YS JAGAN: చంద్రబాబు అరెస్టు తర్వాత తొలిసారి ఢిల్లీకి సీఎం జగన్.. ఏం చర్చిస్తారు..?

చంద్రబాబు అరెస్టు వ్యవహారంలో మద్దతు కూడగట్టేందుకు నారా లోకేష్ ప్రయత్నిస్తున్నారు. దాదాపు పది రోజులుగా లోకేశ్ ఢిల్లీలోనే ఉన్నారు. ఇదే సమయంలో జగన్ ఢిల్లీకి వెళ్తుండటం కీలకంగా మారింది. ఢిల్లీలో జగన్.. చంద్రబాబు అరెస్టుతోపాటు, ఏపీ తాజా రాజకీయాలపై చర్చించే అవకాశం ఉంది.

  • Written By:
  • Updated On - October 4, 2023 / 07:15 PM IST

YS JAGAN: ఏపీ సీఎం జగన్ గురువారం ఢిల్లీ వెళ్లబోతున్నారు. అక్కడ ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షాను కలుస్తారు. అలాగే ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్, జల్‌శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పురి సహా పలువురు నాయకులను కలిసే అవకాశం ఉంది. అపాయింట్‌మెంట్లను బట్టి, ఆయా నేతలతో చర్చలు జరుపుతారు. గురు, శుక్రవారాల్లో జగన్ ఢిల్లీలో పర్యటిస్తారు. అయితే, చంద్రబాబు అరెస్టు తర్వాత తొలిసారిగా జగన్ ఢిల్లీ వెళ్తుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.
స్కిల్‌ డెవల్‌పమెంట్‌ కేసులో చంద్రబాబు అరెస్టు వ్యవహారం ఢిల్లీలోనూ ఆసక్తికరంగా మారింది. చంద్రబాబును అరెస్టు చేయడంలో కేంద్రం సహకారం ఉందనే ప్రచారం జరిగింది. ఈ క్రమంలో చంద్రబాబు అరెస్టు వ్యవహారంలో మద్దతు కూడగట్టేందుకు నారా లోకేష్ ప్రయత్నిస్తున్నారు. దాదాపు పది రోజులుగా లోకేశ్ ఢిల్లీలోనే ఉన్నారు. ఇదే సమయంలో జగన్ ఢిల్లీకి వెళ్తుండటం కీలకంగా మారింది. ఢిల్లీలో జగన్.. చంద్రబాబు అరెస్టుతోపాటు, ఏపీ తాజా రాజకీయాలపై చర్చించే అవకాశం ఉంది. చంద్రబాబు అరెస్టు, జనసేన-టీడీపీతో పొత్తుపై కూడా ప్రధాని మోదీ, అమిత్ షాతో చర్చించే అవకాశం ఉంది. టీడీపీ-జనసేన కూటమిలో బీజేపీ చేరే అంశంపై కూడా జగన్ ప్రస్తావించే వీలుంది. రాజకీయంగా తాను చేపడుతున్న కార్యక్రమాలకు మద్దతు ఇవ్వాల్సిందిగా ప్రధానిని జగన్ కోరే అవకాశం ఉంది. అన్నింటికీ మించి ఇన్నర్ రింగ్ రోడ్ స్కాం, ఫైబర్ గ్రిడ్ స్కాంలో నారా లోకేష్, ఆయన కుటుంబ సభ్యులు, టీడీపీ నేతలను కూడా అరెస్టు చేయబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ అంశాల్ని కూడా జగన్ ప్రస్తావించే అవకాశం ఉంది. ఒకవేళ నిజంగా వారిని అరెస్టు చేయాలని భావిస్తే వీటన్నింటికీ మద్దతు ఇవ్వాలని జగన్ కోరే వీలుంది.

ఏపీకి రావాల్సిన నిధులు, పోలవరం ప్రాజెక్ట్ బకాయిల విడుదల, విశాఖపట్నంలో మెట్రో రైలు కారిడార్ అభివృద్ధి.. వంటి అంశాలపై ప్రధానిని జగన్ అడుగుతారని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. అలాగే ఏపీ పునర్విభజన చట్టంలో పొందుపరిచిన హామీల అమలు గురించి ప్రధాని మోదీ, ఆయన మంత్రి వర్గ సహచరులకు ఓ మెమొరాండం సమర్పించే అవకాశం ఉంది. అయితే, చంద్రబాబు వ్యవహారంలో ఏం చర్చిస్తారు అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. జగన్ ఢిల్లీ పర్యటన నేపథ్యంలో కాకినాడ జిల్లా సామర్లకోటలో గురువారం జరగాల్సిన జగనన్న ఇళ్ల సామూహిక గృహ ప్రవేశాల కార్యక్రమం ఉన్నట్టుండి వాయిదా వేశారు.