YSRCP MANIFESTO: వైసీపీ ప్రకటించిన మేనిఫెస్టోలో కొత్తగా పథకాలు, సంచలనాలు ఏవీ లేకపోవడంతో పార్టీ శ్రేణులు డీలా పడ్డాయి. ప్రస్తుతం నడుస్తున్న నవరత్నాలకు కాస్త కేటాయింపులు పెంచారే గానీ.. ఈ మేనిఫెస్టోలో కొత్తదనం ఏముందన్న ప్రశ్నలు వస్తున్నాయి. రైతు రుణమాఫీ ప్రకటన వస్తుందని చాలా మంది భావించారు. కానీ అలాంటేదేమీ లేకపోవడం కొంత నిరాశపరిచింది.
KCR: ఊహల్లోంచి రియాలిటీలోకి కేసీఆర్.. సోషల్ మీడియాలో అకౌంట్ ఓపెన్
గత ఎన్నికల ముందు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన నవరత్నాలకు జనంలో ఎక్కడ లేని క్రేజ్ వచ్చింది. ఏ నోట విన్నా ఇదే టాక్ ఉండటంతో ఆ పార్టీకి విజయం దక్కింది. స్థానిక సంస్థల్లోనూ వైసీపీకి ఎదురు లేకుండా పోయింది. ఏపీ జనం సంక్షేమ, ఉచిత పథకాలకు బాగా అలవాటు పడ్డారని టీడీపీ అధినేత చంద్రబాబు కూడా గ్రహించారు. అందుకే తనకు ఇష్టం లేకున్నా.. కూటమి తరపున సూపర్ సిక్స్ హామీలను జనంలోకి వదిలారు. ఇప్పుడు జగన్ మేనిఫెస్టోలో ఆ సూపర్ సిక్స్ కంటే సూపర్ రేంజ్‌లో పథకాలను ప్రకటించాల్సి ఉంది. కానీ గతంలోని నవరత్నాలకు కొంత మొత్తాలు పెంచి.. ఈ మేనిఫెస్టోలో ప్రకటించడం వైసీపీ శ్రేణులకు ఏ మాత్రం నచ్చలేదు. రేపు కూటమి ఇంతకంటే మించి సంక్షేమ పథకాలతో మేనిఫెస్టోను ప్రకటిస్తే ఎలా అన్న టెన్షన్ మొదలైంది. చంద్రబాబు తాము అధికారంలోకి వచ్చినప్పటి నుంచే 4 వేల రూపాయల ఫించన్ ఇస్తానన్నారు. కానీ జగన్ మాత్రం.. 3500లు ప్రకటించి అది కూడా 250 రూపాయల నాలుగేళ్ల తర్వాత ఇస్తామన్నారు. రైతుల రుణమాఫీ ఖచ్చితంగా ఉంటుందని చాలామంది ఆశ పెట్టుకున్నారు.
కానీ రైతు భరోసా కింద ప్రస్తుతం ఇస్తున్న 13 వేల 500లను 16 వేలకు పెంచుతామని మాత్రమే జగన్ హామీ ఇచ్చారు. ఇంతకు మించి వ్యవసాయ రంగానికి కొత్తగా ఎలాంటి ప్రోత్సాహాలు ప్రకటించలేదు. డ్వాక్రా రుణాల మాఫీపై మహిళలు ఆశగా ఎదురు చూశారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నట్టు జగన్ తరుచూ చెబుతుంటారు. కానీ ఎన్నికల ముందు ఇలా సంచలనాలు లేని మేనిఫెస్టో రిలీజ్ చేయడం ఏంటని వైసీపీ శ్రేణులు నిరాశగా ఉన్నాయి. తాను అమలు చేయగలిగినవి మాత్రమే హామీ ఇచ్చాననీ.. తప్పు దోవ పట్టించలేదని చెప్పుకొచ్చారు జగన్. కానీ జనం అది ఎంతవరకు నమ్ముతారన్నది చూడాలి.