YS Jagan: జగన్ తెలిసే చేస్తున్నారా..? వాళ్లని కూడా అరెస్ట్ చేయాలని పట్టుబడుతున్నారా..?

బాబు అరెస్టును అవినీతి కోణంలో కంటే కక్ష సాధింపు కోణంలోనే జనం చూశారు. బాబు అరెస్ట్ తర్వాత దాన్ని సమర్ధించుకోలేకపోవడంతో పాటు, వైసీపీ నేతలు అత్యుత్సాహంతో చేసిన ప్రకటనలు కొంపముంచాయి. దీంతో జగన్‌కు ఏం చేయాలో అర్థంకాక ఇంకేదో చేస్తున్నారని వైసీపీ వర్గాలంటున్నాయి.

  • Written By:
  • Publish Date - September 20, 2023 / 05:17 PM IST

YS Jagan: తప్పని తెలిసినా అదే మళ్లీ తప్పు చేయాలని ముఖ్యమంత్రి జగన్ పట్టుబడుతున్నారా..? రాజకీయంగా నష్టమని తెలిసినా మొండిగా ముందుకే ఎందుకు వెళ్లాలనుకుంటున్నారు..? లాభం కంటే నష్టం ఎక్కువ జరుగుతుందని ఆయనకు ఎవరూ చెప్పట్లేదా.. చెప్పినా వినట్లేదా..?
అనుకున్నదొకటి.. అయ్యిందొకటి..!
టీడీపీ అధినేత చంద్రబాబును జైలుకు పంపారు జగన్. బాబును ఎలాగైనా జైల్లో పెట్టాలన్న తన పంతం నెగ్గించుకున్నారు. చంద్రబాబు తప్పుచేశారో.. ఒప్పు చేశారో.. దర్యాప్తు సంస్థలు, కోర్టులు తేలుస్తాయి. అది వేరే సంగతి. అయితే చంద్రబాబు అరెస్ట్ రాజకీయ ప్రకంపనలు మాత్రం రేపింది. ఇది జగన్ ఊహించిందే. అయితే జనంలో మాత్రం ఊహించని స్పందన వస్తుందని మాత్రం వైసీపీ పెద్దలు ఊహించలేదు. బాబు అరెస్టును అవినీతి కోణంలో కంటే కక్ష సాధింపు కోణంలోనే జనం చూశారు. బాబు అరెస్ట్ తర్వాత దాన్ని సమర్ధించుకోలేకపోవడంతో పాటు, వైసీపీ నేతలు అత్యుత్సాహంతో చేసిన ప్రకటనలు కొంపముంచాయి. లోకేష్ సహా మరికొంతమందిని అరెస్ట్ చేస్తామని వైసీపీ నేతలు హెచ్చరించడం ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపాయి. కావాలనే ఎన్నికల సమయంలో చంద్రబాబును అరెస్ట్ చేశారని ప్రజలు నమ్మారు. మరికొంతమందిని కూడా అరెస్ట్ చేస్తారన్న నిర్ణయానికి వచ్చారు.
జగన్ లిస్టులో ఉన్నదెవరు..?
జనం నుంచి ఈ తరహా స్పందనను సీఎం జగన్ ఊహించలేదు. బాబు అరెస్ట్ తర్వాత జరిపిన సర్వేలో వచ్చిన ఫలితాలు సీఎంకు షాక్‌లా తగిలాయి. అనుకున్నదొకటి అయ్యిందొకటి అని ఆయనకు అర్థమైంది. దీంతో ఆయన ఏం చేయాలో అర్థంకాక ఇంకేదో చేస్తున్నారని వైసీపీ వర్గాలంటున్నాయి. ఓ రకంగా తీవ్ర ఒత్తిడిలో ఉన్న సీఎం.. మరిన్ని దుందుడుకు చర్యలకు సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. మరికొందరు టీడీపీ నేతలను కూడా జైలుకు పంపాలని ఆయన అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. సకల శాఖ సలహాదారు ఆ పనిలోనే ఉన్నట్లు చెబుతున్నారు. ఏ చిన్న ఆధారం దొరికినా ఆయా నేతలను మూసేయాలని సీఐడీ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఓ జాబితా రెడీ అయ్యిందని, దాని ప్రకారం సీఐడీ ముందుకెళుతుందని అంటున్నారు. లోకేష్‌ను కూడా అరెస్ట్ చేయాలని భావించినా.. ప్రస్తుతానికి లోకేష్ జోలికి వెళ్లకుండా మిగిలిన నేతలపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. దేవినేని ఉమ, అచ్చెన్నాయుడు, అయ్యన్న, యనమల, నారాయణ ఇలా ఎవరినైనా.. ఏ క్షణంలో అయినా అరెస్ట్ చేయవచ్చని చెబుతున్నారు. ముఖ్యనేతలు ఎవరైవరైతే ఉన్నారో వారందరినీ లోపలకు తోసేస్తే లేదా కేసుల్లో ఇరికిస్తే పార్టీ అల్లకల్లోలమవుతుందన్నది జగన్ ఆలోచన. లోకేష్ ఒంటరి అవుతారని, తర్వాత ఎలక్షనీరింగ్‌తో గట్టెక్కవచ్చన్నది జగన్ ఆలోచన.
అరెస్ట్ చేసి ఆనందం..?
వైసీపీ నేతలు మరో వర్షన్ కూడా వినిపిస్తున్నారు. జరిగిన నష్టం ఎలాగూ జరిగింది కాబట్టి ఇదే తీరుగా ముందుకెళ్లాలన్నది జగన్ ఆలోచన అంటున్నారు. కొత్తగా పోయేదేమీ లేదు కాబట్టి మరికొందరు నేతలను అరెస్ట్ చేస్తే కనీసం ఆ తృప్తైనా దక్కుతుందన్నది ఆయన ఉద్దేశం అంటున్నారు. జనం ఏమనుకుంటున్నారన్నది నాకు వదిలేయండి.. నేను చెప్పింది చేయండి.. అని పార్టీ పెద్దలకు జగన్ చెప్పినట్లుగా తాడేపల్లి వర్గాలంటున్నాయి.
జగన్ ఆలోచనేంటి..?
ఐప్యాక్ సర్వే కూడా వైసీపీ పరిస్థితి బాగోలేదని తేల్చింది. రోజురోజుకు గ్రాఫ్ పడిపోతోందని, ఏదో ఒకటి చేయాలని ఒత్తిడి తెస్తోంది. అయితే జగన్ ఆలోచన వేరేగా ఉంది. ఐప్యాక్ సర్వే కంటే తన లెక్క వేరే అంటున్నారు. వేల కోట్లు ప్రజల ఖాతాల్లో వేశామని, వారే తనను గెలిపిస్తారని ఆయన నమ్ముతున్నారు. చంద్రబాబు అరెస్ట్ తర్వాత పెద్గగా ఎవరూ రోడ్డుపైకి రాలేదని ఆయన అంటున్నారు. దీన్నిబట్టి ప్రజావ్యతిరేకత లేదని ఆయన నమ్ముతున్నారు. కొన్ని కోట్ల మందికి ప్రభుత్వ పథకాలు అందాయని, వారిలో సగంమంది తనకు ఓటేసినా గెలుపు గ్యారంటీ అంటున్నారు. అయితే పార్టీ నేతలు మాత్రం జనం భయంతోనే రోడ్డుపైకి రాలేదంటున్నారు. ఎక్కడ తమపై కూడా కక్ష సాధింపు చర్యలకు దిగుతారోనన్నది వారి భయం. కానీ ఎన్నికల సమయంలో మాత్రం వారు తమను ఎక్కడ ముంచేస్తారో అన్నది వైసీపీ నేతల భయం. అయితే ఇక్కడ జగన్ ఆలోచన మాత్రం వేరేగా ఉంది. అవసరమైతే డబ్బుతో కొట్టొచ్చన్నది ఆయన ప్లాన్. కానీ ప్రజల్లో వ్యతిరేకత ఎక్కువ ఉంటే మాత్రం డబ్బు కూడా తమను గెలిపించలేదని వైసీపీ నేతలు తెలుసుకోవాలి.