YS Jagan: జగన్‌కు అసలైన సవాల్.. బీజేపీ కోసం యూసీసీకి మద్దతిస్తారా..? మైనారిటీలకేం చెబుతారు..?

ఈ వర్షాకాల సమావేశాల్లోనే బిల్లు తీసుకురానుంది. న్యాయవ్యవహారాల పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సమావేశంలో కేంద్రం దీనిపై ఇప్పటికే తీసుకుంది. దీన్ని పార్లమెంటులో ప్రవేశపెడితే వైసీపీ మద్దతు ఇస్తుందా.. లేదా.. అనే ఆసక్తి నెలకొంది.

  • Written By:
  • Publish Date - July 9, 2023 / 09:42 AM IST

YS Jagan: కేంద్రంలో బీజేపీకి అన్ని అంశాల్లోనూ వైసీపీ మద్దతిస్తోందనే సంగతి తెలిసిందే. ఇతర పార్టీలు వ్యతిరేకించిన సందర్భాల్లో కూడా వైసీపీ.. బీజేపీ వెంటే నడిచింది. ఈ విషయంలో ఇప్పటివరకు జగన్‌కు పెద్దగా సమస్యలు ఎదురుకాలేదు. కానీ, ఇప్పుడు అసలైన సవాల్ ఎదురవ్వబోతుంది. అది ఉమ్మడి పౌర స్మృతి చట్టం (యూసీసీ) రూపంలో. యూసీసీ బిల్లును పార్లమెంటులో బీజేపీ ప్రవేశపెట్టబోతుంది. ఈ వర్షాకాల సమావేశాల్లోనే బిల్లు తీసుకురానుంది. న్యాయవ్యవహారాల పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సమావేశంలో కేంద్రం దీనిపై ఇప్పటికే తీసుకుంది. దీన్ని పార్లమెంటులో ప్రవేశపెడితే వైసీపీ మద్దతు ఇస్తుందా.. లేదా.. అనే ఆసక్తి నెలకొంది.
అందరికీ ఒకే చట్టం
మత ప్రాతిపదికన వేరువేరు చట్టాలు కాకుండా.. దేశంలోని పౌరులందరికీ ఒకే చట్టం ఉండాలని బీజేపీ భావిస్తోంది. అందరికీ ఒకే చట్టం ఉండేలా పౌర చట్టాన్ని తీసుకురావాలనుకుంటోంది. అలా తీసుకురానున్న చట్టమే ఉమ్మడి పౌరస్మృతి. ఎన్నో ఏళ్లుగా ఈ చట్టం తేవాలని మోదీ సర్కారు ప్రయత్నిస్తోంది. చివరకు ఈ నెలలోనే ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెడుతోంది. ఈ సమావేశాల్లో ఈ బిల్లుపైనే ప్రధాన చర్చ జరుగుతుంది. బీజేపీ, మిత్ర పక్షాలు దీనికి మద్దతు ఇస్తుంటే.. ప్రతిపక్షాలు ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పటికే దీని విషయంలో పార్టీల మధ్య తీవ్ర చర్చ జరుగుతోంది. విమర్శలు, ప్రతి విమర్శలతో రాజకీయం నడుస్తోంది.
మైనారిటీలే లక్ష్యంగా
మోదీ సర్కారు తెస్తున్న ఈ చట్టాన్ని కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి. మైనారిటీ వర్గాలను లక్ష్యంగా చేసుకుని ఈ చట్టాన్ని తెస్తున్నారని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ విమర్శించారు. దీన్ని అంగీకరించబోమని చెప్పారు. బీజేపీయేతర పక్షాలన్నీ దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. బీజేపీ మిత్రపక్షంగా ఉన్న తమిళనాడుకు చెందిన అన్నా డీఎంకే కూడా ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తోంది. మైనారిటీ వర్గాల్లోనూ అత్యధికులు ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇది మైనారిటీల కుటుంబ వ్యవహారాల్లో చట్టం ద్వారా జోక్యం చేసుకోవడమే అని మైనారిటీ సంఘాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీకి సరైన మద్దతు లభించడం లేదు. అయితే, ఎలాగైనా బిల్లు ఆమోదం పొందేలా చూడాలని బీజేపీ ప్రయత్నిస్తోంది.
వైసీపీ మద్దతు బీజేపీకా..? మైనారిటీలకా..?
పార్లమెంటులో యూసీసీ బిల్లు ఆమోదం పొందాలంటే మిత్రపక్షాల మద్దతు బీజేపీకి అవసరం. లోక్‌సభలో బిల్లు నెగ్గొచ్చు కానీ, రాజ్యసభలోనే కష్టం. ఇక్కడ బిల్లు పాస్ కావాలంటే వైసీపీ మద్దతు చాలా అవసరం. రాజ్యసభలో టీడీపీకి ఒక్క సీటు ఉంటే, వైసీపీకి సీట్లు ఉన్నాయి. ఈ విషయంలో మద్దతు ఇవ్వాల్సిందిగా వైసీపీని బీజేపీ కోరే అవకాశం ఉంది. ఇదే జరిగితే వైసీపీ ఎటువైపు మొగ్గు చూపుతుందనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఎందుకంటే ఈ బిల్లును మైనారిటీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అలాంటి బిల్లుకు వైసీపీ మద్దతు ఇస్తే మైనారిటీ వర్గాలు దూరమయ్యే ఛాన్స్ ఉంది. అలాగని మద్దతు ఇవ్వకపోతే మోదీ, బీజేపీ నుంచి ఇబ్బంది. అసలే బీజేపీతో సన్నిహితంగా ఉండాలని జగన్ కోరుకుంటున్నారు. అలాంటిది బీజేపీని కాదని యూసీసీకి వ్యతిరేకంగా వెళ్లలేదు. అనుకూలంగా ఓటేస్తే మైనారిటీలతో చిక్కులు. బిల్లుకు వ్యతిరేకంగా ఓటేస్తే కేంద్రం నుంచి జగన్‌కు చిక్కులు తప్పవు. మోదీ ఆగ్రహానికి గురి కావాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో జగన్ వైఖరి ఎలా ఉండబోతుందన్నది ఆసక్తికరంగా మారింది.