YS JAGAN: తెలంగాణలో సీఎం కేసీఆర్ అనుసరించిన పద్ధతినే ఏపీ సీఎం జగన్ ఫాలో అవ్వబోతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టిక్కెట్లు కేటాయిస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. నలుగురైదుగురు మినహా, దాదాపు అందరు సిట్టింగులకే కేసీఆర్ టిక్కెట్లు ఇవ్వబోతున్నారు. ఇప్పుడు ఏపీ సీఎం జగన్ కూడా సిట్టింగులకే ఎక్కువ టిక్కెట్లు కేటాయించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ఏపీలో వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో చాలా మందికి ఈసారి టిక్కెట్లు ఇచ్చే అవకాశం లేదని జగన్ చాలాకాలం నుంచి చెబుతూవస్తున్నారు.
వీరిలో అత్యధిక సంఖ్యలో సీట్లు ఈసారి సిట్టింగులకే ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఇతర పార్టీల నుంచి వైసీపీలో చేరిన ఎమ్మెల్యేలకు కూడా టిక్కెట్లు ఇచ్చే ఛాన్స్ ఉంది. టీడీపీ నుంచి గెలిచిన వల్లభనేని వంశీ, జనసేన నుంచి గెలిచిన రాపాక వంటి వాళ్లు వైసీపీకి మద్దతుగా ఉంటున్నారు. దీంతో ఈసారి వీళ్లకే టిక్కెట్లు వచ్చే ఛాన్స్ ఉంది. గతంలో 35-40 మంది సిట్టింగులకు టిక్కెట్లు రాకపోవచ్చనే ప్రచారం జరిగింది. కానీ, ఇప్పుడా పరిస్థితులు కనిపించడం లేదు. 10-15 మందికి మాత్రమే టిక్కెట్లు నిరాకరించే ఛాన్స్ ఉందని పార్టీవర్గాలు అంటున్నాయి. బాగా వ్యతిరేకత ఉండి, ఓటమి తప్పదనుకునే ఎమ్మెల్యేలకు మాత్రమే జగన్ హ్యాండ్ ఇవ్వబోతున్నారు. కొన్ని స్థానాల్లో మార్పులు ఉంటాయి. ఆదాల ప్రభాకర్ రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, చింతా అనురాధ, వంగా గీత, మార్గాని భరత్ వంటి కొంతమంది ఎంపీలకు ఈసారి అసెంబ్లీ టిక్కెట్లు ఇవ్వబోతున్నారు. ఈ క్రమంలో కొందరు ఎమ్మెల్యేలకు టిక్కెట్లు దక్కకపోవచ్చు. ఇంకొందరు ఎమ్మెల్యేలను ఎంపీగా పోటీ చేయించి, లోక్‌సభకు పంపాలని అనుకుంటున్నారు. కురసాల కన్నబాబు, ధర్మాన ప్రసాద రావు, బొత్స సత్యనారాయణ, తమ్మినేని సీతారాం, ఆళ్ల నాని, అనిల్ కుమార్ యాదవ్ ఈసారి ఎంపీలుగా పోటీ చేసే ఛాన్స్ ఉంది.
ఈ నేపథ్యంలో వీరి అసెంబ్లీ స్థానాల్లో కొత్త వాళ్లు పోటీ చేస్తారు. పేర్ని నాని, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి వంటి కొందరు ఎమ్మెల్యేలు పోటీ నుంచి తప్పుకొని, తమ వారసులకు టిక్కెట్లు ఇప్పించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. దీనికి జగన్ అంగీకరిస్తారా.. లేదా అన్నది చూడాలి. ఇక.. వైసీపీపై పోరుబాట పట్టిన ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి వంటి వారితోపాటు, ఎంపీ రఘురామ కృష‌్ణం రాజుకు ఈ సారి ఎలాగూ వైసీపీ టిక్కెట్లు వచ్చే ఛాన్స్ లేదు. కాబట్టి, వీళ్లు టీడీపీ నుంచి పోటీ చేస్తారు. అందువల్ల ఆయా స్థానాల్లో ఇతరులకు జగన్ అవకాశం కల్పిస్తారు. మొత్తంగా సీట్ల కేటాయింపులో జగన్ ఎక్కువ మంది సిట్టింగులకే అవకాశం ఇస్తున్నారు. కొందరి స్తానాల్లో మార్పులు ఉంటాయంతే.