YS Sharmila: రాజకీయ నేతగాకన్నా.. వివాదాలతోనే నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. అనుచిత వ్యాఖ్యలు, ప్రవర్తనతో మరోసారి వార్తలకెక్కారు. ఈసారి ఏకంగా షర్మిల పోలీసుపైనే చేయి చేసుకున్నారు. ఇతర పోలీసులతోనూ దురుసుగా ప్రవర్తించారు. పోలీసులతో షర్మిల వ్యవహరించిన తీరుపైనే విమర్శలు వ్యక్తమవుతుంటే.. ఈసారి ఆమె తల్లి వైఎస్ విజయమ్మ కూడా మహిళా పోలీసుపై చేయి చేసుకున్నారు. దీంతో ఒకేరోజు తల్లీకూతురు పోలీసులతో వ్యవహరించిన తీరు వివాదాస్పదమవుతోంది.
మాజీ సీఎం, దివంగత వైఎస్సార్ కూతురుగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది షర్మిల. ఏపీలో తన అన్న వైఎస్ జగన్‌కు అప్పట్లో షర్మిల అండగా నిలబడ్డారు. ఆయన జైల్లో ఉన్నప్పుడు పార్టీని నడిపించారు. తర్వాత జగన్ జైలు నుంచి విడుదల కావడం, ఏపీలో పాదయాత్ర చేయడం, అధికారంలోకి రావడం జరిగిపోయాయి. 2019లో వైఎస్ జగన్ అధికారం చేపట్టినప్పటి నుంచి తల్లిని, చెల్లిని దూరం పెడుతూ వచ్చాడు. చివరకు అన్నకు దూరంగా వచ్చేసింది షర్మిల. తల్లి విజయమ్మ కూడా కూతురువైపే నిలబడింది. ఏపీ రాజకీయాలకు బైబై చెప్పేసిన ఇద్దరూ తెలంగాణలో రాజకీయం మొదలెట్టారు. విజయమ్మ గౌరవాధ్యక్షురాలిగా, షర్మిల అధ్యక్షురాలిగా తెలంగాణలో వైఎస్సార్టీపీని స్థాపించారు. 2021లో ఈ పార్టీ మొదలైంది. అయితే, ఇప్పటివరకు ఈ పార్టీ ఒకటుందని కూడా తెలంగాణలో చాలా మంది జనాలకు తెలియదంటే అతిశయోక్తి కాదు. రాజకీయంగా ఎదిగేందుకు షర్మిల ప్రయత్నిస్తున్నా పెద్దగా ఫలితాల్నివ్వడం లేదు. ఆమె పార్టీని తెలంగాణ సమాజం లెక్కలోకి తీసుకునే పరిస్థితి లేదు.
వివాదాలతోనే ప్రచారం
వైఎస్సార్టీపీ స్థాపించి దాదాపు రెండేళ్లు కావొస్తున్నా ఆ పార్టీకి తెలంగాణలో పెద్దగా మైలేజీ రాలేదు. షర్మిల తప్ప చెప్పుకోదగ్గ నేతలెవరూ ఆ పార్టీలో లేరు. పాదయాత్రలు, దీక్షలు చేస్తున్నా స్పందన కనిపించడం లేదు. కేవలం వివాదాలే ఇంతకాలం షర్మిల పేరు జనాల్లో నానేలా చేశాయి. అంతకుమించి ఆ పార్టీ గురించి చెప్పుకోవడానికేమీ లేదు. పాదయాత్ర సందర్భంగా వివిధ నేతలపై షర్మిల చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలపై ఎక్కువగా విమర్శలు చేసి, వివాదాలకు కారణమయ్యారు. పలుసార్లు పోలీసులతోనూ అనుచితంగా వ్యవహరించారు. సీఎం కేసీఆర్, కేటీఆర్ వంటి నేతలపై వ్యాఖ్యలు చేశారు. దీంతో స్థానిక బీఆర్ఎస్ నేతలు ఆమె యాత్రల్ని అడ్డుకున్నారు. ఆమెపై కార్యకర్తలు కేసులు నమోదు చేశారు. దీంతో పోలీసులు షర్మిలను అరెస్టు చేశారు. ఇలా పలు చోట్ల ఆమె యాత్రకు బ్రేక్ పడింది. పోలీసులు షర్మిల యాత్ర నిలిపివేశారు. కోర్టు అనుమతితో యాత్ర చేయాల్సివచ్చింది. అది కూడా అనేక షరతుల మధ్య అనుమతి లభించింది. జగ్గారెడ్డిపై చేసిన వ్యాఖ్యలతోపటు, హిజ్రాలపై చేసిన వ్యాఖ్యలు.. ఇలా చాలాసార్లు వివాదాలతో మాత్రం ప్రచారం తెచ్చుకోగలిగారు. ఇటీవల హైదరాబాద్‌లో ఆమె కారులో ఉండగానే, ఆ కారును పోలీసులు టో చేసుకుని వెళ్లడం సంచలనం కలిగించింది. ఇలా ఏదో ఒక రకంగా వార్తల్లో నిలుస్తున్నా పార్టీకి మాత్రం ఆదరణ దక్కడం లేదు.
అంచనాలు తలకిందులు
ఏపీలో వైఎస్ జగన్ పార్టీ పెట్టినప్పటి నుంచే ఆదరణ లభించింది. వైఎస్సార్ తనయుడిగా జగన్‌కు, ఆయన పార్టీకి మంచి క్రేజ్ వచ్చింది. షర్మిల తెలంగాణలో కూడా అదే ఆశించినట్లుంది. వైఎస్సార్ కూతురుగా ప్రజలు తనను ఆదరిస్తారని, తెలంగాణ రాజకీయాల్లో దూసుకెళ్లొచ్చని భావించింది. కానీ, ఆమె అంచనాలు తలకిందులయ్యాయి. పార్టీకి ఎలాంటి ఆదరణాలేదు. భవిష్యత్తులో పుంజుకునే అవకాశాలు కూడా లేవు. దీంతో ఏపీలో తన అన్నలాగా.. తెలంగాణలో పాగా వేయొచ్చని భావించిన ఆమెకు నిరాశే ఎదురైంది. దీంతో ఆమెలో చిరాకుస్థాయి పెరిగినట్లు అనిపిస్తోంది. షర్మిల అసహనంతో ఉన్నట్లు ఆమె వైఖరి చూస్తే అర్థమవుతుంది.
అసహనంతోనే పోలీసులపై దాడి
వైఎస్ షర్మిల, విజయమ్మ.. ఇద్దరూ సోమవారం పోలీసులపై చేయి చేసుకున్నారు. రాజకీయాల్లో ఇలా పోలీసులపై చేయి చేసుకున్న నేతలెవరూ కనిపించరు. అప్పుడప్పుడూ కొందరు నేతలు పోలీసులపై నోరుజారినా తర్వాత తమ తప్పు సరిదిద్దుకున్నారు. కానీ, షర్మిల, విజయమ్మ తీరు చూస్తుంటే వాళ్లలో అసహనం పెరిగినట్లు కనిపిస్తోంది. రాజకీయాల్లో సహనం చాలా అవసరం. ఓపికితో ఉండాలి. ఓటమిని అంగీకరించాలి. సరైన సమయం కోసం వేచి చూడాలి. సంయమనంతో వ్యవహరించాలి. కానీ, ఈ లక్షణాలేవీ షర్మిలలో కనిపించట్లేదు. షర్మిలను తెలంగాణ పోలీసులు అనేక రకాలుగా ఇబ్బంది పెట్టిన మాట వాస్తవం. అయితే, విధుల్లో ఉన్న పోలీసులపై చేయి చేసుకోవడం కచ్చితంగా పొరపాటే.
రాజకీయాల్లో కొన్నిసార్లు నేతలపై పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తుంటారు. తన అన్న జగన్ పాలిస్తున్న ఏపీలో కూడా పోలీసులది ఇదే తీరు. అక్కడ కూడా పోలీసులు ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తూ, అరెస్టు చేస్తున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ నేతలు మినహా బండి సంజయ్, రేవంత్ వంటి నేతల్ని కూడా పోలీసులు ఇబ్బంది పెట్టారు. కానీ, ఎవరూ ఎక్కడా పోలీసులపై దాడి చేయలేదు. మరి తోటి రాజకీయ నేతల్ని చూసైనా షర్మిల సంయమనంతో ఉండాల్సింది. కానీ, పోలీసులపై మీడియా సమక్షంలో షర్మిల, విజయమ్మ దాడి చేయడమంటే సాధారణ విషయం కాదు. ఇది షర్మిలకు ఇంకా రాజకీయ పరిపక్వత లేదనే విషయాన్ని రుజువు చేస్తోంది. దీనివల్ల పోలీసు కేసులు, అరెస్టులు. అంతకుమించి ఏ ప్రయోజనం లేదు. షర్మిల కోరుకున్న మైలేజీ వచ్చే ఛాన్స్ లేదు.