TDP Vs YS JAGAN: టీడీపీ.. థ్యాంక్స్‌ టు జగన్..!

చంద్రబాబును స్కిల్‌డెవలప్‌మెంట్‌ స్కామ్‌లో అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది ఏపీ ప్రభుత్వం. ఎన్నికల వేళ టీడీపీకి ఇది ఇబ్బందికర పరిణామమే. అయితే ఇందులో టీడీపీకి ఎంతో కొంత మేలు జరిగిందని పొలిటికల్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

  • Written By:
  • Publish Date - September 17, 2023 / 08:51 PM IST

TDP Vs YS JAGAN: చంద్రబాబును అరెస్ట్‌ చేయడం తప్పా.. ఒప్పా.. అన్నది పక్కన పెడితే ఓ రకంగా టీడీపీకి మేలు చేశారు ఏపీ ముఖ్యమంత్రి జగన్. ఇంతకీ ఇంత చెడులోనూ టీడీపీకి జరిగిన మేలేంటి..?
చెడులోనూ కొంత మంచి..
చంద్రబాబును స్కిల్‌డెవలప్‌మెంట్‌ స్కామ్‌లో అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది ఏపీ ప్రభుత్వం. ఎన్నికల వేళ టీడీపీకి ఇది ఇబ్బందికర పరిణామమే. అయితే ఇందులో టీడీపీకి ఎంతో కొంత మేలు జరిగిందని పొలిటికల్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. చంద్రబాబు అరెస్టు జరిగిపోయింది. దాని గురించి ఆలోచించడం పక్కనపెట్టి.. జరగాల్సింది చూడాలని వారు సూచిస్తున్నారు. ఇంతకాలం టీడీపీ కాస్త పుంజుకుందని భావించినప్పటికీ పార్టీ శ్రేణులు మాత్రం పూర్తిస్థాయిలో యాక్టివ్ కాలేదు. ఎన్నికలు దగ్గర పడుతున్నా పార్టీ శ్రేణులు ఏకం కాలేదు. కానీ చంద్రబాబు అరెస్టుతో సీన్ మారిపోయింది. వైసీపీపై ఆగ్రహంతో రోడ్డుపైకి వచ్చాయి. ప్రభుత్వం.. పోలీసులతో అల్లర్లు జరగకుండా ఆపినా, నేతలను అరెస్ట్ చేసినా టీడీపీ శ్రేణుల్లో రగిలిన ఆగ్రహమే వారిని ఏకం చేసింది. ఇప్పటికైనా దూకుడుగా వెళ్లకపోతే వైసీపీ మరిన్ని కక్ష సాధింపు చర్యలకు దిగుతుందని టీడీపీ శ్రేణులకు అర్థమైంది. చంద్రబాబును నంద్యాల నుంచి విజయవాడ వరకు రోడ్డుమార్గాన తీసుకురావడం ఆ పార్టీకి మేలే చేసిందని విశ్లేషకులు అంటున్నారు. మాములుగా వారిలో ఈ దూకుడు తీసుకురావడం చంద్రబాబుకు అంత ఈజీ అయ్యుండేది కాదు.
జనసేన, టీడీపీ కేడర్ మధ్య సయోధ్య
టీడీపీ, జనసేన కలుస్తాయని అందరికీ ముందే తెలుసు. కానీ తాము ఎందుకు కలవాల్సి వస్తుందో ప్రజలకు చెప్పడానికి బలమైన కారణం వెతుక్కోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు వైసీపీ అరాచకాలను అడ్డుకోవడానికి తాము ఏకం కాక తప్పదని చెప్పుకోవడానికి అవకాశం దొరికింది. పైగా చంద్రబాబు, పవన్ చేతులు కలిపినా కేడర్ కలుస్తుందన్న నమ్మకం లేదు. నిజానికి జనసేన కేడర్‌ను టీడీపీ అంగీకరించే పరిస్థితి గ్రౌండ్ లెవల్‌లో ఉండేది కాదు. ఒకరంటే ఒకరికి పడేది కాదు. కానీ ఇప్పుడు సీన్ మారింది. టీడీపీకి జనసేన అవసరం తెలిసొచ్చింది. ఆ పార్టీ తమతో ఉండకపోతే వచ్చే ఎన్నికల్లో కూడా ఇదే పరిస్థితి ఉంటుందని, అప్పుడు తామెవరూ బతకలేమని, తమను బతకనివ్వరని తెలిసొచ్చింది. అలాగే జనసేన కేడర్‌కు కూడా కొద్దోగొప్పో సీట్లు రాకపోతే తమ పరిస్థితి మరింత దిగజారుతుందని అర్థమైంది. దీంతో రెండు పార్టీల కేడర్ తప్పనిసరిగా కలసి పనిచేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తటస్థుల చూపు టీడీపీవైపు..
టీడీపీకి జరిగిన మరో మేలు తటస్థులను తమవైపు తిప్పుకోవడం. చంద్రబాబును వైసీపీ నేతలు విమర్శిస్తున్న తీరు జనంలోకి వేరే విధంగా వెళ్లింది. వయసును కూడా గౌరవించకుండా వాడు, వీడు, కుక్క, వెధవ.. ఇలాంటి మాటలతో వేధించడం సరికాదన్న అభిప్రాయం జనంలో ఉంది. రాజకీయ విమర్శలు చేయాల్సిన తరుణంలో.. ఎప్పుడు పోతాడో చూస్తున్నాం వంటి మాటల ద్వారా జనంలోకి నెగెటివ్ సంకేతాలు వెళ్లాయి. ఇప్పుడు 70ఏళ్లు పైబడ్డ చంద్రబాబును అరెస్ట్ చేసిన తీరు, సీఐడీ ఆఫీసులో కొన్ని గంటల పాటు కూర్చోపెట్టిన విధానం, కోర్టులోనూ ఒంటరిని చేసిన విధానం జనంలో సానుభూతిని పెంచింది. చంద్రబాబును వ్యతిరేకించే వారు కూడా అయ్యోపాపం అనకుండా ఉండలేకపోయారు. ఇది టీడీపీకి కలసి వచ్చేదే. ఇంతకాలం వాలంటీర్లకు భయపడి, ప్రభుత్వ పథకాలు అందవేమోనన్న భయంతో ఉన్న చాలామంది ఈ ఎపిసోడ్‌తో నోరు తెరవడం మొదలుపెట్టారు. స్కిల్ స్కామ్‌లో చంద్రబాబును ఎక్కువ కాలం జైల్లో పెట్టే అవకాశాలు లేవు. లీగల్ టీమ్ ఎలాగోలా చంద్రబాబును బయటకు తీసుకువస్తారు. ఆ తర్వాత ఏపీ రాజకీయాలు మరింత వేడెక్కుతాయి. దాన్ని టీడీపీ తనకు అనుకూలంగా తిప్పుకోగలిగితే అధికారం దక్కినట్లే. చూడాలి మరి.. వైసీపీ దీన్ని ఎలా ఎదుర్కొంటుందో..!