YS SHARMILA: ఏపీలో కాంగ్రెస్ పార్టీని దెబ్బకొట్టిన వైఎస్ జగన్‌పై ప్రతీకారం తీర్చుకునేందకు ఆ పార్టీ రెడీ అయినట్లు కనిపిస్తోంది. తండ్రి వైఎస్సార్ పేరు చెప్పుకొని కాంగ్రెస్‌ను కోలుకోలేని దెబ్బతీసిన జగన్‌ను ఇప్పుడు అదే వైఎస్సార్ పేరుతో కొట్టేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. వైఎస్సార్ కూతురు షర్మిలను ఏపీలో రంగంలోకి దించబోతుంది. జగన్ లక్ష్యంగా షర్మిల ఏపీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారు.
తెలంగాణ కోడలిని, వైఎస్సార్ కూతురును అంటూ తెలంగాణ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు షర్మిల. వైఎస్సార్టీపీ పేరుతో పార్టీని స్థాపించారు. పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు, అధ్యక్షురాలి హోదాలో తెలంగాణ అంతటా పర్యటించారు. కానీ, ఏమాత్రం ఆదరణ దక్కలేదు. షర్మిలను పట్టించుకున్నవాళ్లేలేదు. దీంతో నెమ్మదిగా పరిస్థితి అర్థమైంది. తనకు ఇక్కడ రాజకీయ భవిష్యత్ లేదని అర్థం చేసుకుంది. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రతిపాదన వచ్చింది. వైఎస్సార్టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేయాలని కోరింది. ఈ విషయంలో షర్మిల కొన్ని డిమాండ్లు ఉంచింది. తాను తెలంగాణలోని పాలేరు నుంచి పోటీ చేస్తానని, తనతోపాటు అనుచరులకు పదవులు ఇవ్వాలని కోరింది. పదవులు ఇచ్చేందుకు అంగీకరించిన కాంగ్రెస్ అధిష్టానం.. తెలంగాణ నుంచి కాకుండా.. ఏపీ నుంచి ప్రాతినిధ్యం వహించమని కోరింది. దీనికి మొదట షర్మిల అంగీకరించనప్పటికీ.. తెలంగాణలో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఏపీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇటు తెలంగాణతోపాటు, అటు ఏపీలోనూ షర్మిల రాజకీయం చేస్తారు.
వ్యతిరేకిస్తున్న రేవంత్
షర్మిల రాకను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితోపాటు కాంగ్రెస్‌లోని ఒక వర్గం వ్యతిరేకిస్తోంది. షర్మిల కాంగ్రెస్‌లో చేరితే.. అది బీఆర్ఎస్‌కు అస్త్రంగా మారుతుందని కాంగ్రెస్ భావిస్తోంది. నిజానికి షర్మిల వల్ల తెలంగాణ కాంగ్రెస్‌కు పెద్దగా ఉపయోగం లేదు కూడా. వైఎస్సార్ ప్రభావం తెలంగాణలో పెద్దగా లేదు. షర్మిల పోటీ చేయాలనుకుంటున్న పాలేరులోనే ఆమెకు పరిస్థితులు అనుకూలంగా లేవు. అందుకే షర్మిలను తెలంగాణలో పార్టీలో చేర్చుకోవడం, పోటీ చేయించి ఓటమి మూటగట్టుకుని, నష్టపోవడం కంటే.. ఆమె ప్రభావం చూపగలిగే ఏపీ రాజకీయాల్లోకి పంపిస్తేనే బెటర్ అనే నిర్ణయానికి కాంగ్రెస్ వచ్చింది.
ఏపీకి షర్మిల.. ఎందుకంటే..
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి బాగానే ఉన్నప్పటికీ.. ఏపీలో దాదాపు కనుమరుగయ్యే పరిస్థితి నెలకొంది. దీనికి కారణం.. వైఎస్ జగన్. కాంగ్రెస్ పార్టీని ఎదిరించి, ఆయన వైఎస్సార్సీపీని స్థాపించారు. కాంగ్రెస్ నేతల్ని, ఓటర్లను తనవైపు తిప్పుకొన్నారు. ఏపీని విభజించిన పార్టీగా అక్కడ పార్టీపై వ్యతిరేకత ఉండగా.. జగన్ దీన్ని క్యాష్ చేసుకున్నాడు. దీంతో ఏపీలో కాంగ్రెస్ ఉనికేలేకుండా పోయింది. ప్రస్తుతం కాంగ్రెస్‌కు ఏపీలో ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా లేదు. గతంలో ఇక్కడ పార్టీ బలంగా ఉండేది. అందుకే మరోసారి ఏపీలో కాంగ్రెస్ బలపడాలని భావిస్తోంది. ఈ విషయంలో పార్టీని ముందుకు తీసుకెళ్లే నేతే కనిపించడం లేదు. అలాంటి సమయంలో అధిష్టానానికి షర్మిల మంచి ఛాయిస్‌గా కనిపించింది. తమ పార్టీ లేకుండా జగన్‌పై పగ తీర్చుకోవాలన్నా.. తిరిగి కాంగ్రెస్ పుంజుకోవాలన్నా షర్మిలతోనే సాధ్యమని కాంగ్రెస్ భావించింది. ఈ నేపథ్యంలో ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు షర్మిలకు అప్పగించేందుకు పార్టీ హైకమాండ్ సిద్ధమైంది. దీనికి మొదట్లో షర్మిల అంగీకరించలేదు. తాను తెలంగాణలోనే ఉంటానని చెప్పింది. అయితే, అవసరమైతే షర్మిలను కర్ణాటక నుంచి రాజ్యసభకు పంపుతామని హామీ ఇచ్చింది. పైగా తెలంగాణలో పరిస్థితులు అనుకూలంగా లేవని, పాలేరులో పోటీ చేసి ఓడిపోతే.. ఏపీలోనూ ఇమేజ్ దెబ్బతింటుందని నచ్చజెప్పింది. విషయం అర్థం చేసుకున్న షర్మిల త్వరలోనే కాంగ్రెస్‌లో చేరి, ఏపీ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తారు.
టార్గెట్ జగన్
షర్మిల ఏపీలోకి అడుగుపెడితే ప్రధానంగా నష్టపోయేది వైసీపీనే. వైఎస్సార్ కూతురుగా షర్మిలకు గుర్తింపు ఉంది. రాయలసీమ బిడ్డగా చెప్పుకోవచ్చు. రెడ్డి సామాజికవర్గంతోపాటు, క్రిస్టియన్ సామాజికవర్గం కూడా షర్మిలకు మద్దతుగా నిలుస్తుంది. వైసీపీకి మద్దతుగా నిలిచినవి ఆ రెండు సామాజిక వర్గాలే. అలాగే కాంగ్రెస్ ఓటు బ్యాంకు కూడా వైసీపీకి మళ్లడం జగన్ విజయానికి ఒక కారణం. ఇప్పుడు వాళ్లందరినీ తమవైపు తిప్పుకోవడానికి షర్మిల ఒక అస్త్రంగా ఉపయోగపడుతుంది. ఇంతకాలం వైసీపీకి ప్రధాన ఓటు బ్యాంకుగా ఉన్న వర్గాలపై షర్మిల ప్రభావం కచ్చితంగా ఉంటుంది. అలాగే వైఎస్సార్ పథకాల అమలులోనూ జగన్ నిర్లక్ష్యంగా ఉంటున్నారు. ఆరోగ్యశ్రీని సరిగ్గా అమలు చేయడం లేదన్న వాదన ఉంది. వైఎస్సార్ పాలనను తిరిగి తెస్తామని షర్మిల, కాంగ్రెస్ చెబితే.. ఆ ప్రభావం కూడా జగన్‌పై ఉంటుంది. దీంతో కొన్ని వర్గాల ఓట్లు దూరమైతే.. వైసీపీకి ఓటమి తప్పదు. దీంతో కాంగ్రెస్ గెలవకున్నా.. ఇతర పార్టీలకు అవకాశం ఉంటుంది. ఆ తర్వాత కాంగ్రెస్ బలపడే ఛాన్స్ ఉంటుంది. అదే జగన్ బలంగా ఉన్నంతకాలం కాంగ్రెస్‌కు ఛాన్స్ ఉండదు. అందుకే జగన్‌పైకి షర్మిలను దింపేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. 2024 ఎన్నికల్లోపు ఏపీ కాంగ్రెస్‌లో షర్మిల యాక్టివ్‌గా మారే ఛాన్స్ ఉంది.