మా అన్నకు భయపడుతున్నావా బాబు: షర్మిల

రేషన్ బియ్యం అక్రమాలపై విచారణకు స్పెషల్ సిట్ వేయడం సంతోషకరం అన్నారు వైఎస్ షర్మిల. మరి సోలార్ విద్యుత్ ఒప్పందాల్లో జరిగిన రూ.1750 కోట్ల ముడుపులపై విచారణ ఎక్కడ ? అని ఆమె నిలదీశారు.

  • Written By:
  • Publish Date - December 7, 2024 / 12:29 PM IST

రేషన్ బియ్యం అక్రమాలపై విచారణకు స్పెషల్ సిట్ వేయడం సంతోషకరం అన్నారు వైఎస్ షర్మిల. మరి సోలార్ విద్యుత్ ఒప్పందాల్లో జరిగిన రూ.1750 కోట్ల ముడుపులపై విచారణ ఎక్కడ ? అని ఆమె నిలదీశారు. బియ్యం మాఫియాపై పెట్టిన శ్రద్ధ.. అదానీ అక్రమ డీల్ పై ఎందుకు పెట్టలేక పోతున్నారని ప్రశ్నించారు. అమెరికా దర్యాప్తు సంస్థలు ఇచ్చిన నివేదికలకు విలువ లేదా ? అని మండిపడ్డారు షర్మిల. మాజీ ముఖ్యమంత్రి స్వయంగా లంచాలు తీసుకున్నారని నివేదిక ఇస్తే , నిజాలు నిగ్గు తేల్చే బాధ్యత మీది కాదా? అని ప్రశ్నించారు.

మీరు కూడా అదానీకి అమ్ముడుపోయారా? అంటూ మండిపడ్డారు షర్మిల. తీగ లాగితే మాజీ ముఖ్యమంత్రితో పాటు, అదానీని సైతం అరెస్టు చేయాల్సి వస్తుందని భయపడుతున్నారా? అని నిలదీశారు. నోరు విప్పకుండా, విచారణ చేయకుండా మౌనంగా ఉండేందుకు అదానీ మీకు ఎంత లంచాలు ఆఫర్ చేశారు? అని ప్రశ్నించారు. టీడీపీ ప్రతిపక్షంలో ఉండగా.. సేకీతో చేసుకున్న ఒప్పందంలో భారీ అవినీతి అన్నారని… టెండర్లు లేకుండా అదానీకి కట్టబెట్టడం అంటే పెద్ద ఎత్తున లంచాలు తీసుకున్నారని ఆరోపణలు చేశారని గుర్తు చేసారు.

గుజరాత్ లో రూ 1.99 పైసలు దొరికే సోలార్ విద్యుత్ ను రాష్ట్ర ప్రభుత్వం రూ.2.49 పైసలకు ఎలా కొన్నారని ఉద్యమాలు చేశారని 25 ఏళ్ల పాటు డీల్ అంటే రాష్ట్ర ప్రజల నెత్తిన లక్ష కోట్ల అదనపు భారం పడిందని చెప్పారనన్నారు. ఇది ప్రజలను అదానీ కోసం నిలువునా దోచి పెట్టడం అని చెప్పారని పేర్కొన్నారు. ఈ డీల్ రద్దు చేయాలని ఇప్పటి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ద్వారా హైకోర్టులో కేసు కూడా వేపించారన్నారు షర్మిల. తాము అధికారంలో వచ్చాక నిజాలు నిగ్గు తేలుస్తాం అని.. గొప్ప గొప్ప మాటలు చెప్పారన్నారు. మరి ఇప్పుడేమైంది చంద్రబాబు గారు? అంటూ మండిపడ్డారు షర్మిల.

అన్ని ఆధారాలు దగ్గర పెట్టుకొని, అధికారం దగ్గర పెట్టుకొని, మౌనంగా ఎందుకు ఉన్నారు సార్ ? అంటూ నిలదీశారు. అంటే ఆనాడు జగన్ గారు అదానీకి అమ్ముడు పోయారన్నారు. ఇప్పుడు మీరు అమ్ముడు పోయారు అనే కదా అర్థం అంటూ షర్మిల ఫైర్ అయ్యారు. మిమ్మల్ని కూడా తక్కెడలో అదానీ నిలబెట్టారు అనే కదా అర్థం అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబు గారిని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. అదానీ మిమ్మల్ని కొనకపోతే, అదానీ ఒప్పందాలపై ప్రతిపక్షంలో చేసింది నిజమైన ఉద్యమం అయితే, వెంటనే ACB ని మీ పంజరం నుంచి విడుదల చేయండని డిమాండ్ చేసారు. రూ.1750 కోట్ల ముడుపుల వ్యవహారంపై ఫాస్ట్రాక్ విచారణ జరిపించండని కోరారు.