YS Sharmila: మహిళా రిజర్వేషన్ల బిల్లుకు మద్దతు కోరుతూ తెలంగాణ ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవిత వివిధ పార్టీలకు లేఖ రాసిన సంగతి తెలిసిందే. వైస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిలకు కూడా కవిత లేఖ పంపారు. ఈ లేఖపై షర్మిల స్పందించారు. ముందుగా తన తండ్రి కేసీఆర్ అధ్యక్షుడిగా ఉన్న బీఆర్ఎస్ పార్టీలో మహిళలకు ప్రాధాన్యం పెంచేలా చూడాలని కవితకు షర్మిల సూచించారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా షర్మిల ప్రకటన చేశారు.
కవిత కొంతకాలంగా పార్లమెంటులో 33 శాతం మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం ఉద్యమం చేస్తున్నారు. కొంతకాలం క్రితం ఢిల్లీలో ధర్నా కూడా నిర్వహించారు. తాజాగా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వాలని కోరుతూ దేశంలోని పార్టీలకు లేఖలు రాశారు. ఇదే క్రమంలో వైఎస్సార్టీపీ అధ్యక్షురాలిగా ఉన్న షర్మిలకు లేఖ రాశారు. దీనిపై షర్మిల ఘాటుగా స్పందించారు. “మహాత్మా గాంధీ కోరుకున్నట్లుగా మీరు (కవిత) చూడాలి అనుకుంటున్న మార్పును మీ నుంచే మొదలు పెట్టండి. మహిళా రిజర్వేషన్ కోసం పోరాడుతున్న మీరు ఒక ముఖ్యమంత్రికి, పార్టీకి అధ్యక్షుడు అయిన కేసీఆర్‌కు కూతురు. మీ తండ్రి నడిపిస్తున్న పార్టీలో 5 శాతం కూడా మహిళలకు చోటు లేదు. 2014లో ఆరుగురు మహిళా అభ్యర్థులే బీఆర్ఎస్ నుంచి పోటీ చేశారు. 2018లో నలుగురు మాత్రమే పోటీ చేశారు. ఈ విషయంలో కవితకు ఒక సూచన చేస్తున్నా. తమ పార్టీలో మహిళా అభ్యర్థులకు సీట్లు పెంచేలా చూడాలని కోరుతున్నా.
తన తండ్రిని ఒప్పించి, అధిక సీట్లు ఇప్పించుకుని, దేశానికి ఆదర్శంగా నిలవాలి. ఇటీవల బీఆర్ఎస్ ప్రకటించిన అభ్యర్థుల్లో మహిళలు ఏడు శాతం కూడా లేవు. బీఆర్ఎస్ పార్టీలో మహిళలకు 33 శాతం సీట్లు ఇప్పించాలి. బీఆర్ఎస్ ప్రకటించిన జాబితాపాటు ఒక కాలిక్యులేటర్ లింక్ కూడా పంపిస్తున్నా. మీ పార్టీ లిస్ట్ చూసి 33 శాతం ఇచ్చారా? లేదా? లెక్కబెట్టండి” అంటూ షర్మిల కవితకు సూచించారు. నిజానికి మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో కవితకు ఇలాంటి వ్యతిరేకతే ఎదురవుతోంది. సొంత పార్టీలో మహిళలకు అధిక స్థానాలు ఇప్పించుకోకుండా, ఇతర పార్టీలకు లేఖలు రాస్తే ప్రయోజనం ఏముంటుందని కొన్ని పార్టీల నేతలు విమర్శిస్తున్నారు.