ఏపీలో షర్మిల ఓ వైపు ఆస్తుల కోసం తన సోదరుడు వైఎస్ జగన్ తో పోరాటం చేస్తూనే… ఇప్పుడు ప్రజా సమస్యలపై కూడా పోరాటం దూకుడుగా చేస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు.. జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయి నాయకులతో ప్రత్యేక సమావేశాలు జరుగుతున్నాయని ఆమె ఎక్స్ లో పోస్ట్ చేసారు. ఈ సమీక్ష సమావేశాల్లో పలు కీలక అంశాలపై చర్చించడం జరిగిందని తెలిపారు. ఈ రాష్ట్రంలో క్రెడిబులిటి ఉన్న ఏకైక పార్టీ కాంగ్రెస్ మాత్రమే అన్నారు షర్మిల.
మత రాజకీయాలు చేస్తున్నందుకు బీజేపీ, హామీలిచ్చి మోసం చేసినందుకు వైసీపీ, ఇచ్చిన హామీలను అమలు చేయడంలో చేతులెత్తేస్తున్న టీడీపీ, జనసేన పార్టీలకు క్రెడిబులిటి లేదని ప్రజలకు అర్థమైందని తెలిపారు. ప్రజల్లో కాంగ్రెస్ పార్టీకి ఉన్న క్రెడిబులిటితో వారి సమస్యలపై అనునిత్యం పోరాటాలు చేయాలని, వారిలో భరోసా నింపే విధంగా కార్యక్రమాలు చేపట్టాలని, నియోజకవర్గాల వారీగా ప్రతి వారం రెండు సార్లు ప్రత్యేక సమావేశాలు నిర్వహించి క్యాడర్లో నూతన ఉత్తేజం నింపాలని, కార్యవర్గానికి సూచించడమైందన్నారు.