వచ్చే వాళ్లు రాకపోగా.. ఉన్నవాళ్లు కొత్త గుడారాలు వెతుక్కుంటున్న పరిస్థితి. వైటీపీ ఏర్పాటు తర్వాత.. పార్టీలో అనుకున్న స్థాయిలో జోష్ కనిపించలేదు. ఇంకా చెప్పాలంటే.. ప్రత్యర్థులు కూడా పట్టించుకోవడం మానేశారు. దీంతో షర్మిల ఆలోచన మార్చుకున్నారు. ఎలాగైనా సరే చర్చలో ఉండాలని ఫిక్స్ అయినట్లుగా కనిపిస్తున్నారు. మంత్రులు ఎప్పుడో చేసిన కామెంట్లను ఆ మధ్య ప్రస్తావించింది.. ప్రగతిభవన్ ముట్టడి అంటూ కారు స్టార్ట్ చేసి అరెస్ట్ అయింది. గాయం తగిలింది అని హడావుడి చేసింది. ఇప్పుడు పోలీసులపై దాడి చేసింది.. అన్నింటి వెనక ఒకటే కారణం.. అదే ఎలాగైనా చర్చగా మిగలాలని ! సిట్ ఆఫీస్‌కు వెళ్తున్నానని చెప్పి పోలీసుల చెంప చెళ్లుమనిపించడం, అరెస్ట్ కావడం అంతా ఇలాంటి ప్రచారం కోసమే.
పాదయాత్రతో మైలేజ్ రాలేదు. నిరాహార దీక్షతో ఆకలి మిగిలిందే తప్ప అనుకున్నది సాధించలేదు. మౌనదీక్ష చేసినా.. తమకోసం గొంతు చించుకున్న వాళ్లు లేకుండా పోయారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎలాగైనా పొలిటికల్ చర్చలా మిగలాలని షర్మిల ఫిక్స్ అయినట్లు కనిపిస్తున్నారు. దీనికోసం దూకుడు మంత్రాన్నే నమ్ముకునన్నట్లు కనిపిస్తున్నారు. అవకాశం అందుకోవడం వేరు.. అవకాశాలు క్రియేట్ చేసుకోవడం వేరు. ఇప్పుడు షర్మిల చేస్తోంది అవకాశాలు క్రియేట్ చేసుకోవడమే ! అందుకే ప్రతీ విషయాన్ని రచ్చ చేస్తున్నారు.
పాత విషయాలకు కొత్తగా మంటలు అద్దుతూ ఒకసారి.. కొత్త వివాదాలకు తెరలేపుతూ ఇంకోసారి.. ఇలా పొలిటికల్ అటెన్షన్ డ్రా చేసే ప్రయత్నం చేస్తున్నారు షర్మిల. ఇది ఏ మాత్రం ఫ్రస్ట్రేషన్ కాదు.. పక్కా వ్యూహం అన్నది చాలా మంది మాట. తెలంగాణలో వైటీపీకి లీడర్లే కాదు.. కేడర్ కూడా లేదు. భారీగా నిధులు ఉన్నాయ్.. ఖర్చు పెట్టేసి గెలుద్దాం అంటే.. అంత సీన్ లేదు. అందుకే వివాదాలనే నమ్ముకున్నారు షర్మిల. కావాలని కాంట్రవర్సీ క్రియేట్ చేస్తున్నారు. వివాదాల్లోంచి అటెన్షన్ పొందే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయం తెలిసే ప్రత్యర్థి పార్టీలు కూడా షర్మిలకు, వైటీపీకి దూరంగా ఉంటున్నాయ్.
ఆమె ఎన్ని కామెంట్లు చేసినా.. ఎంత రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా.. కనీసం రియాక్ట్ కావడానికి కూడా ముందుకు రావడం లేదు. ఒక్కటి మాత్రం నిజం. వివాదాలెప్పుడూ బలం కావు. వాపు మాత్రమే ! ఇవాళ్టికి మీడియాలో కనిపించినంత మాత్రాన.. అంత మనవైపే అనుకుంటే.. ఓటుతో కొడతారు జనాలు జాగ్రత్త ! ఇలాంటి కామెంట్లు, వివాదాలు క్రియేట్ చేసి.. నాలుగు రోజులు వార్తల్లో నిలిచి.. ఆ తర్వాత అదే వార్తల్లో గల్లంతు అయి.. చివరికి పార్టీ ఉనికి లేకుండా పోయిన వాళ్లు ఎంతోమంది ఉన్నారు ! కేఏ పాల్ దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. ఆయన చేసిన కామెంట్లు, విసిరిన సవాళ్లు అన్నీ ఇన్నీ కావు. ట్రోల్స్, మీమ్స్‌గా మిగిలాయ్ తప్ప.. రాజకీయంగా ఆయనకు ఒరిగిందేమీ లేదు. మాటలను మాత్రమే నమ్ముకుంటే ఎదురయ్యే పరిస్థితి ఇదే ! షర్మిలక్క గుర్తుంచుకోవాల్సింది ఇదే అని తెలంగాణ జనాల అభిప్రాయం.