YS Jagan – UCC: జగన్‌కు యూసీసీ గండం.. బయటపడేదెలా..?

ఇప్పటివరకు వైసీపీ అధినేత జగన్ తన వ్యక్తిగత కారణాలతో బీజేపీకి మద్దతిస్తున్నారని ముస్లింలు భావిస్తూ వచ్చారు. అయితే తన అవసరాల కోసం ముస్లింల అస్తిత్వానికి వ్యతిరేకమైన బిల్లుకు మద్దతిస్తే మాత్రం వారు ఆ పార్టీకి దూరమవుతారు.

  • Written By:
  • Publish Date - July 15, 2023 / 12:46 PM IST

యూనిఫామ్ సివిల్ కోడ్….. ఉమ్మడి పౌర స్మృతి చట్టం… ఈ బిల్లు ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి జగన్ పాలిట గండంగా మారేలా కనిపిస్తోంది. ఎన్నికల ఏడాదిలో ఇది ఎక్కడ తమను ముంచేస్తుందోనని జగన్ భయపడుతున్నారు.

ఉమ్మడి పౌరస్మృతి… అంటే అందరికీ ఒకటే చట్టం… వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టి ఎలాగైనా గట్టెక్కించాలన్నది బీజేపీ పంతం. బిల్లును అడ్డుకోవాలన్నది ప్రతిపక్షాల వ్యూహం. ఇందుకోసం ప్రతిపక్షాలన్నీ ఏకమయ్యాయి. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఏపీ ముఖ్యమంత్రి జగన్ మాత్రం బిల్లుకు మద్దతు ఇస్తున్నట్లు చెబుతున్నారు. ఇటీవల ఢిల్లీ వెళ్లిన జగన్… బిల్లుకు తమ మద్దతు ఉంటుందని బీజేపీ హైకమాండ్‌కు సవినయంగా మనవి చేసుకొచ్చారు.

బిల్లుకు మద్దతు ఇవ్వక తప్పని పరిస్థితి వైసీపీది. బీజేపీని ఎదిరించి, బిల్లుకు వ్యతిరేకంగా ఓటేయలేదు. ఎందుకంటే తమ పిలక బీజేపీ చేతిలో ఉంది. అక్రమాస్తుల కేసు, వివేకా కేసు, ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు… ఏది బయటకు తీసినా తాడేపల్లి పునాదులు కదులుతాయి. కాబట్టి వాళ్లు ఏం అడిగినా ఏం చేసినా డూడూ బసవన్నలాగా తల ఊపక తప్పదు. పైగా ఎన్నికల సమయం… ఏ మాత్రం తేడా చేసినా ఎక్కడ ఎలా నట్లు బిగించాలో కమలం పెద్దలకు బాగా తెలుసు. ఈ సంగతి జగన్‌కూ బాగా తెలుసు… అందుకే కమలం పెద్దలు పిలిచి మాట్లాడగానే ఓకే సార్ అంటూ తల ఊపేశారు. మీరెలా చెబితే అలా అంటూ హామీ ఇచ్చేశారు.

తల ఊపడమైతే బాగానే ఉంది కానీ అది ఎక్కడ తమ కొంప ముంచుతుందోనని వైసీపీ భయపడుతోంది. గత ఎన్నికల్లో ముస్లింలు వైసీపీకి అండగా నిలబడ్డారు. జగన్ గెలుపు వెనక వారి మద్దతూ ఉంది. యూనిఫామ్ సివిల్ కోడ్ తమకు వ్యతిరేకమని మైనారిటీలు ఆందోళనతో ఉన్నారు. దీంతో బిల్లుకు మద్దతు ఇస్తే వారంతా తమకు ఎక్కడ దూరమవుతారోనన్నది జగన్ భయం. దీనిపై ఇప్పటికే కేసీఆర్ కూడా జగన్‌కు దిశానిర్దేశం చేసినట్లు ప్రచారం సాగుతోంది. మజ్లిస్ అధినేత ఒవైసీ కూడా బిల్లును వ్యతిరేకించాలని జగన్‌ను కోరారు.
అయితే బీజేపీకి మద్దతు ఇవ్వకతప్పని పరిస్థితి జగన్‌ది. టీడీపీ కూడా దీనికి మద్దతిస్తుంది కాబట్టి తమకు ఎలాంటి సమస్యా ఉండకపోవచన్న ఆలోచనలో వైసీపీ ఉంది. అయితే టీడీపీ వ్యూహం వేరుగా ఉంది. ఆ పార్టీ ఎంపీలు పార్లమెంట్‌ను బహిష్కరించొచ్చు. ఆ పార్టీకి ఉన్న ఎంపీలను వేళ్లపై లెక్కపెట్టొచ్చు. రాజ్యసభలో టీడీపీకి ఉంది ఒకే ఒక్క ఎంపీ. కాబట్టి బీజేపీ కూడా దాన్ని సీరియస్‌గా తీసుకోదు. కానీ వైసీపీకి పెద్దల సభలో 9మంది సభ్యులున్నారు. బిల్లు గట్టెక్కాలంటే వారి మద్దతు తప్పనిసరి. అంటే జగన్ బిల్లుకు మద్దతు ఇవ్వాల్సిందే.

ఇప్పటివరకు వైసీపీ అధినేత జగన్ తన వ్యక్తిగత కారణాలతో బీజేపీకి మద్దతిస్తున్నారని ముస్లింలు భావిస్తూ వచ్చారు. అయితే తన అవసరాల కోసం ముస్లింల అస్తిత్వానికి వ్యతిరేకమైన బిల్లుకు మద్దతిస్తే మాత్రం వారు ఆ పార్టీకి దూరమవుతారు. అసలే ఏపీలో పరిస్థితులు బాగోలేవు. ప్రభుత్వ వ్యతిరేకత రోజురోజుకూ పెరుగుతోంది. ఈ సమయంలో ముస్లింలు దూరమైతే చాలా కష్టం. అందుకే జగన్ ఏం చేయాలో అర్థం కాక తలపట్టుకుంటున్నారు.