YS JAGAN: చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం ఏపీలో మంటలు రేపుతున్నాయి. కక్ష సాధింపు ధోరణితోనే చంద్రబాబును జగన్ అరెస్ట్ చేయించారని తెలుగు తమ్ముళ్లు, టీడీపీ నేతలు ఘాటు విమర్శలు చేస్తున్నారు. ఐతే చంద్రబాబు అరెస్ట్ సమయంలో, లండన్ పర్యటనలో ఉన్న జగన్ ఇప్పుడు ఏపీకి వచ్చారు. వచ్చీ రావడంతోనే ఢిల్లీ పర్యటనకు సిద్ధం అవుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇదే ఇప్పుడు మిలియన్ డాలర్ ప్రశ్నలకు కారణం అవుతోంది.
ఢిల్లీ పర్యటనలో రెండు రోజుల పాటు జగన్ బిజీబిజీగా గడుపుతారని.. ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్ షాతో భేటీ అవుతారని తెలుస్తోంది. చంద్రబాబు అరెస్ట్‌తో రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ.. లండన్ నుంచి వచ్చిన తరువాతి రోజునే.. జగన్ ఢిల్లీ వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందనే చర్చ నడుస్తోంది. చంద్రబాబు అరెస్ట్ వెనక కేంద్రం సహకారం ఉందా.. ఢిల్లీ వెళ్లి జగన్ ఇదే విషయాలను కేంద్ర పెద్దలకు వివరిస్తారా అంటూ రకరకాల చర్చ జరుగుతోంది. ఇక అటు లండన్ నుంచి జగన్ ఆదేశాల మేరకే చంద్రబాబును ఇక్కడి పోలీసులు అరెస్ట్ చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో విదేశాల నుంచి వచ్చీ రాగానే ముఖ్య నేతలతో జగన్ సమీక్షించడం హాట్‌టాపిక్ అవుతోంది.
చంద్రబాబు అరెస్ట్, రిమాండ్‌కు పంపిన విధానం.. ఆ తర్వాత రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలపై జగన్ రివ్యూ చేసినట్లు తెలుస్తోంది. ఇక అటు బుధవారం ఢిల్లీకి వెళ్లనున్న జగన్.. కీలక భేటీలు నిర్వహిస్తారని తెలుస్తోంది. జీ20 సమావేశాల బిజీలో ఉన్న మోదీ, కేంద్రమంత్రి అమిత్ షా ఇప్పటివరకు చంద్రబాబు అరెస్ట్ అంశంపై రియాక్ట్ కాలేదు. దీంతో బాబు అరెస్ట్ అంశంపై జగన్ వాళ్లతో చర్చించనున్నట్లు కొందరు భావిస్తున్నారు. ఇదే ఇప్పుడు టీడీపీ శ్రేణులను టెన్షన్ పెడుతోంది. ఇక అటు దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికలకు కేంద్రం సిద్ధం అవుతోందని ప్రచారం జరుగుతోంది. దీంతో జమిలి ఎన్నికలపై కేంద్రంతో జగన్ చర్చలు జరుపుతారని తెలుస్తోంది. జమిలి ఎన్నికలు నిర్వహిస్తే.. తాము సిద్ధంగా ఉన్నామా.. లేదా అనే విషయంపై జగన్ చెప్పబోతున్నట్లు టాక్.
ఇక జగన్ ఢిల్లీ పర్యటన వేళ మరో భయం టీడీపీ శ్రేణులను వెంటాడుతోంది. చంద్రబాబును మరిన్ని కేసుల్లో ఇరికించి రాజకీయంగా దెబ్బతీసేందుకు జగన్‌ను ఢిల్లీ పెద్దలు పిలిపించుకుంటున్నారా అనే అంశంపై జోరుగా చర్చ నడుస్తోంది. మొత్తానికి జగన్ ఉన్నట్టుండి ఢిల్లీ ఎందుకు వెళ్తున్నారో తెలియక రాజకీయవర్గాలు కన్ఫ్యూజన్‌లో పడిపోయాయి.