి దిగుతోంది. అదే విషయాన్ని జగన్ తరచూ చెబుతూ ఉంటారు. సింహం సింగిల్‌గా వస్తుందని ఆయన చుట్టూ ఉండే భజనగాళ్లు కూడా జగన్‌ని ఆకాశానికి ఎత్తేస్తూ ఉంటారు. ఇంతవరకు బాగానే ఉంది. ఆర్థికంగా, క్యాడర్‌పరంగా అత్యంత బలంగా ఉన్న జగన్.. ఒంటరిగా పోటీ చేయడంలో ఆశ్చర్యం లేదు.

CHANDRABABU NAIDU: జగన్ అర్జునుడు కాదు.. భస్మాసురుడు.. ఏపీని నెంబర్ వన్ చేస్తా: చంద్రబాబు

అయితే జగన్‌ని ఒంటరిగా ఎదుర్కోలేము అని తెలిసిన మిగిలిన పార్టీలు ఇప్పుడు కలిసి పోటీ చేయబోతున్నాయి. టీడీపీ, జనసేన ఇప్పటికే పొత్తు ప్రకటించాయి. బీజేపీ కూడా తమతో కలవనుందని అధినేత పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. అయితే ఇప్పటివరకు సింగిల్‌గా పోటీ చేస్తుందా కూటమితో కలిసి వస్తుందా అనేది బీజేపీ తేల్చలేదు. ప్రస్తుతానికి జనసేన, టీడీపీ మాత్రం కలిసే వైసీపీని ఎదుర్కొంటున్నాయి. వైసీపీకి చిరకాల ప్రత్యర్థి అయిన టీడీపీ.. మరోసారి తన 2014 కాంబినేషన్ రిపీట్ చేస్తూ జనసేనని కలుపుకొని జగన్‌ని దుమ్మెత్తి పోస్తోంది. 74 ఏళ్ల వయసులో చంద్రబాబు ఎప్పుడో ఎన్నికల శంఖారావం పూరించారు. సింగిల్ టార్గెట్ జగన్‌గా ఆయన ఆరోపణలు విమర్శలతో వైసీపీకి దడ పుట్టిస్తున్నారు. టీడీపీ, జనసేన కూటమితో కలవడం ఇష్టం లేకపోతే.. బిజెపి ఏపీలో ఒంటరిగా పోటీ చేయవచ్చు. ఇక ఊహించని విధంగా తెలంగాణ ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌లో చేరిన జగన్ చెల్లెలు షర్మిల.. ఆయనకు ఏకుకి మేకులా తయారయ్యారు. మిగిలిన వాళ్ళ కంటే నాలుగు తిట్లు ఎక్కువే తిడుతున్నారు. జగన్ వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ షర్మిల మాట్లాడే మాటలు, పెట్టే శాపనార్ధాలు జగన్‌ని పూర్తిగా బజారుకీడుస్తున్నట్లు ఉన్నాయ్. ఇక వామపక్షాలు ఎప్పటినుంచో జగన్‌కి వ్యతిరేకంగా పోరాడుతున్నాయ్, విమర్శిస్తున్నాయి కూడా.

BRS-KCR: బీఆర్ఎస్ తెలంగాణకే పరిమితమా..? జాతీయ రాజకీయాలకు దూరమేనా..?

వామపక్షాల బలం ఏపీలో చాలా తక్కువే అయినా.. ప్రత్యర్థి, ప్రత్యర్థే కదా ! బీజేపీతో వైసీపీకి లోపాయికారి ఒప్పందం ఉన్నా ప్రత్యక్ష ఎన్నికల్లో మాత్రం బీజేపీ.. వైసీపీకి ప్రత్యర్థే. ఆ పార్టీ నేతలు ఇప్పటికే అధికార పార్టీపై దుమ్మెత్తి పోస్తున్నారు. జగన్ పాలనపై రకరకాలుగా విమర్శలు సంధిస్తున్నారు. ఈ రకంగా చూస్తే జగన్ మొత్తం కలిపి.. ఆరుగురు ప్రత్యర్థులతో రాబోయే ఎన్నికల్లో ఒంటరి పోరాటం చేయబోతున్నారు. అనూహ్యంగా భీమిలి సభలో తాను అభిమన్యుడు కాదు అర్జునుడిని అంటూ జగన్‌ చెప్పుకున్నారు. కానీ ఏపీ ఎన్నికల పద్మవ్యూహంలో జగన్ ఇప్పుడు అభిమన్యుడే. ఇన్ని పార్టీలు పోటీ చేసినప్పుడు.. ఓట్లు చీలిపోయి కచ్చితంగా తాను గెలుస్తానని జగన్ అనుకుంటూ ఉండవచ్చు. కానీ టీడీపీ, జనసేన కూటమి ఇప్పుడు రాష్ట్రంలో బలమైన ప్రత్యర్థి. మిగిలిన వాళ్లు వ్యతిరేక ఓటు చీల్చేంత శక్తివంతులు కాదు. అందువల్ల రాజకీయ ప్రత్యర్థులు ఎంత ఎక్కువైతే.. అన్ని ఓట్లు చీలి వైసీపీ గెలుస్తుంది అనే అంచనా తప్పు. కాంగ్రెస్, వామపక్షాలు ప్రభావం అంతంత మాత్రమే. ఇక బీజేపీకి ఏపీలో కార్పొరేటర్‌ని గెలిపించుకునే శక్తి కూడా లేదు. అయితే ఈ పార్టీలన్నీ జగన్‌పై వ్యతిరేకతను విపరీతంగా సృష్టించగలవు. ఆ ఫలితం మాత్రం టీడీపీ, జనసేనకే వస్తుంది. ఈ రకంగా చూస్తే రాష్ట్ర రాజకీయ చరిత్రలో.. కనీవినీ ఎరుగని రీతిలో ఒక పాలక పార్టీ ఆరు రాజకీయ పార్టీలతో ఒంటరి పోరు చేస్తోంది. నిజంగా అద్భుతం జరిగి వైసీపీ గెలిస్తే జగన్ అర్జునుడే.. లేదంటే పద్మవ్యూహంలో నేలకొరగక తప్పదు.