దారుణ లైంగిక వేధింపులకు గురై, గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ, ప్రాణం కోల్పోయిన సహానా కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం, అక్కడే మీడియాతో మాట్లాడిన మాజీ సీఎం, వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. రాష్ట్రంలో ఈరోజు ఎలాంటి దారుణమైన పరిస్థితి ఉందనడానికి, శాంతి భద్రతలు ఏ స్థాయికి దిగజారిందని చెప్పడానికి, ఓ దళిత చెల్లి పరిస్థితి చూస్తే అర్ధమవుతుందన్నారు. గతంలో వైయస్సార్‌సీపీ ప్రభుత్వంలో అక్కచెల్లెమ్మలకు ఏ ఆపద వచ్చినా కాపాడేందుకు దిశ యాప్ ఉండేదని తెలిపారు.
ఏ అక్కచెల్లెమ్మ ఆపదలో ఉన్నా, ఎస్‌ఓఎస్ బటన్ నొక్కినా, లేదా ఫోన్ 5సార్లు ఊపితే చాలు, 5 నిమిషాల్లో పోలీసులు వచ్చే వాళ్లని తెలిపారు. అదే ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి చూస్తే, చేసినవాడు మనవాడైతే చాలు.. వాడు ఏం చేసినా ఫరవాలేదు. కవరప్ చేయడానికి, దొంగ కేసులు పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం రెడీగా ఉందన్న సంకేతం ప్రభుత్వం ఇస్తోందన్నారు జగన్. ఇక్కడ దయనీయ ఘటన జరిగింది. ఇక్కడ జరిగింది మనకు తేటతెల్లంగా కనిపిస్తున్నా, ప్రభుత్వం ఏ మాదిరిగా స్పందిస్తోంది అన్నది ప్రతి ఒక్కరూ ఆలోచించాలని కోరారు.
ఇక్కడ ఏం జరుగుతోంది అన్నది చూస్తే, నా చెల్లెలు తాను చేస్తున్న ఉద్యోగం ప్రదేశం నుంచి, ఈ నవీన్ అనే వ్యక్తి.. చంద్రబాబుతో దిగిన ఫోటోలు ఉన్నాయి. స్థానిక ఎంపీతో సన్నిహితంగా కూడా ఉన్నాడని… ఆయన నా చెల్లెలు పని చేస్తున్న ప్రదేశానికి వచ్చి, ఆ పాపను కారులో ఎక్కించుకుని పోయి, తాను, తనతో పాటు ఇంకొందరు కలిసి, నా చెల్లెలిని వేధించడమే కాకుండా, శారీరకంగా హింసించారు. శరీరమంతా కందిపోయిన గుర్తులు కనిపిస్తున్నాయి. ప్రైవేటు పార్ట్ లు కూడా విచ్ఛిన్నం చేశారు. ఇక్కడికి తీసుకొచ్చి పడేసి, కుటుంబ సభ్యులు రాగానే జారుకున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు.
అంటే ఫిజికల్‌గా వేధించడమే కాకుండా, లైంగికంగా కూడా వేధించి, ఆస్పత్రిలో పడేసి, ఆమె కుటుంబ సభ్యులు రాగానే జారుకోవడం జరిగిందన్నారు జగన్. నేను అడుగుతున్నాను… ఆస్పత్రికి పాప తల్లి, తండ్రి వచ్చే సరికి వారి కళ్లెదుటే జారుకున్నారు. అది కళ్లెదుటే కనిపిస్తోందన్నారు జగన్. ఎప్పుడైనా ఇలాంటి ఘటన జరిగినప్పుడు ప్రభుత్వం ఏం చేయాలి? మేము తోడుగా ఉన్నామని చెప్పాలని… అది ధర్మం అన్నారు జగన్. తప్పు చేసింది ఎవరైనా సరే, చట్టానికి అతీతం కాదు. కచ్చితంగా శిక్ష పడుతుందన్న భరోసా, బాధితులకు ఇవ్వాలి. అయినా ఈ విషయాలు ఎందుకు దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఎందుకు ఇదే వ్యక్తి, ఆస్పత్రిలో ఈ పేషెంట్‌ను వేర్వేరు ఆస్పత్రులకు తిప్పి, బ్రెయిన్‌డెడ్ అయిన పరిస్తితిలో, చివరకు గవర్నమెంట్ ఆస్పత్రికి తీసుకొచ్చారన్నారు. నారా లోకేష్. ఈ మనిషికి బుద్ధి తక్కువ. జ్ఞానం తక్కువ. ఈ మనిషిని పప్పు అని కూడా అంటారని ఎద్దేవా చేసారు. బుద్ధి ఉన్న వాడెవడైనా దిశ చట్టాన్ని, యాప్‌ను కాల్చేస్తారా? మంచి చేసే దీన్ని ఎవడైనా కాల్చేస్తాడా? చెప్పండి అని ప్రశ్నించారు. బుద్ధి లేని ఈ మనిషికి, పప్పు లాంటి ఈ మనిషికి పక్కనున్న వ్యక్తి ఎవరు అంటే, హోం మంత్రి అంటూ ఎద్దేవా చేసారు.