YS JAGAN: సిట్టింగ్ ఎమ్మెల్యేలకు గుడ్ న్యూస్.. సీట్లు ఖాయం చేస్తున్న జగన్..!

సర్వే రిపోర్టు, పనితీరు, నేతల సహకారం, గెలుపు అవకాశాలు వంటి అంశాల ఆధారంగా అభ్యర్థుల్ని ఎంపిక చేస్తున్నారు. జిల్లాల వారీగా అభ్యర్థుల్ని నిర్ణయిస్తున్నారు. ఇప్పటికే ప్రతి జిల్లాలో సగం మందికిపైగా అభ్యర్థుల్ని ఖరారు చేశారు.

  • Written By:
  • Publish Date - August 19, 2023 / 06:57 PM IST

YS JAGAN: ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ.. ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికపై ఇప్పటినుంచే వైసీపీ అధినేత, సీఎం జగన్ కసరత్తు ప్రారంభించారు. వీలైనంత ఎక్కువ మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టిక్కెట్లు ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. సగానికిపైగా సిట్టింగులకే టిక్కెట్లు కేటాయించాలని జగన్ నిర్ణయించారు. 20 స్థానాల్లో మాత్రమే అభ్యర్థుల్ని మార్చే యోచనలో ఉన్నారు. ప్రస్తుతం అభ్యర్థుల ఎంపికపై ప్రత్యేకంగా దృష్టిపెట్టారు.

సర్వే రిపోర్టు, పనితీరు, నేతల సహకారం, గెలుపు అవకాశాలు వంటి అంశాల ఆధారంగా అభ్యర్థుల్ని ఎంపిక చేస్తున్నారు. జిల్లాల వారీగా అభ్యర్థుల్ని నిర్ణయిస్తున్నారు. ఇప్పటికే ప్రతి జిల్లాలో సగం మందికిపైగా అభ్యర్థుల్ని ఖరారు చేశారు. ఒకట్రెండు స్థానాల్లోనే కొత్తవారి పేర్లు పరిశీలిస్తున్నారు. జిల్లాల్లో పర్యటిస్తున్న జగన్.. ఈ సమయంలోనే అక్కడి నేతలకు సూచనలిస్తున్నారు. రాబోయే ఎన్నికల కోసం పనిచేసుకోవాల్సిందిగా ఆయా అభ్యర్థులకు సూచిస్తున్నారు. బలమైన సిట్టింగులున్న చోట వారికి సీట్లు ఖరారు చేసి, వారికి సంకేతాలు పంపిస్తున్నారు. యాభై శాతంపైగా సిట్టింగుల్ని ఎంపిక చేశారు. మిగిలిన యాభై శాతంలో కనీసం 30 శాతం మంది సిట్టింగులకే అవకాశం ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంఛార్జిలలో 20 శాతం మందిని మాత్రమే జాబితానుంచి తొలగిస్తున్నారు. ఈ స్థానాల్లో కొత్త అభ్యర్థులు, మాజీలకు అవకాశం ఇచ్చేందుకు వైసీపీ సిద్ధమవుతోంది. ఇప్పటివరకు చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, కడప, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో చాలా మంది అభ్యర్థుల్ని ఖరారు చేశారు.
వీరికి భారీ రిలీఫ్
కొన్ని నియోజకవర్గాల్లో సీట్లపై స్థానిక ఎమ్మెల్యేలు సందేహంతో ఉన్నారు. అయితే, వారికి కూడా జగన్ సీట్లు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు సంబంధించి మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి (సర్వేపల్లి), అనిల్ కుమార్ యాదవ్ (నెల్లూరు సిటీ), ప్రసన్న కుమార్ రెడ్డి (కోవూరు), రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి (కావలి), మేకపాటి విక్రమ్ రెడ్డి (ఆత్మకూర్)కు టిక్కెట్లు ఖరారు చేశారు. వీళ్ల విషయంలో కొంతకాలంగా సందిగ్ధత నెలకొంది. జగన్ ప్రధానంగా సర్వేలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. సర్వేల ఆధారంగానే అభ్యర్థుల్ని ఎంపిక చేస్తున్నారు. సర్వేల్లో వెనుకబడ్డ వారికి గతంలో హెచ్చరికలు జారీ చేశారు. పనితీరు మార్చుకోవాలని, లేకుంటే ఇబ్బంది తప్పదని హెచ్చరించారు. అయినప్పటికీ కొందరు పట్టించుకోలేదు. ఇప్పటికీ కొందరిపై వ్యతిరేకత ఉంది. అలాంటివారికి టిక్కెట్లు కేటాయించడం లేదు. ప్రతి జిల్లాలో రెండు లేదా మూడు స్థానాల్లో కొత్త వారికి ఛాన్స్ దక్కొచ్చు.